నడినాత్రి. సలిగొడ్తున్నది. మొగులు మీద సుక్కలు మెరుస్తున్నయి. అందరు పండుకున్నరు. కొందరు కలల బజార్ల తిర్గుతున్నరు. ఇంకొందరు కల్వరిస్తున్నరు. కుక్కల మొర్గుడు దప్పిడ్సి యాడ సప్పుడు లేదు. జీపుల పోలీసోల్లు గస్తి దిర్గుతున్నరు. దొంగలు మోక కోసం ఎదురుసూస్తున్నరు. జిద్దు ఇడ్వని విక్రమార్కుడు సైకిల్ దీస్కోని ఇంట్ల కెల్లి ఎల్లిండు. గాయిన దినం పూట మంచిగ బంటడు. నాత్రి పూట డ్యూటిజేస్తడు. సైకిల్ దొక్కుకుంట గాయిన బొందలగడ్డ దిక్కు బోబట్టిండు. బొందలగడ్డ కాడ ఉన్న అర్రల బేతాలుడు ఉంటున్నడు. గానికి పెండ్లాం పిల్లలు లేరు. విక్రమార్కుని లెక్కనే గాడు సుత నాత్రి పూటనే డ్యూటి జేస్తడు. పొద్దుమీకినంక గాడు నిద్రలేసిండు. గానికి వొండుకోబుద్ది గాలేదు. ఇగ దాంతోని గాడు హౌటల్కు బోయిండు. బిర్యాని దిన్నడు. తిన్నంక సిగిలేటు దాక్కుంట ఇంటికొచ్చిండు. ఇంట్ల టివి జూస్కుంట గూసున్నడు. సరింగ నాత్రి రొండు గొట్టంగ బేతాలుని ఇంటి ముంగట విక్రమార్కుడు సైకిల్ రుకాయించిండు. రుకాయించి గంటి బజాయించిండు. సైకిల్ గంటి సప్పుడినంగనే బేతాలుడు ఇంట్ల కెల్లి ఇవుతలకొచ్చిండు. సైకిలెన్క గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు సైకిల్ దొక్కబట్టిండు. గప్పుడు సైకిలెన్క గూసున్న బేతాలుడు.
''నన్ను గూసుండబెట్టుకోని ఎత్తుగడ్డలని సూడకుంట సైకిల్ దొక్కుతవు. నీకు దమ్ము రావొచ్చు. నీ కాల్లు గుంజొచ్చు. గవన్ని యాదిమర్సెతందుకు నీకొక కత జెప్త ఇను. పెద్దనోట్లు బందై ఐదువారాలైంది. అయినంక గూడ జెనం కస్టాలు దీరలేదు. బేంకుల కాడ ఎటిఎంల కాడ జెనం క్యూగట్టబట్టిండ్రు. ఒకల్ల నొకలు నూకోబట్టిండ్రు. కొట్లాడబట్టిండ్రు. క్యూల నిలబడ శాతగాక కొంతమంది బేహౌషయ్యిండ్రు. నూరుల టొంబైఎన్మిది ఎటిఎంలు పనిజేస్త లెవ్వు. ఎటిఎం అంటె ఎనీటైం మూత అనబట్టిండ్రు. పెద్దనోట్ల బంద్ మీద దినాం లొల్లి అయ్యెబట్కె లోకసబ, రాజ్జెసబ నడ్వకుంటయినయి. ప్రతాని లోకసబకు బోతలేడు. ప్రతాని లోకసబకొచ్చి పెద్దనోట్ల బంద్ మీద మాట్లాడాలని అపొజిసనోల్లు ఒక్క తీర్గ లొల్లి బెట్టబట్టిండ్రు. ప్రతాని ఒకపారి దొడుక్కున్న పదిలచ్చల రూపాల కోటు బ్లాక్‌మనీతోని కొన్నదో గాదో చెప్పాలని రాహుల్ గాంది అన్నడు. టూ జి, బొగ్గు స్కాంలతోని సంబందమున్నోల్లు నాలుగు వేల రూపాల గురించి బేంకు కాడ క్యూల నిలబడ్డరని ప్రతాని మోదీ అన్నడు. ఒక దిక్కు చిల్లర దొర్కక జెనం సస్తుంటె ఇంకొ దిక్కు కోట్ల రూపాల కర్సుతోని గాలిజనార్తన్ రెడ్డి బిడ్డ పెండ్లిని దూందామ్గ జేసిండు. ఒక బిజెపి లీడర్ ఇంట్ల లచ్చల కొద్ది రొండువేల రూపాల నోట్ల కట్టలు దొర్కినయి.
బేంకుకు బోయే ముంగట ఒకడు జోతిస్యంజూసెటోని తానికి బోయిండు. చెయ్యిసూబెట్టుకుండు.
''ఇయ్యాల నాకు దన ప్రాప్తి ఉన్నదో లేదో చెయ్యి జూసి చెప్పుండ్రి'' అని అన్నడు.
''గిట్లెందుకు అడుగుతున్నవు.'' అని చెయ్యిజూసెటోడు అడిగిండు.
''నా వొంతు వొచ్చెతల్కె బేంకుల పైసలుంటయో లెవ్వో ఎర్కజేస్కునేతందుకు గిట్ల అడుగుతున్న'' అని గాడు అన్నడు.
ఒక జీతగాడు ఆపిసర్ తాన్కి బోయి
''ఇయ్యాల తాతీల్ గావాలె సార్'' అని అన్నడు.
''నిన్ననే తాతీల్ దీస్కున్నవు.మల్ల ఇయ్యాల ఎందుకు?'' అని ఆపిసర్ అడిగిండు.
''నిన్న బేకుంల పైసలు దొర్కలేదు'' అని గాడు అన్నడు.
''ఒగాల్ల ఇయ్యాల గూడ దొర్కకుంటె ఏం జేస్తవు?'' అని ఆపిసర్ అడిగిండు.
''రేపు గూడ తాతీల్ దీస్కోని బేంకుకు బోత'' అని గాడు అన్నడు.
ఒకడు పెండ్లాన్ని గొట్టిండు.పెండ్లాన్ని గొట్టినందుకు ఆని మీద కేసు పెట్టిండ్రు.గాన్ని అదాలత్‌కు దీస్కబోయిండ్రు.
''పెండ్లాన్ని గొట్టినందుకు వెయ్యి రూపాల జుర్మాన గట్టు '' అని జడ్జి అన్నడు.
''నా పెండ్లాన్ని ఇంకొక పారి గొడ్త'' అని గాడు అన్నడు.
''తల్కాయ గిన దిర్గుతున్నదా.తిక్కలెక్కల్ జేస్తున్నవు'' అని జడ్జి అన్నడు.
''నాతాన చిల్లర లేదు సార్.రొండువేల రూపాల నోటు ఉన్నది. ఇంకొకపారి నా పెండ్లాన్ని గొట్టి రొండు వేలరూపాల జుర్మాన గడ్త '' అని గాడు అన్నడు.
ఒక జీతగాడు పెండ్లాన్ని బిల్సిండు.
''ఏం గావాలె'' అని గామె అడిగింది.
''టూత్‌పేస్తు నా బట్టలు ఒక బ్యాగ్‌ల బెట్టు'' అని గాడు అన్నడు.
''మంచిది'' అని గామె అన్నది .
''యాదిమర్సిన అంబటాల్ల,నాత్రికి బువ్వ గూడ ఒక డబ్బల బెట్టు'' అని గాడు అన్నడు.
''ఏంది ఆపీస్ పని మీద దౌరకు గిన బోతున్నరా'' అని గామె అడిగింది.
''లే.ఎటిఎంకు బోతున్న'' అని గాడు అన్నడు.
మోటర్ సైకిల్ మీద ఒకడు సడక్ మీదికెల్లి బోతున్నడు.ట్రాపిక్‌పోలీసోడు గాన్ని రుకాయించిండు.రుకాయించి
''నీ డ్రైవింగ్ లైసెన్స్ సూబెట్టు'' అని అన్నడు.
''లేదు'' అని గాడు అన్నడు.
''సి బుక్ సూబెట్టు '' అని పోలీసోడు అన్నడు.
''గది గూడ లేదు'' అని గాడు జెప్పిండు.
''జుర్మాన గట్టు '' అని పోలీసోడు అన్నడు.
''ఎంత గట్టాలె'' అని గాడు అడిగిండు.
''రొండు నూర్లు'' అని పోలీసోడు అన్నడు.
గాడు కీసల కెల్లి రొండు వేల రూపాల నోటును దీసి పోలీసోనికి ఇచ్చిండు.పోలీ
సోడు రొండు వేల రూపాల నోటు దీస్కోని ఆనికి చిల్లర ఇచ్చిండు.
''సార్ తాన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది.సి బుక్ గూడ ఉన్నది'' అని గాడు అన్నడు.
''అన్ని ఉన్నంక జుర్మాన ఎందుకు గట్టినవు'' అని పోలీసోడు అడిగిండు
''పొద్దుగాల్ల కెల్లి చిల్లర కోసం దిర్గుతున్న.యాడ దొర్కలేదు.గిప్పుడు జుర్మాన గట్టిపిచ్చుకోని మీరు చిల్లర ఇచ్చిండ్రు'' అని గాడు అన్నడు.
''బేంకుకు బోయె ముంగట ఇయ్యాల మాకు పైసలు దొర్కాలని జెనం దేవుల్లకు మొక్కబట్టిండ్రు.బేంకుల నోట్లు దొర్కిన్నంక గూడ దేవుల్లకు ఎందుకు మొక్కిండ్రు.గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ సైకిల్ పంపుచరవుతది'' అని బేతాలుడు అన్నడు.
''బేంకుల రొండువేల రూపాల నోట్లనే ఇస్తున్నరు.రొండువేల రూపాలకు చిల్లర దొర్కెటట్లు సూడుమని జెనం దేవుల్లకు మొక్కబట్టిండ్రు.'' అని విక్రమార్కుడు జెప్పంగనే బేతాలుడు సైకిల్ దిగి బొందల గడ్డ దిక్కు ఉర్కిండు.
(నవతెలంగాణలో ప్రచురించిన తెలిదేవర భానుమూర్తి వ్యాసం)
No comments:
Post a Comment