Saturday, 26 November 2016

మోడీ నుంచి మ‌రో షాక్

                              మోడీ నుంచి మ‌రో షాక్


నల్లధనంపై పోరులో భాగంగా పెద్ద నోట్లు రద్దుచేసిన ప్రధాని నరేంద్రమోదీ తాజాగా బినామీ ఆస్తులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈమేర‌కు ఆయ‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అంత‌కు ముందే ఇందుకు సంబంధించిన చట్ట స‌వ‌ర‌ణ కూడా చేశారు. న‌వంబ‌ర్ 1 నుంచే అమ‌లులోకి వ‌చ్చిన ఈ విష‌యం ఎవ‌రి దృష్టిని ఆక‌ర్షించ‌లేదు. ఇందుకు కార‌ణాలు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. భార‌తీయ చ‌ట్టాల అమ‌లుపై ఉన్న సందిగ్ధ‌తే ఇందుకు కార‌ణం. అయితే నోట్ల ర‌ద్దుతో ఈ చ‌ట్టంపైనా భ‌యం మొద‌లైంది. ఇంత‌కూ చ‌ట్టం ఏం చెపుతోంది? . 
కొత్త బినామీ లావాదేవీల నియంత్ర‌ణ చట్టం నవంబరు 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇకపై ఇతరుల పేరుతో చేసే ఆస్తుల లావాదేవీలు చెల్లవు.  ఆ ఆస్తులను ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.  ఈ చట్టం కింద బినామీ ఆస్తులు కలిగివున్న వారిపై అపరాధ రుసుంతో పాటు ఏడేళ్ల కారాగారశిక్ష వరకు విధించవచ్చు. 
నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతో పార్లమెంటు గత ఆగస్టులో బినామీ లావాదేవీల (నిరోధక) చట్టాన్ని ఆమోదించింది. నికార్సయిన మతపర ట్రస్టులను ఈ చట్టం నుంచి మినహాయిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అప్పుడు చెప్పారు. బినామీ లావాదేవీల (నిరోధక) చట్టం నియమ నిబంధనలన్నీ నవంబర్ 1, 2016 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు ఉన్న బినామీ లావాదేవీల (నిరోధక) చట్టం, 1988 ఇకపై బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం, 1988 గా మారుతుంది అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. బినామీదారు పేరు మీద ఉన్న బినామీ ఆస్తిని దాని నిజ సొంతదారు స్వాధీనం చేసుకోలేడు. బినామీ ఆస్తులను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండానే జప్తు చేస్తుంది. అభ్యంతరాలున్నప్పుడుగానీ, పునర్విచారణకోసంగానీ ఆశ్రయించేందుకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఇదివరకటి చట్టంలో 9 సెక్షన్లు మాత్రమే ఉండగా, సవరించిన చట్టంలో 71 సెక్షన్లు ఉన్నాయి. 
ఇంత‌గా చెపుతున్న ఈ బినామీ అంటే ఏమిటి అనే సందేహం వ‌స్తోందా? . ఒక వ్యక్తి ఒక ఆస్తిని తన పేరున కాకుండా తనకు సన్నిహితులైన వ్యక్తుల పేరున కొనుగోలు చేసే విధానాన్ని బినామీ వ్యవహారంగా పేర్కొంటారు. ఈ విధానంలో ఆ ఆస్తులను డబ్బు చెల్లించేవారు అనుభవిస్తుంటారు. అయితే ఆ ఆస్తి ఎవరి పేరు మీద వుందో వారికి ఎలాంటి హక్కులు వుండవు. వాస్తవానికి ప్రతి ఒక్కరు ఓ పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తే ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వానికి దొంగలెక్కలు చూపించి ఆ పన్ను ఎగవేస్తారు. ఇలా దాచిన సొమ్మును తమ బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తుంటారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాకపోగా ఆ ధనం లెక్కలోకి రాకపోవడంతో నల్లధనంగా మారిపోతుంది.
బినామీ లావాదేవీల నిరోధ‌క చట్టం వేటికి వ‌ర్తించ‌దు.
* భార్య, పిల్లల పేరుతో ఆస్తులు లేదా భూముల కొనుగోలుని బినామీవ్యవహారంగా పరిగణించరు. అయితే ఆదాయమార్గాలను వెల్లడించాలి. 
* సోదరులు లేదా సోదరి పేరు మీద సంయుక్తంగా ఆస్తి కొనుగోలు చేయడం. దీనికి కూడా ఆదాయమార్గాలను వివరించాలి.
*ఆగస్టులో పార్లమెంటు బినామీ లావాదేవీల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఆమోదం పొందడంతో నవంబరు 1 నుంచి చట్టంగా మారింది. 
* కొత్త చట్టం ప్రకారం బినామీ ఆస్తులు కలిగి ఉన్న వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ అపరాధ రుసుం విధిస్తారు.
చట్ట పరిధిలో అంశాలు.. 
*స్థిర, చర, బంగారం, ఫైనాన్షియల్‌ సెక్యూరిటీలను ఇతరుల పేరు మీద కొనుగోలు చేయడం.
*ఇత‌రుల పేరుమీద ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం... 
* బినామీ ఆస్తుల నియంత్రణతో రేట్లు తగ్గే అవకాశం.
ఆస్తులు, బంగారం క్రయవిక్రయాలపై ఇప్పటికే దృష్టిపెట్టిన కేంద్రం స్థిరాస్తి వ్యవహారాలను పాన్‌కార్డు ఆధారంగా నిశితంగా గమనిస్తుందనీ...ఆ రంగంలోని బినామీ ఆస్తుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందనీ నిపుణులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment