Sunday, 4 December 2016

క‌ల‌వ‌రం... పోలవ‌రం

పోలవరం ఓ సుదీర్ఘ ప్రయాణం. దీన్ని 2018 నాటికే పూర్తి చేస్తామ‌ని ఇరిగేష‌న్ మంత్రి ప‌దేప‌దే చెపుతున్నారు. మాట‌ల‌ను కోట‌లు దాటించ‌డంలో దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు నిపుణులని ఆయ‌న్ను తెలిసిన అంద‌రూ చెపుతారు. తాను చెప్పాల‌నుకున్న‌ది త‌ప్ప‌, ఎదుటివాడి ప్ర‌శ్న‌కు సమాధానం చెప్పే ధైర్యం కూడా ఆయ‌న‌కు లేద‌న్న విష‌యం బెజ‌వాడ మీడియా మిత్రుల‌కు మ‌రింత బాగా తెలుసు. ఉమా మాటల ప్ర‌కారం మ‌రో ఏడాది, లేదంటే రెండేళ్ల‌లో దీన్ని పూర్తి చేయ‌డం అంటే అది ఎంత‌వ‌ర‌కు ఆచ‌ర‌ణ సాధ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎప్పుడో 2004లో శంకుస్థాప‌న జ‌రిగి ప‌దేళ్ల కాలంలో ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్న‌వాటిని ప్రారంభోత్స‌వాలు ఆర్భాటంగా చేసి త‌మ ఘ‌న‌త‌గా జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డం పాల‌కుల‌కు రివాజుగా మారింది.
ప్ర‌స్తుత స‌ర్కారు ఘ‌నంగా చెపుతున్న ప‌ట్టిసీమ సైతం కాంగ్రెస్ స‌ర్కారు హ‌యాంలో త‌వ్విన కాల్వ‌ల ద్వారానే సాధ్య‌మైంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. పోల‌వ‌రం లో కీల‌క ముంద‌డుగు ప‌డింద‌ని స‌ర్కారు చెపుతోంది. నాబార్డు రుణం మంజూరుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని సారాంశం. సందేహం లేదు.. ముంద‌డుగే .. కానీ దాని నిర్మాణ బాధ్య‌త చూస్తున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తీరు ఇక్క‌డ గుర్తు తెచ్చుకోవాలి. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకుంది ఈ కంపెనీయే. రష్యా స్టేడియం వ్యవహారంతో తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఈ కంపెనీ ఉంది. పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పైగా ఇది ఓ జాతీయ ప్రాజెక్టు అంటూ ఒక హోదా కూడా తగిలించుకుంది. అధికార‌పార్టీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు దీనికి కో ప్ర‌మోట‌ర్ కూడా. తొలుత ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం 10వేల కోట్లు మాత్ర‌మే. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన 2014 ఏప్రిల్ నాటికి సవరించిన అంచనా వ్యయం రూ 24 వేల కోట్లు. ఇప్పుడు తాజాగా పోలవరం అంచనా వ్యయం 40,450 కోట్లుగా ఏపీ జలవనరుల శాఖ లెక్క తేల్చింది. మ‌రి నాబార్డు నుంచి రూ2981.54 కోట్ల రుణం తో ప్రాజెక్టు పనుల్లో అంగుళ‌మైనా ముందుకు క‌దులుతుందా?. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన విధంగానే ఈ మొత్తం మొబిలైజేషన్ అడ్వాన్సుగా కాంట్రాక్ట‌రుకు అందిస్తారా?.. అస‌లే అధికార పార్టీ నేత‌.. పైగా కంపెనీ ప‌రంగా, ఆరోగ్య ప‌రంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు మ‌రి...
ఉమ్మ‌డి మద్రాసు రాష్ట్రంలో 1941లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనే ఆలోచనకు బీజం పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ చీఫ్‌ ఇంజనీర్‌ దివాన్‌ బహదూర్‌ ఎల్‌. వెంకట కృష్ణ అయ్యర్‌ ఈ ప్రాజెక్టుపై తొలి సర్వే నిర్వహించి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేశారు. ఆనాటి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వివాదాల మధ్యే నలిగిపోతున్నది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన తెలంగాణకు చెందిన నాయకుడు. అప్పుడే పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్‌ అని నామకరణం చేసింది కూడా అంజయ్యే. తరువాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావూ పోలవరం ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు తమ పాలనలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పెంచుతూ పోయారే తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం చేపట్టలేకపోయారు. వైఎఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన సమయంలో చేపట్టిన జలయజ్ఞం పనుల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దశాబ్దాల జాప్యం తర్వాత 2004 నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే 5000 కోట్ల వ్యయంతో కాలువల నిర్మాణం కూడా పూర్తయింది. ప‌ట్టిసీమకు వాడుతున్న కాలువ‌లు అవే. 
స‌ర్కారు అధికారిక ప్ర‌క‌ట‌న‌నే ఓసారి చూస్తే మంజూరైన రుణంలో రూ.1981.54 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం చేసిన ఖర్చుకు రీయింబర్స్‌మెంట్‌. ఇక మిగిలింది రూ.1000 కోట్లు. వీటితో ప్రాజెక్టు ఎన్ని అంగుళాలు నిర్మాణం పూర్తి చేయ‌గ‌ల‌రో ఆ ఉమామ‌హేశ్వ‌రుడికే తెలియాలి. ఇందులో వాటాల గోల ఉండ‌నే ఉంది. ఏపీ స‌ర్కారు స‌వ‌రించిన అంచ‌నా కూడా వివాదాల‌తో ఉంది. 2016 అంచనాలను సవరించి భూసేకరణ నిర్మాణ వ్యయాలు కలిపి 40,450 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీన్ని రాష్ట్ర జలవనరుల శాఖ పీపీఏకి పంపింది. ప్రాజెక్టు అంచనాలను స్వతంత్రంగా కూంద్ర టర్ నెట్ బెంచ్ మార్క్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జల వనరుల శాఖ ఆదేశించింది. పీపీఏ తాజా అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. అంటే ఇప్ప‌టివ‌ర‌కు అస‌లు వాస్తవ అంచ‌నాలే పూర్తి కాలేద‌న్న‌మాట‌. కానీ సీఎం చంద్ర‌బాబునాయుడు మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు పనులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ కెమెరాల ద్వారా ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నార‌ట‌. ప్రతి నెల మూడోసోమవారం పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంత‌కూ ఈ ప‌ర్య‌క‌వేక్ష‌ణ ఎందుకో?.

No comments:

Post a Comment