Friday, 2 December 2016

గ‌డ‌ప‌దాట‌ని చేత‌లు

మాటలు కోట‌లు దాటితే... చేత‌లు గ‌డ‌ప‌ను కూడా దాట‌వ‌ని నానుడి. అచ్చంగా ఇది ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు విష‌యంలో స‌రిగ్గా స‌రిపోతుంది. ఆయ‌న భ‌జ‌న‌ప‌రుల‌కు మ‌రింత‌గా సూట్ అవుతుంది. ఒక సారి ప‌రిశ్ర‌మ‌లు ఏపీవైపు ప‌రుగులు తీస్తున్నాయ‌ని చెపుతారు. రెండో రోజే ఎంఓయు లు అమలు కాక‌పోవ‌డం ప‌ట్ల సీఎం సీరియ‌స్ అంటారు. మూడో రోజు అన్నీ మెగా ప్రాజెక్టుల‌తో రాష్ట్రం క‌ళ‌క‌ళ అంటారు. వీటిలో ఏది వాస్త‌వం అంటే స‌మాధానం క‌ష్ట‌మే. అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌శ్న‌ను ఎవ‌రైనా అడిగితే బాబు ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోతారు. మీరు ఎవ‌రి త‌ర‌పున మాట్లాడుతున్నారో మాకు తెలుసంటారు. ఇదో కుంటి సాకై కూర్చుంది. ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌మో.. చంద్ర‌బాబు అదృష్ట‌మో తెలియ‌దు కానీ... రాష్ట్రంలో ఏ వ్య‌తిరేక అంశం వ‌చ్చినా అది విప‌క్షానికి చుట్టేస్తున్నారు. ఆ విప‌క్షం ప‌నితీరు కూడా అలాగే ఉంది. స‌ర్కారు వారి ప్ర‌క‌ట‌న ఆశ్చ‌ర్యం గొలుపుతుంది. ఏపీలో భారీ పెట్టుబడులతో 44 మెగా ప్రాజెక్టులు. రూ.2,38,761 కోట్లపెట్టుబడులు. 11 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు. 5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్క ప్రాజెక్టులు. ఇంకా 3 సిమెంట్ ఫ్యాక్ట‌రీలు అట‌. జనవరిలో విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రూ.4.67 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయ‌ని ఊద‌ర‌గొట్టేశారు. ఏడాది కావ‌స్తున్నాఅవి కార్యరూపం దాల్చకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశార‌ని ప‌త్రిక‌లు ప‌తాక శీర్షిక‌ల్లో చెప్పి నెల కూడా కాలేదు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ విధానాన్ని అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారని ముఖ్య‌మంత్రి అంటున్నార‌ని చెప్పాయి. శాఖల మధ్య సమన్వయం లేక పరిశ్రమలు స్థాపించడం కష్టసాధ్యమవుతోంద‌ని చెప్పారట‌. ఇంత‌కూ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేయాల్సింది ఎవ‌రో ఏలిన‌వారే చెప్పాలి. 
 అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చెపుతున్న క‌థ‌లే మ‌ళ్లీ చెప్పుతున్నారు. పారిశ్రామికాభివృద్ధికి క్లస్టర్ ప్రాతిపదికన ముందుకు వెళుతోందట ఏపీ స‌ర్కారు. పీపీపీ పద్దతిలో ప్రత్యేకమైన పార్కులు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెప్ప‌డానికి బాగుంది. కానీ అనుమ‌తులు విష‌యం వ‌చ్చే స‌రికి నేరుగా లంచాలు ఇవ్వందే ప‌నులు కావ‌డం లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా భూ కేటాయింపులు స‌క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌లేదు. మ‌రి అభివృద్ధి?. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీఐఐసీ లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. ఇందులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త పార్కుల ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంత‌వ‌ర‌కు వాస్త‌వం అనుకున్నా ప్లాట్ ల ఎలాట్ మెంట్ విష‌యంలో మాత్రం ఘ‌న‌త‌వ‌హించిన పెద్ద‌లు చేతులు త‌డ‌పందే కేటాయింపులు చేయ‌డంలేదు. పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక పెట్టుబడుల రీజియన్లు, ప్రత్యేక పెట్టుబడి జోన్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీలు ఏర్పాట‌య్యాయి. సింగిల్ విండోలో అనుమ‌తులు అన్న‌చోట ఇన్ని క‌మిటీలు ఎందుకో తెలియ‌దు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ), విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ), కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)ల అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి ఏమైందో తెలియ‌దు. ఇక ఈ మూడు కారిడార్లకు అనుబంధంగా ఏడు పారిశ్రామిక నోడ్ లట‌. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి-ఏర్పేడు, కృష్ణా జిల్లా గన్నవరం-కంకిపాడు, కాకినాడ, విశాఖపట్నంలలో పారిశ్రామిక నోడ్ లు. ఇంకా అంగుళం ప్ర‌గ‌తి కూడా లేదు. నోడ్ ల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజన్సీ(జేఐసీఏ) వంటివి ఆర్థిక సహాయం అందిస్తాయని చెపుతున్న స‌ర్కారు ఎప్ప‌టికి ఈ ప‌నులు చేస్తుందో తెలియ‌దు. ఈ మూడు కారిడార్ల అనుసంధాన కేంద్రంగా ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్న మాట బాగుంది. కాకుంటే ఆలు లేదు.. చూలు లేదు చందంగా ఉంది. 14 రోజుల్లోనే అనుమ‌తులు ఎప్ప‌టికి అమ‌లయ్యేనో. 

No comments:

Post a Comment