Tuesday, 29 November 2016

వై దిస్ యూ ట‌ర్న్ కేసీఆర్

                      వై దిస్ యూ ట‌ర్న్ కేసీఆర్

చెప్పేదొక‌టి... చేసేదొక‌టి... ఇదే రాజ‌కీయం అనాలేమో... అధికారంలోకి రావ‌డానికి ముందు అధికారం కోసం ఎన్ని అడ్డ‌దారులైనా తొక్కొచ్చు. క‌నీసం పీఠం ఎక్కిన త‌ర్వాత‌నైనా బుద్ది కొంచెం మార్చుకుంటే నాయ‌కుల మాట‌ల‌కు కొన ఊపిరితో మిగిలిన విశ్వాసం అయినా అలా మిగిలి ఉంటుంది. తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు అని చెప్పే తెలంగాణ సీఎం కేసీఆర్ అవ‌స‌రం అయితే కుందేటికి ఉన్న ఒక కాలు విరిచైనా నిరూపించ‌గ‌ల‌రు. అది ఆయ‌న వాగ్దాటి. అలాంటి కేసీఆర్ పెద్ద‌నోట్ల రుద్దు విష‌యంలో మాత్రం యూట‌ర్న్ తీసుకున్నారు. న‌వంబ‌ర్ 8న హ‌టాత్తుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం కేసీఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అందుకే లోలోప‌ల కుమిలిపోయారు. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నోట్ల ర‌ద్దు కార‌ణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా ప‌డిపోయింద‌ని, వ్యాపారాలు నిలిచిపోయాయ‌ని, రెవెన్యూ న‌ష్టం కోట్ల‌కు చేరిపోయింద‌ని అధికారుల వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అలా అని బ‌హిరంగంగా మాత్రం కామెంట్ చేయ‌లేదు. తర్వాత ఏమైందో తెలియ‌దు గానీ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ ప్ర‌ధాని మోడీని క‌లిసివ‌చ్చారు. అక్క‌డ ఏం జ‌రిగిందో ఏమో కానీ… ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా యూ ట‌ర్న్ తీసుకున్నారు. న‌ల్ల‌ధ‌నం ర‌ద్దును గొప్ప డెసిష‌న్‌గా హైద‌రాబాద్‌లో మీటింగ్ పెట్టి మ‌రీ ఉద్ఘాటించారు. అంతేకాదు, నోట్ల ర‌ద్దుతో దేశానికి మంచి జ‌రుగుతుంద‌ని, ఈ విష‌యంలో తెలంగాణ స‌ర్కారు పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని కూడా తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్‌ను పెంచుతామ‌ని, దీనికిగాను ఇప్ప‌టికే ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తీసుకొని క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్‌ను అమ‌లు చేస్తామ‌ని, అక్క‌డి రిజ‌ల్ట్‌ను బ‌ట్టి రాష్ట్ర వ్యాప్తంగా మ‌రింతగా డెవ‌లప్ చేస్తామ‌న్నారు. కేసీఆర్ ఇలా యూట‌ర్న్ తీసుకుంటార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. నిజానికి ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్‌.. తెలంగాణ‌లో త‌మ‌కు అధికార కేసీఆర్ కూడా క‌లిసి వ‌స్తార‌ని భావించింది. కానీ, ఇంత‌లో కేసీఆర్ ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డంతో అంటే భ‌విష్య‌త్తులో 2019లో మోడీతో పొత్తు కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారా ? లేకుంటే ఇంత‌లా ఎందుకు పొగిడారు… అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
ఇంతలా కేసీఆర్ ట‌ర్న్ తీసుకోవ‌డానికి వ్య‌తిరేకులు మాత్రం చాలా అర్ధాలు తీస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మకాలం నుంచి రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు సాగించిన దందాలుతో భారీగానే బ్లాక్ స‌మ‌కూర్చార‌ని అంటున్నారు. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియ‌ని సందిగ్ధంలోనే ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డ జ‌రిగిన చ‌ర్చ‌ల సారాంశం  బ‌య‌ట‌కు రాకున్నా కుమార్తె క‌విత‌కు క్యాబినెట్ బెర్తుకోసం పైర‌వీ సాగింద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ అవాస్త‌వాలే అనుకున్నా ఆయ‌న ట‌ర్న్ తీసుకున్న‌ది మాత్రం వాస్త‌వం కావ‌డంతో ప్ర‌త్య‌ర్ధుల విమ‌ర్శ‌ల‌కు కొంత ఊతం వ‌చ్చింది. మ‌రో రీజ‌న్ కూడా వినిపిస్తోంది. కేసీఆర్‌కి ఇప్పుడున్న బ‌లం స‌రిపోతుంది. కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే.. ఆశించిన విధంగా త్వ‌ర‌గా నిధులు అందే అవ‌కాశం ఉంటుంద‌ని, స్టేట్ డెవ‌ల‌ప్ మెంట్‌కి ఉప‌యోగంగా ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో పెద్ద నోట్ల ర‌ద్దును ఆయ‌న స్వాగ‌తిస్తున్న‌ట్టు చెబుతున్నారు. అందుకే మోడీ విష‌యంలో ఆయ‌న కేవ‌లం 15 రోజుల్లోనే యూ ట‌ర్న్ తీసుకున్నార‌ని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

No comments:

Post a Comment