Sunday, 27 November 2016

క్రీస్తు వివాహం..వివాదం

                                 క్రీస్తు వివాహం..వివాదం
ప్రపంచ మానవాళికి శాంతి, సౌభ్రాత్వాలను ప్రభోదించిన మహనీయుడు ఏసుక్రీస్తు. ఈ మహనీయుడి జీవిత చరిత్రకు సంబంధించిన విష‌యాల‌పై త‌ర‌చూ వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి క‌లిగిస్తున్న అంశాలు కూడా ఇవే. అందులో ప్ర‌ధాన అంశం క్రీస్తుకు వివాహం అయిందా? ఆయ‌న జీవితం ఎక్క‌డ సాగింది? ఇలా ఎన్నో సందేహాలు, వివాదాలు... జీసస్ 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో ఎక్క‌డా మ‌న‌కు తెలియ‌దు. పాత‌, క్రొత్త నిబంధ‌న‌ల్లో కూడా ఆ ప్ర‌స్తావ‌న క‌నిపించ‌దు. ఆయన తన 13 వ ఏట బైబిల్ లో కనిపిస్తాడు. తరువాత తన 30 వ ఏట శిలువ వేశారు. అంతే. కేవలం 3 సంవత్సరాల అతడి  జీవితం మాత్రమే తెలుసు. కేవలం ఆయ‌న జీవితంలో ఒకటి, రెండు సందర్భాలు  తెలుసు. ఒకటి పుట్టినప్పుడు. క్రీస్తు పుట్టుక అందరికి తెలుసు. రెండవది, ఆయ‌న ఏడేళ్ల వయస్సులో పెద్ద గుడిలో జరిగే పండుగకు రావడం. ఈ రెండు సంఘటనలు మాత్రమే తెలుసు. చివ‌రిగా ప్రవక్తగా అతడు గడిపిన మూడు  సంవత్సరాలు తెలుసు. మిగిలిన జీవితం ఎక్క‌డ?
 క్రీస్తు జీవితం గురించిన స‌మాచారం భారత దేశంలో చాలా ఉంది. ఆయన గురించి ఏమీ తెలియని కాలంలో ఆయన కాశ్మీర్ లో ఉన్నారు, - ఒక బౌద్ద ఆరామంలో ఆ సమాచారం ఉంది. అంతే కాదు, ఆయన అక్కడ ఉన్నట్టు జానపద కథలు ఉన్నాయి. అప్పుడు బౌద్ద భిక్షువు గా, అన్ని సంవత్సరాలు ధ్యానంలో గడిపాడు. త‌న 30 వ ఏట అకస్మాత్తుగా జెరూసలేము ప్రత్యక్షమయ్యాడు. త‌ర్వాత శిలువ వేశారు. ఆయ‌న తిరిగి లేచాడన్న కథ క్రిస్టియన్ ల దగ్గర ఉంది. ఆయన తిరిగి లేచిన తరువాత, ఎక్కడికి మాయమయ్యాడు? ఈ విషయంలో ఎవ్వ‌రి వ‌ద్దా స‌మాధానం లేదు. ఎక్క‌డికి వెళ్ళాడు? అతడు సహజ మరణాన్ని ఎప్పుడు పొందాడు?. అరబ్ ప్రపచం  ఆయ‌న్ను  “ ఏసస్ – ఏసు” అని పిలిస్తే.. కాశ్మీర్ లో  యూసా-అసఫ్ అని పిలిచే వారు. అతడి సమాధి మీద “యూసా అసఫ్ – ఎవరైతే చాలా దూర ప్రాంతం నుండి వచ్చి యిక్కడ జీవించాడో- అతడి సమాధి” అని ఉంది.
రష్యా యాత్రికుడు ‘నికోలస్ నటోవిచ్’ 1887 లో  భారత దేశం వచ్చినప్పుడు ‘లడఖ్’  వెళ్ళాడు. అక్కడ ఆయన అనారోగ్య కారణంగా చాలా రోజులు ‘హెమిస్ గుంపా’లో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి రోజులలో ఆయన అనేక బౌద్ద రచనలను, శాస్త్రాలను చదివాడు. ఆ  రచనలలో ఆయన, జీసస్ అక్కడికి రావడం గురించి అనేక విషయాలను తెలుసుకున్నాడు. అయన ఆ సాహిత్యంలో జీసస్ ను గురించి, ఆయన బోధనల గురించి అనేకసార్లు ప్రస్తావించడాన్ని గుర్తించాడు. తరువాత ఆయన లైఫ్ ఆఫ్ సెయింట్ జేస‌స్ అనే పుస్తకాన్ని రాశాడు. అందులో జీసస్ లడఖ్,   ఇతర తూర్పు దేశాలలో గడిపిన అనేక విషయాలను ప్ర‌స్తావించాడు. జీసస్ లడఖ్ నుండి, ఎత్తయిన పర్వతాలను దాటి  కాశ్మీర్ లోని, ‘పహల్గావ్’  చేరాడని ఉంది.  క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు క్రీస్తుకు వివహమైందా? ఈయన భార్య పేరు మేరీ మగ్దలీనా? అనే చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. ఇది ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన వివాదం కాకున్నా క్ర‌మంగా బ‌లీయ‌మైన సాక్ష్యాల‌ను చూపించే ప్ర‌య‌త్నం చ‌రిత్ర‌కారులు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
2003 లో నవలాకారుడు డాన్ బ్రౌన్ తన అత్యంత వివాదాస్పద నవల ద డా వించి కోడ్ విడుదల చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ పుస్తకం క్రైస్తవంలోని అతి పెద్ద రహస్యం జీసస్ పెళ్లి గురించి చర్చించి౦ది. క్రైస్తవం చరిత్ర అంతటా ఒక వేశ్యగా చూపించిన  మేరీ మాగ్దాలిన్ ను జీస‌స్ పెళ్ళాడాడ‌ని ఆ పుస్తకం వాదించింది. మేరీ మాగ్దాలిన్ ద్వారా ఒక బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు ఆ పుస్తకం లో ర‌చ‌యిత చెప్పారు. ఇందులో చాలా వాదనలు అవాస్తవాలుగా క్రైస్త‌వ పెద్ద‌లు కొట్టివేశారు. చాలా కాలం వివాదం న‌డిచింది. బ్రిటిష్ గ్రంధాలయం అరల్లో దొరికిన 1500 ఏళ్ళ నాటి ఒక పాత రాతప్రతి ప్రపంచాన్ని మళ్ళీ కుదిపెయడానికి సిద్ధంగా వుంది. జీసస్ జీవితం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిపే ఆ రాత ప్రతిని అరబిక్ లిపి నుంచి అనువదించడానికి ప్రొఫెసర్ బారీ విల్సన్, రచయిత సిమ్చా జాకోబొవిచ్ చాలా ఏళ్ళు శ్రమించారు. జీసస్ క్రీస్ట్ కు పెళ్లైందని, అతని మేరీ మగ్దాలిన్ ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారని ఆ రాత ప్రతి చెప్తుంది. ఆ పుస్తకం పేరు “ది లాస్ట్ గాస్పెల్’. ఫిలిప్పు వ్రాసిన పత్రిక బైబిల్ కు సంబంధంలేని పత్రిక. మగ్ధలేని మేరి అనే అమ్మాయిని ఏసు క్రీస్తు భార్యగా చెప్పబడిన ఈ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదమైనది. ఈ పత్రిక ఏసుక్రీస్తు మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాశాడు. ఈ పత్రిక 1945 లో ఉత్తర ఈజిప్టు పట్టణమైన నాగ్ హమ్మడి లో మహమ్మద్ ఆలీ సమ్మాన్ అనే వ్యక్తికి ఇతర 11 పుస్తకాలతో సహా దొరికింది.ఎక్లేసియాస్టికల్ హిస్టరీ ఆఫ్ జాకరియాస్ రేటోర్ అనే పేరిట శుద్ది చేసిన జంతు చర్మం మీద వచ్చిన ఒక పాత పుస్తకానికి అనువాదమే ది లాస్ట్ గాస్పెల్. 1847 లో బ్రిటిష్ మ్యూజియం వారు ఈజిప్షియన్ మొనాస్టరీ నుంచి కొనడంతో ఈ పుస్తకం ఇంగ్లాండ్ కు చేరింది. చాలా మంది పండితులు దాన్ని చదివాక పెద్దగా పస లేనిదని వదిలేసారు. కానీ ది లాస్ట్ గాస్పెల్ రచయితలు మాత్రం ఆ రాత ప్రతిలో నిగూడార్ధాలు వున్నాయని ఆరేళ్ళు పరిశోధించి తెలియచేసారు. సిరియాక్ భాషలో జంతు చర్మం మీద రాసిన ఆ ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో 20 ఏళ్ళ నుంచీ వుంది.
 క్రీస్తు, మగ్దలీనాల గురించి ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో రాసివున్న అత్యంత పురాతన పత్రమొకటి తాజాగా వెలుగుజూసింది. ఇందులో క్రీస్తు, మగ్దలీనాల గురించి ఉంది. చిన్న విజిటింగ్ కార్డు సైజులో ఉన్న ఈ జీర్ణ పత్రం క్రీ.శ. నాలుగో శతాబ్ధం నాటిది. హార్వర్డ్ డివినిటీ స్కూల్‌కు చెందిన డివినిటీ ప్రొఫెసర్ కరేన్ కింగ్ రోమ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఈ పత్రాన్ని ప్రదర్శించారు. దీంతో ఏసుక్రీస్తు బ్రహ్మచారి అవునా కాదా అనే అంశంపై చర్చ మ‌రోసారి ప్రారంభమైంది. రోమ్‌లో ప్రదర్శించిన ఆ పత్రంలో ఏముందన్న అంశం ఆస‌క్తిక‌రం. ఈ చిన్న పత్రంలో మొత్తం ఎనిమిది లైన్లు ఉన్నాయి. ఇందులో నాలుగో లైనులో.. "జీసస్ వారితో చెప్పాడు.. నా భార్య" అని మాత్రమే ఉంది. ఐదో వరుసలో "ఆమె నా శిష్యురాలిగా ఉండగలదు" అని చెప్పినట్టుగా ఉంది. మరికొన్ని వరుసల తర్వాత "నేను ఆమెతో కలిసి నివశిస్తున్నాను" అని అందులో ఉంది. ది లాస్ట్ గాస్పెల్ పుస్త‌కం చెపుతున్న ప్ర‌కారం   జీసస్ కు, మేరీ మాగ్దాలిన్ కు ఈజిప్ట్ దేశపు ఫారో పెళ్లి చేయించాడని, అతనికి ఆ వివాహం ద్వారా ఇద్దరు కొడుకులు కలిగారని ఆ పుస్తకం చెప్తుంది.
20వ శతాబ్దంలో వచ్చిన డోనోవాన్ జాయిస్ పుస్తకం జీసస్ స్క్రోల్ జీసస్ సంతానం గురించి, అతనికి మేరీ మాగ్దాలిన్ కి వున్న సంబంధం గురించి మాట్లాడిన మొదటి పుస్తకాల్లో ఒకటి. కథారిస్ట్ నమ్మకాల ప్రకారం జీసస్ క్రీస్ట్ కు మాగ్దాలిన్ కు ఏదో ఒక స్థాయిలో సంబంధం వుందని 13 వ శతాబ్దపు సిస్టీరికల్ సన్యాసి పీటర్ ఆఫ్ వాక్స్ డి సర్నే అంటారు. ఫ్రెంచ్ సోషలిస్టు రాజకీయ నాయకుడు లూయీ మార్టిన్ ‘లెస్ ఎవాంజైల్స్ సాంస్ డై’ అనే తన పుస్తకంలో ఇంకో అడుగు ముందుకు వేసి చరిత్రలో జీసస్ నాస్తికుడిగా మారి, మేరీ మాగ్దాలిన్ ను పెళ్ళాడి ఫ్రాన్స్ దక్షిణానికి వెళ్లి కొడుకును కన్నాడని రాసారు. 1977లో ప్రచురితమైన – ఆండ్రియాస్ ఫేబర్-కైసర్ రాసిన ‘జీసస్ డైడ్ ఇన్ కాశ్మీర్ : జీసస్, మోసెస్ అండ్ ది టెన్ లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయిల్’ పుస్తకంలో జీసస్ కాశ్మీర్ వచ్చారని, అక్కడ అతను కాశ్మీరీ స్త్రీని వివాహం చేసుకున్నాడ‌ని, వారికి సంతానం కూడా క‌లిగార‌ని  రాసాడు.
1982 లో మైకేల్ బైజేంట్, రిచర్డ్ లీ, హెన్రీ లింకన్ రాసిన ‘ది హోలీ బ్లడ్ అండ్ ది హోలీ గ్రెయిల్’ అనే పుస్తకంలో ఈ వాదనను మరింత ప్రచారం చేస్తూ – జీసస్ వంశావళి అతని కూతురు ద్వారా కొనసాగిందని, ఇప్పటికీ మేరోవింజియన్ వంశం ద్వారా ఇప్పటికీ నిలిచే ఉందనీ రాసారు. ది లాస్ట్ గాస్పెల్ లో ప్రకటనల వల్ల తెలిసేదేమంటే ఆ పత్రం కోడ్ చేయబడింది, ఓల్డ్ టెస్టమెంట్ లో జీసస్, మాగ్దాలిన్ ల పెళ్లి విషయం రహస్యంగా దాచి ఉంచారు. జోసెఫ్, అతని భార్య అసేనేత్ పాత్రలు నిజానికి జీసస్, మేరీ మాగ్దాలిన్ లవేనని, జీసస్ పిల్లలిద్దరి పేర్లూ, వారికి రోమన్ సామ్రాజ్యంలో శక్తిమంతులైన రాజకీయ నాయకులతో వున్న సంబంధాలను తెలియచేస్తానని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
చాలా మంది పండితులు కూడా ఈ వాదనలన్నీ పస లేనివని కొట్టి పారేశారు. కానీ, మేరీ మాగ్దాలిన్ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. బైబిల్ పాత్రల్లో ముఖ్యమైన మాగ్దాలిన్ చుట్టూ ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలు వున్నాయి. వీటిలో కొన్ని ఊహలను సమర్ధించే సిద్ధాంతాలు కూడా వున్నాయి. కానీ అవన్నీ ఊహాగానాలు గానే ఉండిపోయాయి. నిజమైనా కాకపోయినా, ది లాస్ట్ గాస్పెల్ మాత్రం మళ్ళీ జనం మనసుల్ని కదిలించింది.
సుప్రసిద్ధ సైంటిస్టు,రచయిత ఐజెక్ అసిమోవ్ బైబిల్ పైనా,క్రైస్తవుల పైనా విమర్శ పరంపరలు చేశాడు. బైబిల్ రివలేషన్ 22వ అధ్యాయం 7వ వ‌చ‌నంలో నేను త్వరలో తిరిగొస్తాను అని చెప్పి వెళ్ళిన క్రీస్తు రెండువేల సంవత్సరాలు అయినా రాలేదు. అంతటితో బైబిల్ లో కొత్త నిబంధన ముగుస్తుంది. అలాంటి బైబిల్ ను వివిధ కోణాల నుంచి చూస్తున్నారు. యూదులు కేవలం పాత నిబంధన వరకే పరిమితమౌతున్నారు. కొత్త నిబంధన వారు అంగీకరించరు. యూదులు, క్రైస్తవులు అక్కడ పోట్లాడుకుంటున్నారని చెపుతారు. అసిమోవ్ వివరణ ప్రకారం బైబిల్ పాతనిబంధన ప్రకారం కొన్ని చారిత్రక ప్రస్తావనలు, కొన్ని వివాదాస్పద తేడాలు, కొన్ని గాథలు వున్నాయి. క్రీ.పూ.8500 సంవత్సరం మొదలుకొని యీ ప్రస్తావనలు వున్నాయి. యూదుల దృష్టిలో క్రీ.పూ3761 నాడు సృష్టి ఆరంభమైంది! ఆర్చిబిషప్ ఉషర్ దృష్టిలో క్రీ.పూ.4004 నాడు సృష్టి మొదలైంది. వివిధ ప్రస్తావనల అనంతరం, క్రీ.పూ.4న జీసస్ క్రీస్తు పుడతాడు. ఆధునిక చరిత్ర దృష్ట్యా బైబిల్ ను స్వీకరించకూడదు. పురావస్తు పరిశీలన చేసి రాసిన గ్రంథం కాదని గ్రహించాలి. అలాగే నిర్థారిత తేదీలు, ఆధారాలు కూడ బైబిల్ ద్వారా లభించవు. ఏసుక్రీస్తు మగ్దలేని మరియను వివాహమాడాడని బైబిల్ వ్యతిరేక పత్రికల్లో ఒకటైన ఫిలిప్పు సువార్తలో ఉంది. దీన్ని క్రైస్తవ లోకం అంగీకరించలేదు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పిన క్రీస్తు వివాహమాడివుంటే భార్యను సమాజానికి కనీసం ఒక్క సారైనా పరిచయం చేసేవాడని, కనుక క్రీస్తు వివాహం చేసుకోలేదని వారంటారు. జీసస్ కు మేరీ మాగ్దాలిన్ తో పెళ్లి అయిందా, వారి పిల్లలు ఇలాంటి ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా వివాదాలు మాత్రం తప్పక రేకెత్తిస్తాయన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

No comments:

Post a Comment