Tuesday 6 December 2016

నల్ల ధన‌మా ... అడ్ర‌స్ ఎక్క‌డ‌?.

సామాన్యుడిని వీధుల పాల్జేసి, కూర‌గాయ‌లు, పాలు వంటి నిత్యావ‌స‌రాలు కొనుగోలు చేయ‌డానికి కూడా స‌మ‌స్య‌లు సృష్టించిన ప్ర‌ధాని మోదీ అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరిందా? . నిజానికి ప్ర‌శ్న చిన్న‌దే.. దీని స‌మాధాన‌మే పాము మెలిక‌ల్లా బ్యాంకుల ముందు క్యూక‌ట్టిన మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల క‌ష్టం అంత పెద్ద‌ది. ఏమాత్రం క‌స‌ర‌త్తు లేకుండా, గ‌త అనుభ‌వాలనుంచి క‌నీసం పాఠాలు కూడా నేర్వ‌కుండా రాత్రికి రాత్రి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించారు. దీనికి చాలా ఆద‌ర్శాలు వ‌ల్లించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో స్విస్ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ అంతా తెచ్చి ప్ర‌జ‌ల ఖాతాల్లో వేస్తామ‌ని చెప్పిన నాయ‌కుడు అది చేత‌కాక ఇప్పుడు దేశంలో ఉన్న బ్లాక్ మ‌నీ మొత్తం తెచ్చేస్తాన‌ని ప‌లికాడు. ఇందులో కొంత ల‌క్ష్య‌శుద్ధి ఉంటే ఉండ‌వ‌చ్చు. కానీ సాధార‌ణ పౌరుణ్ణి రోడ్డుపాల్జేసిన తీరు అత్యంత గ‌ర్హ‌నీయం. 
ప్రధాని మోడీ ఏ ల‌క్ష్యంతో పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించారో ఇప్ప‌డు ఆ ఫ‌లితం ద‌క్కే సూచ‌న‌లు ద‌రిదాపుల్లో క‌నిపించ‌డంలేదు. బ్లాక్ మ‌నీ నిర్మూల‌న‌, ఉగ్ర‌వాదులు, న‌కిలీ నోట్ల‌కు అడ్డుకోవ‌డానికి ఇదే మార్గం అని చెప్పారు. అఫ్ కోర్సు క్ర‌మంగా ఆ మాట‌ల్లో స్ప‌ష్ట‌త లేని ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయ‌నుకోండి. కానీ ప్ర‌జ‌ల‌ను త్యాగాలు చేయాల‌ని కోరితే వారు సానుకూలంగానే స్పందించారు. అయితే ఇక్క‌డ ప్ర‌శ్న ఏంటంటే.. ప్ర‌జ‌ల త్యాగాల‌కు ఏమైనా ఫ‌లితం వ‌చ్చిందా? అనేదే. అక్టోబర్ చివరినాటికి ఆర్థికశాఖ అందించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా చెలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ.17,50,000 కోట్లు. వాటిలో 86 శాతం రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. అంటే 15,05,000 కోట్లు పెద్ద‌నోట్ల రూపంలో చెలామ‌ణిలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు బ్యాంకుల్లో జమ అయిన పాత నోట్లను బట్టి చూస్తే మోడీ ప్రకటించిన బ్లాక్ మ‌నీ నిర్మూలన లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. అమెరికా వాణిజ్య పత్రిక బ్లూమ్ బర్గ్ న్యూస్ ప్రకారం డిసెంబర్ 3 తేదీ నాటికి బ్యాంకుల్లో 12.6 లక్షల కోట్లు విలువ గల పాత పెద్ద నోట్లు జమ అయ్యాయి. నోట్ల రద్దు ప్రకటించేనాటికి దేశంలో 15.05 లక్షల కోట్ల విలువ గల పాత నోట్లు చలామణిలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. అందులో 5 లక్షల కోట్ల వరకు నల్ల డబ్బు ఉంటుందని అంచ‌నా వేసింది. నోట్లు పెద్ద మొత్తంలో జమ అవుతుండడంతో అంచనాను తగ్గించుకుని 3 లక్షల కోట్ల వరకు నల్ల డబ్బు ఉండవచ్చని స‌వ‌రించారు మోదీ మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు. పోస్ట్ ఆఫీసుల్లో 35 వేల కోట్లు జమ అయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు 12.95 ల‌క్ష‌ల కోట్లు న‌గ‌దు బ్యాంకుల్లో జ‌మ అయింది. మొత్తం 15.05 ల‌క్ష‌ల కోట్ల‌లో జ‌మ అయిన‌ మొత్తం తీసివేస్తే స‌ర్కారు చెప్పిన లెక్క ప్ర‌కారం రావాల్సింది ఇంకా 2.1 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే. 12.95 లక్షల కోట్లు అంటే చలామణిలో ఉన్న మొత్తంలో 86 శాతానికి సమానం. జమ చేసేందుకు డిసెంబర్ 30 వరకు స‌ర్కారు గ‌డువిచ్చింది. ఈ స‌మ‌యంలో మిగిలిన మొత్తం కూడా బ్యాంకుల్లో జమ అయిన అవ్వ‌వ‌చ్చు. అలా కాద‌నుకున్నా ఇంకా రావాల్సింది కేవ‌లం 2.1 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే. ఇది ప్ర‌భుత్వం తొలుత ప్రకటించిన 5 లక్షల కోట్ల బ్లాక్ మ‌నీ లో స‌గం కూడా కాదు. సవరించుకున్న 3 లక్షల కోట్లలో కూడా కేవ‌లం 65శాతం మాత్ర‌మే. జమ అయిన మొత్తం వైట్ కిందే లెక్క‌. ఈ ప్ర‌కారం చూస్తే ప్ర‌ధాని ప్ర‌క‌టించిన బ్లాక్ మ‌నీని శుభ్‌రం చేసే  ప్ర‌క్రియ ఘోరంగా విఫలం అయింది. 
రెండవ పార్శ్వం చూద్దాం.. ప్ర‌ధాని చెప్పిన ల‌క్ష్యం నెర‌వేలేదనుకుందాం.. మ‌రి ఇంత‌మాత్రం చేత బ్లాక్ మ‌నీ లేదని అనుకుందామా?.. అంత‌క‌న్నా త‌ప్పు మ‌రొక‌టి లేదు. కానీ బ్లాక్ అంతా బ్యాంకులకు చేర‌డం వెనుక జ‌రిగిందేమిటి. డీమానిటైజేష‌న్ ప్ర‌క్రియ‌లోనే లోపం ఉంది. సామాన్యుడు మాత్రం అష్ట‌క‌ష్టాలు ప‌డ్డాడు. బ్లాక్ మాత్రం య‌ధేచ్చ‌గా వైట్ గా మారింది. డీమానిటైజేష‌న్ అందుకు అవ‌కాశం కల్పించింది. అంటే వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌కుండా తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత మంది అవినీతి ప‌రుల‌ను త‌యారు చేసింది. ఫ‌లితంగా బ్యాంకుల్లో, ఆఫీసుల్లో, వ్యాపారంలో అవినీతి మరియు అక్రమ కార్యకలాపాలు తగ్గలేదు. స్ధిరంగా, దీర్ఘకాలికంగా, వ్యవస్థీకృతమైన చర్యలు చేపట్టగలిగితేనే సమాజం నుండి చట్ట విరుద్ధమైన ఆర్ధిక ప్రక్రియలను తుడిచిపెట్టగలం. ఈ మూడింటిలో శక్తివంతమైనది, అసలైనది బ్లాక్ ఎకానమీ. బ్లాక్ ఎకానమీ వల్ల బ్లాక్ ఇన్ కం నిరంతరం పుడుతూ ఉంటుంది. ఈ బ్లాక్ ఇన్కం లో కొద్దీ భాగం మాత్రమే బ్లాక్ మనీ గా పోగుపడుతుంది. అనేకమంది ఆర్థికవేత్తలు ఇప్పటికే చెప్పినట్లుగా నల్ల డబ్బు ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో, షేర్ మార్కెట్ లో, అక్రమ వ్యాపారాల్లో, బంగారం తదితర విలువైన లోహాల్లో, విదేశీ ఖాతాల్లో ఉంది. డబ్బు రూపంలో ఉన్నది చాలా తక్కువ. ఆ తక్కువ మొత్తాన్ని వెలికి తీయడంలో కూడా డీమానిటైజేషన్ విఫలం అయింది. కొత్త నోట్ల కట్టలు కోట్ల కొద్దీ పట్టుబడుతున్న నేపథ్యంలో నల్ల ధనం పోగేసి మార్గాలను ఏ ప్రభుత్వమూ, కనీసం బీజేపీ ఏలుబడిలో రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముట్టుకోలేదని స్పష్టం అవుతోంది. పైగా బీజేపీ పార్టీ శాఖలే డీమానిటైజేషన్ రోజున పెద్ద ఎత్తున పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు స్ప‌ష్టం అయింది. బ్యాంకు అధికారులు నేరుగా సంప‌న్నుల ఇళ్లకు వెళ్లి కొత్త నోట్లు ఇఛ్చి పాత నోట్లు మార్చుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ని అక్రమాలు యధేచ్చగా సాగుతున్నప్పుడు ఇక నల్ల డబ్బు, అవినీతి ఆగిందెక్కడ? 5 లక్షల కోట్ల నల్ల డబ్బు తేలితేనే కేంద్ర ప్రభుత్వానికి 50 వేల కోట్లు డివిడెండ్ వస్తుందని ఆర్ధిక శాఖ కార్యదర్శి ఇటీవ‌ల చెప్పారు. మ‌రి ఇప్ప‌డు 2 ల‌క్ష‌ల కోట్లు కూడా వ‌చ్చేలా లేదు. ఈ విధంగా వ‌చ్చే 20వేల కోట్లు ఏ సంక్షేమానికి?. ఇంత‌క‌న్నా హాస్యాస్ప‌దం ఇంకేమ‌న్నా ఉందా?. 

No comments:

Post a Comment