ఓ బిచ్చగాడు దేవుడికి వెండి కిరీటాలు చేయించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఏ గుడి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశాడో.. ఆ గుడిలోని దేవుడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు. కొంత నగదును నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. నల్లగొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి(75) 11 ఏళ్ల వయసున్నప్పుడు జీవనోపాధి కోసం విజయవాడ వెళ్లాడు. యవ్వన దశ నుంచి వృద్ధాప్యం వరకు విజయవాడలోనే గడిపాడు. 45 సంవత్సరాలు రిక్షా తొక్కుతూ, ఇతర పనులు చేస్తూ జీవనం సాగించాడు యాదిరెడ్డి. వృద్ధాప్యంలో పని చేయడం చేతకాకపోవడంతో విజయవాడలోని వీధుల్లో, కోదండరామ ఆలయం వద్ద భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అయితే యాదిరెడ్డికి వివాహం కాలేదు. దీంతో భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన ఖర్చులకు పోనూ.. మిగిలిన నగదును ఆధ్యాత్మికం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోదండరాముడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు. వాటికి రూ. 1,50,000 ఖర్చు అయింది. అంతే కాకుండా రూ. 20 వేలను నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు. కొద్దికాలం క్రితం సాయినాథుడికి కూడా వెండి కిరీటాన్ని చేయించి ఇచ్చాడు. దేవుడే తనకు గొప్ప శక్తి, ధైర్యం అని యాదిరెడ్డి చెప్పారు. దేవుడి దయ వల్లే ఇంతకాలం జీవించగలిగానని భావోద్వేగానికి లోనయ్యారు. దేవుడికి చిన్న కానుక ఇవ్వాలని నిర్ణయించుకుని వెండి కిరీటాలను చేయించానని తెలిపారు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని పేర్కొన్నారు.
No comments:
Post a Comment