Monday, 28 November 2016

పిచ్చి కుదిరింది.. రోక‌లి చుట్టండి

                పిచ్చి కుదిరింది.. రోక‌లి చుట్టండి

కిలోబియ్యం రూపాయికే స‌ర్కారు అందిస్తుంది. కానీ అవి తీసుకోవాలంటే మీకు డెబిట్ కార్డు త‌ప్ప‌నిస‌రి. ఇంటిముందుకు వచ్చే పాల‌వాడు స్వైప్ మిష‌న్ తేకుంటే పాలు తీసుకోకండి. మ‌రి పాలు ఎలా?.. ఏమో మ‌న నాయ‌కులు చెపుతారు. 
పిచ్చి కుదిరింది, రోకలిని తలకు చుట్టమన్నాడట ...వెనుక‌టికి ఓ మేధావి. ఇప్ప‌డు ఇండియాలో, అంత‌కు మించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మేధావుల సంఖ్య మ‌రీ పెరిగిపోయింది. కాకుంటే రోక‌లిని త‌ల‌కు ఎవ‌రు చుట్టాలో తెలీక అమాయ‌క ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. దేశంలో న‌ల్ల డ‌బ్బును అడ్డుకునేందుకు పెద్ద‌నోట్ల ర‌ద్దు అంటూ భార‌త ప్ర‌ధాని ప్ర‌క‌టించేశారు. దీనికి ముందుగానీ, త‌ర్వాత గానీ క‌నీస క‌స‌ర‌త్తు లేదని ఎన్నో సంఘ‌ట‌న‌లు రుజువు చేశాయి. పెద్ద నోట్ల కార‌ణంగానే న‌ల్ల‌డ‌బ్బు ఉందంటే మ‌రి రెండువేల రూపాయ‌ల నోటు ఎందుకు విడుద‌ల చేశారో తెలీదు. ఇక సామాన్యుడు ఎవ‌రైనా త‌న‌వ‌ద్ద ఓ ప‌దో, ప‌ర‌కో వెయ్యి నోట్లు దాచుకుంటే అవి మార్చుకోవ‌డానికి బ్యాంకుల ముందు ఓ నాలుగురోజులు క్యూలైన్ల‌లో నిల్చొని, యాభైమంది పైగా ప్రాణాలు ధార‌పోసి అవి మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఈ లోపు తీసుకున్న నాలుగు వేలు కూడా బ్లాక్ చేస్తున్నార‌ని అనుమానం వ‌చ్చింది. ఇంకేముంది ఆ ప‌రిధిని రూ 2500కు కుదించారు. అది న‌వంబ‌ర్ 24తో ముగిసింది. ఇదంతా చూడ‌డానికి మేడిపండును మించిన అందంగా క‌నిపించింది. ల‌క్ష‌ల కోట్లు బ్యాంకుల్లో జ‌మ అయ్యాయ‌న్నారు. బాగుంది. కానీ అవి న‌ల్ల‌డ‌బ్బు కాదు. కేవ‌లం సామాన్యుడు లెక్క‌ల ప్ర‌కారం స్వేదం చిందించి సంపాదించిన డ‌బ్బు మాత్ర‌మే.
ఇక్క‌డే రెండో క‌థ న‌డిచింది. ఆర్బీఐ నుంచి వ‌చ్చిన న‌గ‌దు స‌రాస‌రి న‌ల్ల‌బ‌జారుకు త‌ర‌లి పోయింది. అందుకు రిజ‌ర్వు బ్యాంకు అధికారుల దృష్టికి వ‌చ్చిన ఎన్నో నిద‌ర్శ‌నాలు క‌నిపిస్తాయి. సామాన్యుడు క్యూల్లో క‌ష్ట‌ప‌డితే న‌ల్ల‌కుబేరులు ద‌ర్జాగా ఓ 20-25 శాతం లంచంతో బ్ర‌హ్మాండంగా న‌ల్ల‌డ‌బ్బును మార్చుకున్నారు. అంటే బ్లాక్ అనేది వ్య‌వ‌స్ధ‌ల ప్ర‌క్షాళ‌న‌తోనే సాధ్యం త‌ప్ప ఇలా జ‌రిగేది కాద‌ని తేలిపోయింది. ఇక నోట్ల ర‌ద్దు విష‌యం కార్పొరేట్ శ‌క్తులకు ముందే తెలుస‌ని ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. దీన్ని ఖండించేందుకు, అంగీక‌రించేందుకు ఏ ఆధారం లేదు. కాకుంటే జాతీయ‌ బ్యాంకులు త‌మ ఏటీఎంల‌లో డ‌బ్బులు పెట్ట‌లేక తాళాలు వేస్తే బిగ్ బ‌జార్ వంటి కార్పొరేట్లు రోజుకు క‌నీసం రూ30 కోట్ల వ‌ర‌కు మార్పిడికి అవ‌కాశం ఇచ్చాయి. ఇదెలా సాధ్యం అని ప్ర‌శ్నించ‌కండి? న‌మో.. న‌మః.. అనుకోవ‌డం మిన‌హా. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌ద్దాం.. 
దేశంలో... కాదు..కాదు.. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ గొప్ప జ‌రిగినా నేనే కార‌ణం అని చెప్పే ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు .. న‌వంబ‌ర్ 8 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ర‌కాల ప‌ల్ల‌విని అందుకున్నారు. ఒక‌టి నోట్ల ర‌ద్దుకు నేనే కార‌ణం అనేది మొద‌టి మాట‌. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన వ్య‌తిరేక‌తో మ‌రో కార‌ణ‌మో ఈ ప‌ల్ల‌విని వ‌దిలి కొత్త చ‌ర‌ణంతోనే పాట మొద‌లెట్టారు. అది చిల్ల‌ర స‌మ‌స్య ప‌రిష్క‌రించాలని. ఇదెలాగూ  త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన అంశం. సో ఈ ఘ‌న‌త ఆయ‌న ఖాతాలో ప‌డిపోవాల‌ని తాప‌త్ర‌యం. ఇప్ప‌డు మ‌రో చ‌ర‌ణం అందుకున్నారు. మ‌రో రెండు రోజుల్లో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు చేయాల‌ని. ప్రస్తుతం నెలకొన్న నోట్ల కొరత సమస్యను సులభంగా అధిగమించే ఏకైక మార్గం నగదు రహిత చెల్లింపులే. ఇపుడు ఇదే విషయమై ప్రభుత్వం విస్తృతం ప్రచారం చేపట్టింది. ప్రజలతో జరిపే లావాదేవీల్లో ఈ పోస్, స్వైప్ మిషన్లను వాడుతుంద‌ట‌. వ్యాపార, వాణిజ్య సంస్థలూ ఈ మిషన్లు వాడాల‌ట‌. ఇక్క‌డా పక్క‌దేశాల ప్ర‌స్తావ‌న లేకుంటే ఆయ‌న బాబు ఎలా అవుతారు. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వస్తువుల కొనుగోలుకు అక్కడి ప్రజలు ఆన్ లైన్లోనే చెల్లింపులు చేస్తుంటారట‌. భారతదేశంలో మాత్రం 70 శాతానికిపైగా నగదు రూపంలోనే లావాదేవీలు జరుపుతుంటారు. ఇపుడిదే ప్రస్తుతం సమస్యగా మారిందనేది ఆయ‌న మాట‌. మ‌రి ఈ విష‌యం తెలిసిన‌వాడు దేశంలో 68 శాతం ప్ర‌జ‌ల‌కు బ్యాంకు ఎక్కౌంట్ లే లేవ‌నే విష‌యం ఎందుకు మ‌ర్చిపోయారో. ఇక అడుగ‌డుగునా ప్ర‌చార యావ‌. ఇందుకోసం మహిళ సంఘాల సభ్యులు, రేషన్ డీలర్ల సేవలను తీసుకుంటోందట‌. ఆన్ లైన్ చెల్లింపులపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనుంది. అలా శిక్షణ పొందిన మహిళా సంఘాల సభ్యులతో ఇంటింటి ప్రచారమూ నిర్వహించి, నగదు రహిత చెల్లింపుల వల్ల కలిగే లాభానష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంద‌ట‌. రేషన్ షాపుల్లోనూ బియ్యం కోసం డెబిట్ కార్డు కావాల‌ట‌. డెబిట్ కార్డు మెయిన్ టెన్ చేసేవాడు రేష‌న్ షాపుకు ఎందుకు వెళ్తాడో ఏలిన‌వారికే తెలియాలి. కేవలం వస్తు సంబంధమైన కొనుగోలులోనే కాకుండా, భూములు, స్థిరాస్తులు క్రయావిక్రయాల్లోనూ నగదు రహిత చెల్లింపు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఘ‌నులు మన పాల‌కులు.

No comments:

Post a Comment