దేశమిట్టా తగలడి పోతోంది... అరె.. అరె.. దేశమాతే ఆహుతి అవుతోంది... ఎప్పటికప్పుడు నాయక నక్కలు కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తూ ఉంటే... చాలా కాలం క్రితం వచ్చిన ఓ సినిమాలో పాట ఇది. అదేం చిత్రమో ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎప్పటికప్పుడు ఇది ఆరోజు కోసమే రాసినట్లు అనిపిస్తుంది. నాయకులు నక్కలో, కుక్కలో కాదుగానీ వారి నిర్ణయాలలోని నిజాయితీ మాత్రం ప్రతినిత్యం ప్రశ్నార్ధకంగా మారుతోంది. నల్లడబ్బు నిర్మూలన కోసం డిమానిటైజేషన్ అని ప్రధాని ప్రకటించారు. ఆర్భాటం బాగానే సాగింది. ప్రజలు డబ్బే కాదు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఎవరైతే నల్లకుబేరులు అని చెప్పారో వారిలో ఒక్కరు కూడా బ్యాంకుల ముందు నిల్చోలేదు. వారి వద్ద ఉన్న బ్లాక్ అంతా మారిపోయింది. రెండువేల రూపాయల నోట్లు అందుకు మరింత సౌలభ్యం కలిగించాయి. బ్యాంకర్లు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి కావాల్సిన కమిషన్ మాట్లాడుకొని మరీ రద్దైన నోట్లు మార్చారు. ఇందుకు ప్రత్యేకంగా సాక్ష్యాలు అవసరం లేదు. ఎందుకంటే నిత్యం ఐటీ దాడుల్లో దొరుకుతున్న భారీ నగదు చాలు వాస్తవం ఏంటో చెప్పడానికి. సరే ఈ కథంతా ఓకే. ఈ లోపు సామాన్యుణ్ఙి అవహేళన చేసేలా మన నేతలు వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీ సొత్తుదారుల మూతులు నాకే ఈ వెంగళప్పలకేం తెలుసు సామాన్యుడి కష్టాలు.
బ్యాంకు ముందు క్యూలో నిల్చున్న తల్లి పాలకోసం తల్లడిల్లుతున్న పాప ప్రాణం తన దేశభక్తిని నిరూపించు కుంటున్నది. వ్యాధులకు సరైన మందులు కొనలేని ఓ వృద్ధుడి గుండె దేశభక్తిని ప్రతిధ్వనిస్తున్నది. సరిహద్దుల్లో సైన్యం చేయాల్సి న పనిని బ్యాంకుల ముందే చేస్తున్న ప్రజలు దేశభక్తిని చాటి చెపుతున్నారు. దుష్టశక్తుల దాడుల నుంచో, శత్రువుల దురాక్రమణల నుంచో జనాన్ని రక్షించడం కోసం దేహాన్ని ధైర్యం చేసి దేశం జెండా అయి ఎగరేయటం దేశభక్తి. కానీ, బ్యాంకు ముందు నిలబడటం, ఏటీఎంల చుట్టూ మానవహారాలై పహారా కాయటం ఏమి దేశభక్తి. రాజధర్మం ఒకటుంది. ప్రజారంజకంగా పాలన సాగించాలి. ద్రోహులను శిక్షించి ప్రజను కాపాడాలి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ద్రోహుల పేరుతో ప్రజలపైనే యుద్ధానికి తెగబడ్డారు రాజ్యపాలకులు. వారు చేసిన దానికి తలలు అర్పించడమే దేశభక్తి అట. ఇదెక్కడి న్యాయం. మన బొంకయ్య గారు... సారీ వెంకయ్య గారు ముప్పై రోజుల్లో 33 మాటలు మాట్లాడారు. మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే ఉస్కో అందని సామెత. మరి ఈయన కూడా ఈ బాపతే కదా?.. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలు ఎప్పుడూ ఈ మాటకారి శిఖండికి పట్టం కట్టలేదు. వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే వారిని పట్టుకోవడం కోసం కోట్లాది మందిని ఇన్ని రోజులుగా హింసించడం దేనికి? పన్నులు కట్టని వారిని వెన్నుల్లో దాచుకుని ప్రజలపై పగదీర్చుకునే పద్ధతులు ఎందుకు? 70ఏండ్ల అవినీతిని వెలికితీస్తాం అంటే అర్థం బ్యాంకులతో సంబంధంలేని ప్రజల డబ్బు వెెలికితీసి వారిని తెచ్చి బ్యాంకుల ముందు పడవేయటమా? నల్లధనం అంతుచూస్తాం అంటే మంచిదే అనుకున్న వారు కూడా ఇప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. గడిచిన నెల రోజుల నుంచి సామాన్యులు బ్యాంకుల ముందు నిలబడ్డట్టుగానే నల్లధన స్వాములు కోర్టుల ముందు, జైళ్ళ ముందు ఎక్కడైనా నిలబడ్డారా? సొమ్మసిల్లి పడి పోయారా? మరి వారికి లేదా దేశభక్తి?
ఆదాయ పన్నుశాఖ, అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజన్స్ వ్యవస్థ, సకల అధికార యంత్రాం గాలన్నీ కలిసి నల్లకుబేరులను పట్టుకోలేక పోయాయట. ఈమాట చెప్పడానికి విడిచేసిన నాయకులకు సిగ్గులేదనుకోండి. నిజానికి ఇండియాలో అధికారంలో ఉన్న ఎవరైనా బ్లాక్ కుబేరులతో వేరుచేసి చూడలేం. ఏడు వేల కోట్ల రూపాయలను ఎగవేసి దేశందాటిన కింగ్‌ఫిషర్ అధినేత విజయమాల్యా సాక్షాత్తు బీజేపీి రాజ్యసభ సభ్యుడు. ఇలాంటి వారు అనేకమంది పార్లమెంట్‌లో కొలువుదీరడమే నిదర్శనం. బీజేపీ అధికారంలోకి వచ్చాక 5లక్షల 89వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల పన్ను మాఫీ చేసింది.. మొండి బకాయిల కింద పరిగణించి 1,14,182 కోట్ల రూపాయలు కార్పొరేట్ల అప్పులను రద్దు చేశారు. కరువులో ఉండి అప్పులు కట్టలేని రైతులకు మాత్రం భూమిని వేలం వేస్తామని నోటీసులు జారీచేస్తున్నారు. స్విస్ బ్యాంకులలో దాగి ఉన్న అసలైన నల్లధనాన్ని ఇండియాకి తెప్పిస్తామని పలికిన చిలక పలుకులు మరిచారు. అందుకు భిన్నంగా 2015 మే 6 నుండి 2 కోట్ల 5 లక్షలు విదేశీ అకౌంట్లలో జమ చేసుకోవచ్చనే అవకాశం ఇచ్చారు. ఈ కాలంలో 30 వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయింది. ఇదంతా దేశభక్తిగానే పరిగణించాలిప్పుడు. లేదంటే దేశద్రోహులైపోతారు మరి.
ఈ 70ఏండ్ల స్వాతంత్య్రంలో 74 శాతాన్ని మించని అక్షరాస్యులలో అత్యధిక శాతంమంది ఆంగ్లం రాని నిరక్షరాస్యులేనన్న సంగతి మరువరాదు. 24కోట్ల 84లక్షల కుటుంబాలున్న మన దేశంలో 12కోట్ల 76లక్షల కుటుంబాలకు మాత్రమే బ్యాంకు అకౌంట్లున్నాయని ఒక అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లోనే అమలుగాని క్యాష్‌లెస్ సిస్టమ్ 90శాతంపైగా కరెన్సీపై ఆధారపడిన ఇండియాలో ఎలా సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో కావాల్సింది డార్క్‌లెస్, ఇల్లిటరీలెస్, ఇంగ్లీష్ ఇల్లిటరీలెస్ సిస్టమ్. అంతేకాని అడ్డమైన నిర్ణయాలతో చేతిలో ఉన్న కాసిన్ని నోట్లను కూడా లాగేసుకుని సామాన్యుడిని క్యాష్‌లెస్‌గా నిలువుదోపిడీ చేయటం కాదు.
మూతబడ్డ ఏటీిఎం నోరు తెరుచుకుని ఎప్పుడైనా నోట్లను కక్కక పోతుందా? అని ఎదురుచూసే జంటలెన్నో. అలుపు, సొలుపు, ఆకలి దప్పులు అన్నిటికీ దూరమై ముగిసిపోయిన ఘడియలెన్నో. నోట్ల రద్దా? నోట్లోకి పోయేవన్నీ రద్దా? అనేది అర్థంగాకుండానే మిగిలింది. ఏ కోటో వేసుకున్న కోటీశ్వ రుడు ఈ దెబ్బకి బయటపడకపోతాడా? వాడి అంతు ఈ దమ్ము న్న పాలకుడు చూడకపోతాడా? అని ఎదురు చూసినవారూ లేకపోలేదు. అందుకే బండరాయి లాంటి ప్రభుత్వ నిర్ణయాన్ని గుండెరాయి చేసుకుని భరించి ఎదురుచూసిన వారికి ఎండమావే మిగిలిపోయింది. ఈ కష్టకాలంలో కాళ్ళను క్యూలో బెట్టి సమస్త పంచేంద్రియాలను పొడుచుకుని చూసినా ఒక్కడంటే ఒక్కడు కూడా నల్లధనస్వామి ప్రజలకు ప్రత్యక్షమవలేదు. ఇంతకీ దొంగలెవరు? దొరలెవరు? ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో శత్రువులెవరు? మిత్రువులెవరు? నల్లధనమేది? తెల్లధనమేది? చీకట్లో తమ నీడని చూసుకుని తామే భయపడినట్టు, తమ చేతిలో ఉన్న డబ్బుని చూసుకుని తమని తామే అనుమానించుకునే స్థితిలోకి, నానా అవస్థల్లోకి నెట్టబడ్డారు. ఎక్కడైనా శత్రువులు ఒత్తిడికి గురి కావాలి. దొంగలు రోడ్డున పడాలి. నల్లధన స్వాములకు శిక్ష పడాలి. అలా జరగట్లేదు. జనం ఇబ్బందులకు గురవుతున్నారు. సగటు జీవులు రోడ్డునపడ్డారు. ఈ తతంగంలో నల్లధనం అంతా తెల్లధనమైపోయింది. తెల్లధనం అంతా నల్లధనమేమో అన్న అనుమానంతో లోకం విస్తుపోతున్నది. కమల్‌హాసన్ లాంటివారు నటనలో జీవితాన్ని వెతుక్కుంటున్నారు. కానీ నటనకు అణుమాత్రం సంబంధం కూడా లేని ఈ దేశ ప్రధాన పౌరుడు జీవితం ఆసాంతం నటనను పులుముకుని ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతున్నారు. ఆ నటనా కౌశల్యాన్ని ప్రజలు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారో వేచి చూడాల్సిందే.
(ఎం. విప్లవ కుమార్, రాసిన వ్యాసం నుంచి కొంత భాగం ఉపయోగించుకోవడం జరిగింది)
No comments:
Post a Comment