ఒక గీతను చిన్నదిగా చేయాలంటే దానిపక్కనే పెద్దగీత గీయాలంటారు. మన పాలకులకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఎలాంటి అవినీతి కేసులైనా ప్రజల దృష్టి మరల్చడంలో వారు సిద్ధహస్తులు. ఇదేదో సాధారణ విషయంగా చూస్తే ఇబ్బందే. ఎందుకంటే ఇప్పడు చెప్పేది సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించిన విషయం మరి. సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆదాయపన్ను శాఖకు ఓ లేఖ రాసారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన అంశంపై దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. ఇది సాధారణ విషయం కాదు కధా. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ ‘డీమానిటైజేషన్’ ప్రకటించారు. దీనితో ప్రశాంత్ భూషణ్ అంశం అసలు తెరమీదకే రాలేదు. స్వరాజ్ అభియాన్ సంస్థ వ్యవస్థాపకుడు ఆయన. దేశాన్ని కుదిపేసిన 2జీ, బొగ్గు కుంభకోణాల అంశం సుప్రీం కోర్టు వరకు వెళ్లడానికి కారకుడు. వాస్తవంగా కాగ్ నివేదిక ద్వారా ఈ కుంభకోణాలు బయటకు వచ్చాయి. వాటిపై సీబిఐ విచారణ కోరడంద్వారా దేశ ప్రజల దృష్టి అటు మళ్లింది.
ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సాధారణ దాడుల్లో సహారా కంపెనీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తమ పనుల కోసం భారీగానే ముడుపులు ఇచ్చిన విషయం బయటపడింది. తర్వాత సిబిఐ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సంస్ధల ముందుకు వచ్చాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, బ్లాక్ మనీపై మోడి నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకు కూడా వచ్చాయి.నవంబర్ 8 తేదీన ప్రధాని మోడి ‘డీమానిటైజేషన్’ ప్రకటన చేయడానికి సరిగ్గా రెండు వారాల ముందు అక్టోబర్ 25, 2016 తేదీన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల నేతృత్వం లోని స్వరాజ్ అభియాన్ కేంద్ర దర్యాప్తు సంస్ధల దృష్టికి తెచ్చింది. 2014 నవంబరులో ఆదాయ పన్ను శాఖ సహారా గ్రూపు కంపెనీల కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 30, 2013 నుండి ఫిబ్రవరి 21, 2014 వరకు అనేక మంది రాజకీయ నాయకులకు చెల్లించిన ముడుపుల వివరాలు ఈ డైరీల్లో లభించాయి. ముడుపులు అందుకున్న వారిలో ప్రధాని మోదీ కూడా ఒకరు. అప్పటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. ‘మోడి జీ’ అనే వ్యక్తికి ఈ నాలుగు నెలల కాలంలో 8 సార్లు ముడుపులు ముట్టాయని డైరీల ఆధారంగా తయారు చేసిన నివేదికలో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో ‘జైస్వాల్ జీ’ అనే వ్యక్తి ద్వారా ‘మోడి జీ’ కి ముడుపులు ముట్టాయని సదరు నివేదిక నిర్ధారించింది. 8 విడతలుగా సహారా కంపెనీ ‘మోడీ జీ’ కి రు 40.10 కోట్లు ముట్టజెప్పిందని పేర్కొంది. ఆదాయపన్ను శాఖ మోడీకి సంబంధించిన ముడుపుల భాగోతం బయటకు తెచ్చే సమయంలోనే బిజేపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా తన స్ధానాన్ని ఖాయం చేసుకునే పనిలో మోదీ ఉన్నారు. ఒక్క మోదీ మాత్రమే కాదు సహారా ముడుపులు మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అక్టోబర్ 2013లో ఆదాయ పన్ను శాఖ బిర్లా కంపెనీ కార్యాలయాలపై దాడి చేసినపుడు స్వాధీనం చేసుకున్న రికార్డులలో కూడా మోడి పేరు కనిపించింది. “సిఎం గుజరాత్” కు రు 25 కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్లు రికార్డుల్లో ఉంది. ఈ రికార్డుల ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు బిర్లా కంపెనీ అధికారులను విచారించారు. వారు మరోలా బుకాయించారు. సహారా కంపెనీ అధికారులు అలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఆధారాలు దొరికినప్పటికీ ఆదాయ పన్ను అధికారులు గానీ, సిబిఐ గానీ దర్యాప్తునకు ముందడుగు వెయ్యలేదు. ఆదాయ పన్ను శాఖ అధికారి వహించిన మౌనానికి సరైన ఫలితమే వచ్చింది. సహారా, ఆదిత్య బిర్లా కంపెనీల ముడుపులపై విచారణ చేసిన బృందానికి నాయకత్వం వహించిన అధికారి కే బి చౌదరి జూన్ 2015లో సివిసి అధిపతిగా నియమితుడయ్యాడు.
ప్రశాంత్ భూషణ్ సహారా, ఆదిత్య బిర్లా ముడుపుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అక్టోబర్ 25, 2016 తేదీన ఈ వ్యవహారంపై విచారణ చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశాడు. దానికి బదులు లేదు. తిరిగి నవంబర్ 8 న లేఖ రాశారు. ఆ రోజే ప్రధాన మంత్రి మోడి దూరదర్శన్ లో ప్రత్యక్షమై జాతినుద్దేశించి ప్రసంగించారు. అధికారిక ప్రకటన కోసం ఒక టివి చానెల్ లో ప్రధాని మోడి ప్రసంగించడం అదే మొదటిసారి. భూషణ్ చెపుతున్న ప్రకారం అక్టోబర్ 25 న తాను లేఖ ద్వారా మోడి అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్ధల దృష్టికి తేవడం, అనంతరం నవంబర్ 8 తేదీన ఫాలో అప్ లేఖ రాయడం.. ఇవన్నీ అధికారిక చానెళ్ల ద్వారా ఆర్ధిక మంత్రిత్వ శాఖ దృష్టికి, ఇతర ప్రభుత్వ సంస్ధల దృష్టికి వెళ్ళాయి. దాని ఫలితంగానే తన అవినీతిపై చెలరేగనున్న దుమారాన్ని ముందుగానే కవర్ చేసుకోవడానికి హడావుడిగా, ఆర్భాటంగా, ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ప్రధాన మంత్రి మోడి ‘నోట్ల రద్దు’ ప్రకటించారు. బిజేపి ఎంపి, సుప్రీం కోర్టు క్రిమినల్ లాయర్ రామ్ జేఠ్మలాని కూడా “నవంబర్ 8 నాటి ప్రకటన అతి పెద్ద కవరప్ అని చెప్పడానికి అవసరమైన అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి” అని ఫ్రంట్ లైన్ పత్రికతో చెప్పారు. కనుక డీమానిటైజేషన్ చర్యకు మోడిని, బిజేపి ప్రభుత్వాన్ని ప్రేరేపించిన తక్షణ కారణం మోడి పైన త్వరలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి రానుండడమే అని ప్రశాంత్ భూషణ్ చెపుతున్న అంశాలద్వారా అర్ధం అవుతోంది. ‘డీమానిటైజేషన్ చర్య’ ఎలాగూ 2011 నుండి వాయిదా పడుతూ వస్తున్నదే. బహుళజాతి కంపెనీలకు హామీ ఇచ్చిన ‘డిజిటైజేషన్’ సంస్కరణ కోసమే ఆధార్ కార్డ్ కు చట్టబద్ధత, జన్ ధన్, ఈ-కామర్స్ రిటైల్ అమ్మకాలకు 100% అనుమతి తదితర సంస్కరణ చర్యలను మోడి ప్రభుత్వం అమలు చేసింది. డీమానిటైజేషన్ వల్ల కలిగే ఇబ్బందుల దృష్ట్యా వెనకా ముందూ ఆలోచిస్తున్న క్రమంలో ప్రశాంత్ భూషణ్ తన లేఖల ద్వారా భవిష్యత్తు చూపించాడు.
No comments:
Post a Comment