రెండు రోజులుగా బంగారం విషయంలో కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు నెలకొన్నాయి. ఇకపై బంగారం వినియోగం కూడా దాదాపు నిషిద్ధమన్నంతగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మహిళల్లో ఒకరకమైన అభద్రత చోటు చేసుకుంది. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు, నగదుకు పరిమితులు విధించడం వంటి కారణాలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. నెల ప్రారంభంలో కూడా వారి సంపాదనను తీసుకోవడానికి సైతం అవకాశం లేకుండా చేసిన నిబంధనలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. నల్లడబ్బు ఎంత బయటకు తీసారో తెలియదు గానీ సాధారణ పౌరుడు మా త్రం నిత్యావసరాలకు కూడా తల్లడిల్లే పరిస్థితి వచ్చింది.
ఇదే సమయంలో పన్నుల సంబంధ చట్టాలు
(రెండో సవరణ) బిల్లు, 2016 ను లోక్ సభ ఆమోదించింది. ప్రస్తుతం ఈ బిల్లు రాజ్య సభ పరిశీలనలో ఉంది. దీనితో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూర్వికుల ఆభరణాలు సహా అన్ని రకాల స్వర్ణాభరణాల పైన 75 % పన్నును, ఇంకా సెస్ ను, వీటికి తోడు చెల్లించదగ్గ పన్ను పైన మరో 10 % జరిమానాను కూడా విధించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇది సర్కారుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంఉకే తక్షణం నష్టనివారణకు ఉపక్రమించింది. ఈ బిల్లు నగల విషయంలో ఎటువంటి కొత్త నిబంధనను ప్రతిపాదించలేదని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ బిల్లు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 115బిబిఇ లో భాగంగా వర్తించే పన్ను రేటును ఇప్పుడున్న 30 % నుంచి 60 శాతానికి పెంచడంతో పాటు 25 % అధిక పన్నును, ఇంకా సెస్ ను విధించాలని ప్రతిపాదిస్తోంది. ఆస్తులలో వివరించని వాటిపై పన్ను రేటును మాత్రమే ఈ సెక్షన్ ప్రస్తావిస్తున్నదని సర్కారు చెపుతోంది. ఈ ఆస్తులను ఆదాయంగా పరిగణించి విధించదగిన పన్నుకు సంబంధించిన నిబంధనలు 69, 69ఎ, 69బి లలో పొందుపరచి ఉన్నాయి. ఈ నిబంధనలు 1960 నుంచి చట్టంలో భాగంగా ఉన్నవే. ఈ సెక్షన్ ల తాలూకు నిబంధనలను సవరించడం బిల్లు ఉద్దేశం కాదని సర్కారు చెపుతోంది. పన్నుల ఎగవేతదారులు వారి బహిరంగపరచని ఆదాయాన్ని వ్యాపారంలో వచ్చిన ఆదాయం లేదా ఇతర మార్గాల ద్వారా అందిన ఆదాయంగా ఇన్ కం టాక్స్ రిటర్న్ లో చూపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నంగానే దీన్ని చూడాలట. 115బిబిఇ లో భాగంగా వర్తించే పన్ను రేటును వివరించని ఆదాయం విషయంలో మాత్రమే పెంచదలచినట్లు ప్రకటించింది కేంద్ర సర్కారు. ముఖ్యంగా 115బిబిఇ సెక్షన్ నిబంధనలు ఆస్తులను లేదా నగదు వంటి వాటిని ‘ అన్ ఎక్స్ ప్లెయిన్ డ్ క్యాష్ ఆర్ అసెట్ ’ గా ప్రకటించాలని గాని లేదా దానిని నిరూపించని వ్యాపార ఆదాయంగా దాచిపెట్టినప్పుడు అటువంటి వాటిని అసెసింగ్ అధికారి ఆచూకీ తీసిన కేసులలో మాత్రమే వర్తిస్తాయని చెపుతోంది.
వెల్లడించిన ఆదాయాన్ని ఉపయోగించి గాని, లేదా వ్యవసాయ సంబంధ ఆదాయం వంటి మినహాయించిన ఆదాయాన్ని ఉపయోగించి గాని, లేదా సమంజసమైన విధంగా ఉండే కుటుంబ పొదుపు మొత్తాన్ని ఉపయోగించి గాని, లేదా చట్టబద్ధంగా వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ని ఉపయోగించి గాని బంగారాన్ని కొనుగోలు చేస్తే అటువంటి వాటిపైన ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పన్నును విధించడానికి వీలు లేదు. అలాగే సవరణకు ప్రతిపాదించిన నిబంధనావళి ప్రకారం కూడా పన్నును విధించడానికి వీలు లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా, సోదా కార్యకలాపాల వేళ కుటుంబంలోని ఒక్కొక్క వివాహిత మహిళ
కు చెందిన 500 గ్రాముల వరకు స్వర్ణాభరణాలను, నగలను, అలాగే కుటుంబంలోని అవివాహిత మహిళకు చెందిన 250 గ్రాముల స్వర్ణాభరణాలను, నగలను, కుటుంబంలోని ఒక్కొక్క పురుష అభ్యర్థికి చెందిన 100 గ్రాముల స్వర్ణాభరణాలను, నగలను స్వాధీనం చేసుకోకూడదని చెబుతున్న నంబర్ 1916 ఆదేశానికి సంబంధించి ఒక సూచనను కూడా ఆహ్వానించడమైంది. ఇంకా, చట్టబద్ధమైన పద్ధతులలో ఆభరణాలను ఎంత పరిమితిలోనైనా కలిగివున్నప్పటికీ ఆ హక్కును పూర్తిగా పరిరక్షించడం జరుగుతుందట. ఈ అంశాల వెలుగులో, కుటుంబాల వద్ద ఉన్న ఆభరణాలను వెల్లడించిన మార్గాల ద్వారా లేదా మినహాయించిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసి ఉంటే అటువంటి ఆభరణాలపైన ప్రతిపాదిత సవరణను అనుసరించి పన్ను విధించడం జరుగుతుందంటూ వ్యాప్తిలోకి వస్తున్న వార్తలు వాస్తవం కాదని సర్కారు వివరణ ఇచ్చింది.
No comments:
Post a Comment