పారదర్శకత ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం పఠించే మంత్రం. అంటే అసలు రహస్యాలు లేని పాలన అందించడమే తన తొలి ప్రాధాన్యం అని పదే పదే చెపుతుంటారు. వాస్తవంగా ఆయన చెప్పిన మాటలను ఆచరణలోనూ చూపితే అంతకన్నా గొప్పపాలన మరేం ఉంటుంది. ఎంతైనా చంద్రబాబు నాయుడు కదా.. అందుకే వినేవాడు ఏదో అయితే.. చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని తెలుగునాట నానుడి స్థిరపడి పోయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీ సర్కారు ఇప్పటి వరకు విడుదల చేసిన జీవోలు 52,499. గణాంకాల పరంగా చాలా గొప్పగా ఉన్నా వీటిలో రహస్య పాలనకు సంబంధించిన జీవోలు అధికంగా ఉన్నాయి. పారదర్శకంగా ఉండాల్సిన సర్కారు ఉత్తర్వులు 'రహస్య' జాబితాలో చేరి పోతున్నాయి. ప్రభుత్వ సమాచారం, జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో జీవోలు పెట్టాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జారీ చేశామంటున్న జీవోల పక్కన 'కాన్ఫిడెన్షియల్' అని కనబడుతుంది. ఫైల్‌పై క్లిక్ చేస్తే తెల్లగా ఉంటుంది తప్ప వివరాలుండవు. జీవో నెంబర్, జారీ చేసిన తేదీ మాత్రం ఉంటుంది. పారదర్శకతకు మారు పేరుగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనకు సాటి రాగలవారెవరూ లేరని తరుచు ప్రకటించే చంద్రబాబు సర్కారులోనే 'కాన్ఫిడెన్షియల్' జీవోలు పెద్ద సంఖ్యలో వెలువడుతున్నాయి. గవర్నమెంట్ ఆర్డర్ల దాపరికంపై అనుమానాలు రేకేత్తు తున్నాయి. చాటు మాటున ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేందుకే పారదర్శకతకు పాతరేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం సర్కారు ఎపిలో అధికారంలోకొచ్చిన 2014 జూన్ 2 నుండి 2016 నవంబర్ వరకు మొత్తం 52,499 జీవోలు జారీ కాగా వాటిలో దాదాపు 1500 కాన్ఫిడెన్షియల్. పాలనలో వందల సంఖ్యలో 'రహస్య' జీవోలొచ్చాయి. సచివాలయంలో జీవోలు వెలువరిస్తున్న మొత్తం ప్రభుత్వ విభాగాలు 39. అందులో 14 శాఖల నుంచి కాన్ఫిడెన్షియల్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యధిక రహస్య జీవోలిస్తున్నది మాత్రం సాధారణ పరిపాలన శాఖ. 'రహస్య' జీవోలివ్వడంలో మొదటి స్థానంలో ఉన్న జిఎడి స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే ఉంటుంది. చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న విభాగం నుంచే వందల సంఖ్యలో కాన్షిడెన్షియల్ జీవోలు వచ్చాయి. జిఎడి తర్వాత రెండో స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. హోం, ఆర్థిక, వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖలు సైతం 'రహస్య' ఆర్డర్లు ఇచ్చాయి. రాష్ట్రంలో పాలనకు గుండెకాయ ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులను మూడు రకాలుగా విడుదల చేస్తోంది. జీవోఎంఎస్ (గవర్నమెంట్ ఆర్డర్ మ్యాన్యుస్క్రిప్ట్), జీవో ఆర్.టి (గవర్నమెంట్ ఆర్డర్ రోటీన్), జీవోపీ (గవర్నమెంట్ ఆర్డర్ ప్రింట్) ద్వారా విడుదల చేస్తుంది. అయితే ఎక్కువ శాతం జీవో ఆర్.టి., జీవోఎం.ఎస్ ద్వారానే పాలన సాగుతోంది. జీవోఎంఎస్ ప్రకారం మొత్తం 6922 జీవోలు విడుదలయ్యాయి. జీవో ఆర్. టి. ప్రకారం 44213 జీవోలు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రెవిన్యూ శాఖ కీలక ఆదాయవనరు. రెవిన్యూ శాఖలో జీవోఎంఎస్ ప్రకారం 1111, జీవోఆర్టీ ప్రకారం 2889 జీవోలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబునాయుడ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేతకార్మికుల రుణమాఫీ, రూ. 200 పింఛన్ ను రూ. 1000, రూ. 1500కు పెంచారు. ఉద్యోగాల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిపైనా, బెల్టు షాపుల రద్దుపైనా చేశారు. వీటన్నింటికీ ఆయా శాఖ ద్వారా జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. దురదృష్టం ఏమిటంటే ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
Wednesday, 30 November 2016
నిజంగా బ్లాక్ మనీపై యుద్ధమా?
ప్రభుత్వం ఎన్నో అసత్యాలను ప్రచారం చేస్తోంది. భారత ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది. పూలవనంలో దున్నపోతు సృష్టిస్తోన్న విధ్వంసాన్ని అది గుర్తుకు తెస్తోంది. భారత ప్రభుత్వం చెపుతున్న ఆర్ధిక వాదనలు హేతుబద్ద అలల తాకిడికి కొట్టుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పెద్ద నోట్ల రద్దు 'నల్లధనం'పై తీసుకున్న చర్య అని ప్రభుత్వ ప్రతినిధులు చెపుతున్నా మాట. 'నల్లధనం' అనే మాట ఒక అపప్రయోగం. అది ఒక 'పోగుపడిన ద్రవ్యరాశి' కాదు. అది ఒక 'ప్రవాహం'. అంటే అది పరుపుల కింద దాచిన నోట్ల కట్ట్లల్లా కుప్పలుగా కాకుండా కొన్నిసార్లు చట్ట విరుద్ధంగా, మరికొన్నిసార్లు చట్ట ప్రకారం చేసే కార్యకలాపాలుగా ఉంటాయి. పన్నులు చెల్లించకుండా ఉండటానికి అవి అప్రకటిత కార్యకలాపాలుగా మారతాయి. ఈ కార్యకలాపాలు ఇతర కార్యకలాపాల తరహాలోనే డబ్బుతోనే నడుస్తాయి. ప్రధానంగా డబ్బు రూపంలో ఇలాంటి కార్య కలాపాల ప్రవాహం కొనసాగటానికి కట్టలుగా ఉండే డబ్బు అవసర మౌతుంది. అయితే ఈ డబ్బు కట్టలలోని కొంత భాగాన్ని నిర్వీర్యం చేయటం వల్ల ఈ కార్యకలాపాలు లాభసాటిగా ఉన్నంత కాలం వీటిని ఆపటం సాధ్యంకాదు.
నోట్ల రద్దుతో బ్లాక్ మార్కెట్ లోని రూ.3.5 లక్షల కోట్లను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 'నల్ల ఆర్థిక వ్యవస్థ'లో ఎక్కువలో ఎక్కువగా రూ.3.5 లక్షల కోట్లే నిర్వీర్యమౌతాయని నోట్ల రద్దును సమర్థించిన రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా చెప్పారు. అయితే ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం 'నల్ల ఆర్థిక వ్యవస్థ' పరిమాణం 'మొత్తం ఆర్థిక వ్యవస్థ'లో నాల్గవ వంతు ఉంటుంది. అంటే అది స్థూలంగా రూ.35 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇతరులు ఈ భాగం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడు 'నల్ల ఆర్థిక వ్యవస్థ'లో లాభాల శాతం తక్కువలో తక్కువగా మొత్తం ఆదాయంలో సగం ఉంటుంది. అంటే రూ.17.5 లక్షల కోట్లుగా ఉంటుంది. నిర్వీర్యం అయ్యే మొత్తం కరెన్సీ పరిమాణం 'నల్ల ఆర్థిక వ్యవస్థ' లాభాలలో 20 శాతం కంటే ఎక్కువ ఉండదు. దీనితో వచ్చే లాభాన్ని తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడితే ఈ ఆర్థిక వ్యవస్థ లాభం రేటు కేవలం 25 నుంచి 20 శాతానికి పడిపోతుంది ఇదికూడా తక్కువలో తక్కువగా అంచనా వేసినప్పుడు. ఇలాంటి నామమాత్రపు తగ్గుదల 'నల్ల ఆర్థిక వ్యవస్థ'కు శరాఘాతం అవుతుందని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే అంత తక్కువగా డబ్బు నిర్వీర్యం అవటం ఈ రంగం లాభాలతో పోల్చినప్పుడు చాలా చిన్న విషయం. అది 'నల్ల కార్యకలాపాలను' నిరుత్సాహ పరచదు. అయినప్పటికీ అంతకు ముందులాగా ఈ కార్యకలాపాలను కొనసాగించటానికి డబ్బు అవసరమౌతుంది. కాబట్టి ఈ డబ్బు అందుబాటులో లేకపోవటంతో బ్లాక్ మనీ కార్యకలాపాలకు అంతరాయం కలుగదా? ఇక్కడే అసలు సమస్య ఉంది.
'నల్ల కార్యకలాపాలు' లాభసాటిగా ఉన్నంత కాలం, నోట్ల రద్దుతో డబ్బు అందుబాటులో లేకపోయినా, ఈ కార్యకలాపాలు కొనసాగటానికి తాజాగా డబ్బు అవసరమౌతుంది. ఈ విధంగా చూస్తే బ్లాక్ మార్కెట్ మరింత డబ్బును డిమాండ్ చేస్తుంది. ఇంతమేరకు డబ్బు సరఫరాను పెంచకపోతే వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు అలా పెరగటంవల్ల వైట్ రూపంలో ఉన్న డబ్బు బ్లాక్ లోకి బదిలీ అవుతుంది. ఇలా జరగటం వల్ల డబ్బుపై ఆధారపడే అసంఘటిత రంగం పెరిగిన వడ్డీ రేట్లతో సతమతమౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే నోట్ల రద్దుతో 'నల్ల ఆర్థిక వ్యవస్థ'పై దాడి జరగకపోవటమే కాక వాస్తవంలో అది 'మొత్తం ఆర్థిక వ్యవస్థ'లోని అసంఘటిత రంగం మీద దాడిగా మారుతుంది. ఇలా జరగటానికి గల కారణం వ్యవస్థలోని అంతర్గత తర్కంలో ఉన్నది. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోలేదని చెప్పటమంటే చాలా రాయితీ ఇచ్చినట్టవుతుంది. బాగా లాభసాటిగా ఉన్న కార్యకలాపాలకు నిర్వహణ పెట్టుబడితో సహా ఇతర అవసరాలకు తక్కువ లాభసాటిగా ఉన్న కార్యకలాపాల నుంచి వనరులను లాక్కోవటం జరుగుతుంది. చిన్న ఉత్పత్తిదారులు, చిన్నతరహా వ్యాపార రంగం గల లేక 'సువ్యవస్థితంకాని' రంగం గల భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలో ఇది జరుగుతుంది. మార్క్స్‌కు ముందరి సంప్రదాయ ఆర్థికవేత్తలైన ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డోలు కూడా తక్కువ లాభసాటియైన కార్యకలాపాల నుంచి ఎక్కువ లాభసాటియైన కార్యకలాపాలకు పెట్టుబడి ప్రవహిస్తుందని చెప్పారు. కొంత భాగం డబ్బు రూపంలో ఉండటంతో సహా ద్రవ్య పెట్టుబడి విషయంలో కూడా ఇదే జరుగుతుందనేది నిజం. అయితే భారత రిజర్వ్ బ్యాంక్ దీన్ని జరగనివ్వదనుకోండి. నోట్ల రద్దు వల్ల 'నల్ల ఆర్థికవ్యవస్థ'లో 'నష్టపోయిన' దాన్ని భర్తీచేయడానికి రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగి డబ్బు సరఫరాను పెంచే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితిలో 'నల్ల ఆర్థికవ్యవస్థ' తాత్కాలికంగా కూడా ఎక్కువ వడ్డీ చెల్లించకుండా తన కార్యకలాపాలకు కావలసిన డబ్బును సమకూర్చుకుంటుంది. అలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే చిన్న ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా చూడగలిగే అవకాశం ఉండేది.
'నల్ల ఆర్థిక వ్యవస్థ'కు వ్యతిరేకంగా పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల జరిగేదేమీ ఉండదని అర్థమవుతుంది. 'నల్ల కార్యకలాపాలు' లాభసాటిగా ఉన్నంత వరకు అవి కొనసాగుతూనే ఉంటాయి. అయితే మొత్తం ఆర్థికవ్యవస్థకు పరస్పర సంబంధంలో ఉండే స్వభావం ఉండటం చేత, 'తెల్ల', 'నల్ల' ఆర్థిక వ్యవస్థలు జెమిలిగా ఉండటంచేత 'నల్ల కార్యకలాపాల'పై తీసుకునే నోట్ల రద్దు వంటి చర్యలు వాటి ఆకర్షణను రూపుమాపకపోతే అవి 'తెల్ల ఆర్థికవ్యవస్థ'లోని బలహీన విభాగమైన 'అసంఘటిత రంగాన్ని' దెబ్బతీస్తాయి. 'తెల్ల' ఆర్థికవ్యవస్థ ఉత్పత్తిలో 45 శాతం, ఉద్యోగ కల్పనలో దాదాపు 80 శాతం వాటాను ఈ రంగం కలిగివుంది. అందుకే ఇలాంటి చర్యలు ఎదుటివారిని వెక్కిరించటానికి తన ముక్కునే తాను కోసుకున్న చందంగా ఉంటాయి. నేను వాదిస్తున్న దానికి వ్యతిరేకంగా ఇలా చెప్పవచ్చు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన 'నష్టాన్ని' పూడ్చుకోవటానికి 'నల్ల ఆర్థికవ్యవస్థ' తాజాగా డబ్బు సమకూర్చు కోవటానికి అప్పులు చేయవలసి వస్తుంది. వాటిపై వడ్డీ భారం కూడా పడుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దుతో ఒకే ఒక్కసారి డబ్బు అందకుండా చేస్తే ఈ ఆర్థిక వ్యవస్థ అంతకుముందులాగా పనిచేయటం కొనసాగినప్పటికీ 'నల్ల ఆర్థిక వ్యవస్థ' అదనంగా వడ్డీ చెల్లించవలసి వస్తుంది. అయితే మనం చూసినట్టుగా ఈ ఒకే ఒక్కసారి చేసే నష్టం లాభదాయకతతో పోల్చినప్పుడు నామమాత్రమైనప్పుడు వడ్డీ చెల్లించటమనే భారం అంతకంటే నామమాత్రమౌతుంది. నిజానికి అది పట్టించుకోనవసరం లేనంత నామమాత్రంగా ఉంటుంది.
ఇదంతా చెప్పటమంటే 'నల్లధనం' ప్రాధాన్యతను తగ్గించి చూపటం కాదు. 'నల్లధనం'పై పోరాడటానికి పెద్ద నోట్లను రద్దు చేయటమనే ఆయుధం సరైంది కాదని చెప్పటమే ఈ వాదన ఉద్దేశం. అయితే ఇక్కడ రెండు సమస్యలను వేరువేరుగా చూడాలి. భారత ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య 'నల్లధనం' అని ప్రభుత్వం, రామ్‌దేవ్ బాబాలాంటి 'కుహనా అర్థశాస్త్ర నిపుణులు' చెప్పేది పూర్తిగా అర్థ రహితం అనేది మొదటిది. ప్రజల జీవితాలు దారిద్య్రంలో మునిగితేలుతుండటానికి పెట్టుబడిదారీ వ్యవస్థ కారణం కాదని, 'నల్లధనం' కూడబెట్టటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల మూలంగానే ఇది జరుగుతోందని చెప్పటం వారి ఉద్దేశం. రెండు కారణాల చేత ఈ అభిప్రాయం తప్పు. 'తెల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ', 'నల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ'ల మధ్య గల తేడా చాలా స్వల్పమనేది మొదటి కారణం. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటేనే లాభాల కోసం ప్రాకులాట. ఏ కార్యకలాపాలలోనైతే లాభాలు గడించవచ్చో ఆ కార్యకలాపాలను పెట్టుబడిదారులు చేపడతారు.
ఒకవేళ అలాంటి కార్య కలాపాలు చట్టవిరుద్ధమైనవైతే అవి 'నల్ల కార్యకలాపాలు'గా ఉంటాయి. అయినప్పటికీ వాటిని చేపట్టటంతో ఏర్పడే ప్రమాదం కంటే అవి లాభసాటిగా ఉన్నంత కాలం వాటిని కొనసాగించటం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో కొన్ని కార్య కలాపాలకు పెట్టినపేరే 'నల్ల ఆర్థిక వ్యవస్థ'. ప్రపంచంలో 'నల్ల ఆర్థిక వ్యవస్థ'లేని పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. ఉండజాలదు. ఉదాహరణకు అమెరికాలో మాదక ద్రవ్యాల అమ్మకం ఒక ప్రధాన సమస్య(నిజమే సోషలిజంలో కూడా 'నల్ల ఆర్థిక వ్యవస్థ' తక్షణమే కనుమరుగవదు. అయితే తాను ఆవిర్భవించిన పెట్టుబడిదారీ వ్యవస్థ అనే మాయను వదిలించుకోవటానికి సోషలిజానికి కూడా చాలా కాలం పడుతుంది. కానీ లాభాపేక్ష ప్రాతిపదికన సోషలిస్టు వ్యవస్థ పనిచేయదు గనుక అనతికాలంలో దానికి సంక్రమించిన పెట్టుబడిదారీ వారసత్వం అంతరిస్తుంది).
దేశంలో 'నల్ల ఆర్థిక వ్యవస్థ' అనేదే లేదని ఒకవేళ మనం అనుకున్నా మార్క్స్ చెప్పిన ఒక ధృవం వద్ద సంపదను, మరో ధృవం వద్ద దారిద్య్రాన్ని ఉత్పత్తిచేసే పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్లీనంగా ఉండే ధోరణులు పనిచేస్తాయనేది రెండవ కారణం(ఆయన విశ్లేషణలో 'నల్ల ఆర్థిక వ్యవస్థ' ప్రస్తావన లేదు). నిజానికి ఈ నయా ఉదారవాద శకంలో అవి కళ్ళ ముందే పనిచేయటాన్ని మనం చూస్తున్నాము. 'నల్ల ఆర్థిక వ్యవస్థ' ప్రస్తావన లేకుండానే భారతదేశంలో ఈ ప్రక్రియ జరుగుతున్న తీరు గురించి రాసిన రాతలతో వేలకు వేల పేజీలు నిండాయి. దీన్ని గురించి మరింతగా శ్రమపడనవసరం లేదు. అయితే మనం ఇక్కడ వివరించే రెండవ సమస్య ఈ వర్తమాన వ్యవస్థలో కూడా 'నల్లధనం'పై పోరాడే పద్ధతికి సంబంధించి ఉంటుంది. నోట్ల రద్దు పద్ధతి 'నల్లధనం'పై పోరాటంగా ఉండటానికి బదులు చిన్న ఉత్పత్తిదారులను, చిరు వ్యాపారులను నాశనం చేసే అస్త్రంగా మారుతుంది. ఆవిధంగా అది 'ఆదిమ మూలధన సంచయం' ప్రక్రియను ముందుకు తీసుకు పోవటమవుతుంది.
'నల్లధనం'పై పోరాడటానికి తక్షణం చేయవలసిందేమంటే చట్ట ఉల్లంఘనలను నిజాయితీగా, లోతుగా విచారించి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఆ విధంగా 'నల్ల కార్యకలాపాల'ను ఆకర్షణీయంగా లేకుండా చేయాలి. అలా చేయకుండా ప్రజల మధ్యలో కొందరు నేరగాళ్ళు ఉన్నారనే పేరుతో నిజాయితీపరులకు ముఖ్యంగా పేదలకు ఇబ్బందులు కలిగించే చర్యలను చేపట్టి వారి జీవితాలను మరింత దుర్భరంగా చేయటమంటే ప్రభుత్వం హేతువును విస్మరించటమే అవుతుంది. ఇది యావద్దేశాన్నీ నివ్వెర పరిచే విషయం
(ప్రముఖ మార్క్సిస్ట్ ఆర్ధిక వేత్త ప్రభాత్ పట్నాయక్ నోట్ల రద్దు పై విశ్లేషణ ఇది )
Tuesday, 29 November 2016
వై దిస్ యూ టర్న్ కేసీఆర్
వై దిస్ యూ టర్న్ కేసీఆర్
చెప్పేదొకటి... చేసేదొకటి... ఇదే రాజకీయం అనాలేమో... అధికారంలోకి రావడానికి ముందు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. కనీసం పీఠం ఎక్కిన తర్వాతనైనా బుద్ది కొంచెం మార్చుకుంటే నాయకుల మాటలకు కొన ఊపిరితో మిగిలిన విశ్వాసం అయినా అలా మిగిలి ఉంటుంది. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని చెప్పే తెలంగాణ సీఎం కేసీఆర్ అవసరం అయితే కుందేటికి ఉన్న ఒక కాలు విరిచైనా నిరూపించగలరు. అది ఆయన వాగ్దాటి. అలాంటి కేసీఆర్ పెద్దనోట్ల రుద్దు విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నారు. నవంబర్ 8న హటాత్తుగా ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం కేసీఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అందుకే లోలోపల కుమిలిపోయారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయిందని, వ్యాపారాలు నిలిచిపోయాయని, రెవెన్యూ నష్టం కోట్లకు చేరిపోయిందని అధికారుల వద్ద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలా అని బహిరంగంగా మాత్రం కామెంట్ చేయలేదు. తర్వాత ఏమైందో తెలియదు గానీ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీని కలిసివచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ… ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. నల్లధనం రద్దును గొప్ప డెసిషన్‌గా హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టి మరీ ఉద్ఘాటించారు. అంతేకాదు, నోట్ల రద్దుతో దేశానికి మంచి జరుగుతుందని, ఈ విషయంలో తెలంగాణ సర్కారు పూర్తిగా సహకరిస్తుందని కూడా తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్‌ను పెంచుతామని, దీనికిగాను ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తీసుకొని క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌ను అమలు చేస్తామని, అక్కడి రిజల్ట్‌ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరింతగా డెవలప్ చేస్తామన్నారు. కేసీఆర్ ఇలా యూటర్న్ తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. నిజానికి ప్రధాని మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో తమకు అధికార కేసీఆర్ కూడా కలిసి వస్తారని భావించింది. కానీ, ఇంతలో కేసీఆర్ ఇలా యూటర్న్ తీసుకోవడంతో అంటే భవిష్యత్తులో 2019లో మోడీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారా ? లేకుంటే ఇంతలా ఎందుకు పొగిడారు… అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతలా కేసీఆర్ టర్న్ తీసుకోవడానికి వ్యతిరేకులు మాత్రం చాలా అర్ధాలు తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు సాగించిన దందాలుతో భారీగానే బ్లాక్ సమకూర్చారని అంటున్నారు. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియని సందిగ్ధంలోనే ఢిల్లీ పర్యటన సాగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్కడ జరిగిన చర్చల సారాంశం బయటకు రాకున్నా కుమార్తె కవితకు క్యాబినెట్ బెర్తుకోసం పైరవీ సాగిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ అవాస్తవాలే అనుకున్నా ఆయన టర్న్ తీసుకున్నది మాత్రం వాస్తవం కావడంతో ప్రత్యర్ధుల విమర్శలకు కొంత ఊతం వచ్చింది. మరో రీజన్ కూడా వినిపిస్తోంది. కేసీఆర్‌కి ఇప్పుడున్న బలం సరిపోతుంది. కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే.. ఆశించిన విధంగా త్వరగా నిధులు అందే అవకాశం ఉంటుందని, స్టేట్ డెవలప్ మెంట్‌కి ఉపయోగంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దును ఆయన స్వాగతిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే మోడీ విషయంలో ఆయన కేవలం 15 రోజుల్లోనే యూ టర్న్ తీసుకున్నారని కూడా చర్చ జరుగుతోంది.
Monday, 28 November 2016
బలితీసుకుంటున్న బయోలు
విరామమెరుగక పరిశ్రమిస్తూ, బలం ధరిత్రికి బలికావించే కర్షకుడికి కుడి, ఎడమల దగా నిత్యకృత్యమైంది. వరుణుడి కరుణకోసం ఆకాశం వంక ఆశగా ఎదురుచూసే కష్టజీవిని దోచుకోవడానికి అందరూ ముందుంటున్నారు. విత్తనాల మొదలు, ఉత్పత్తి విక్రయం వరకు ఒకటే తీరు. అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలదీ అదే తీరు. ఇటీవలి కాలంలో రైతు వెన్ను విరుస్తున్న మరో సమస్య నకిలీ బయోలు.
ఒకటి రెండు కాదు.. జిల్లాకో వెయ్యికి పైగా ఇలాంటి కేంద్రాలు తయారయ్యాయి. వీటి ద్వారా కేవలం ఏపిలో జరిగే వ్యాపారం ఎంతో తెలుసా అక్షరాల మూడువేల కోట్ల రూపాయలు. బయో ఎరువుల ఇప్పడు సాగుతున్న దందా రాజకీయ వ్యవస్థలను కూడా శాసించే స్ధాయిలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, హైదరాబాద్.. ఇలా ఒకటేమిటి అడుగుకో సంస్థ ఏర్పాటైంది. గుజరాత్, ముంబై తదితర ప్రాంతాలనుంచి భారీగా దిగుమతి చేసుకొని రీ ప్యాకింగ్ చేస్తున్నవారికి కొదువ లేదు.
మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా రూ.5000 కోట్ల వరకు నకిలీ బయోల వ్యాపారం సాగుతోంది. ఈ ఆరు రాష్ట్రాల్లో బయోల వ్యాపారానికి తెలుగు రాష్ట్రాలే రాజధాని అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. దీని వెనుక బడానేతల నుంచి వారి అనుయాయులుగా ఉండే వందిమాగధులు ఉన్నారు. వారికి రిటైర్డ్ వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఆసరా. వారికి మాత్రమే ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేసే వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయిమరి. నకిలీల ఉత్పత్తిలో గుంటూరు, కర్నూలు, హైదరాబాద్ కీలకంగా ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో సుమారు వంద పెద్ద యూనిట్‌లు పని చేస్తున్నాయి. ఈ యూనిట్‌ల ద్వారా ఏటా రూ. 300 కోట్ల విలువైన బయోలను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోలను రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 500 కంపెనీలు కొనగోలు చేస్తున్నాయి. మూడో దశలో రెండు రాష్ట్రాల్లో 15వేల మంది పంపిణీదారులు రూ. వెయ్యి కోట్ల లావాదేవీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో 60 నుంచి 70 సంస్థలు ఉండగా కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో 30 సంస్థల వరకు పని చేస్తున్నాయి.
బయోల తయారీ కోసం వాడుతున్న ముడి సరుకు కూడా అత్యంత దారుణం. ఇండస్ట్రీస్ లో మిగిలిపోయిన, వాడిన తర్వాత ఉండే వ్యర్ధాలను ఉపయోగిస్తున్నారు. ఇక అన్నింటికీ ముందుండే చైనా ఉత్పత్తులకు కొరత లేదు. మనకు లభించే సాల్వెన్స్ 90 శాతం, జిబ్బర్లిక్ యాసిడ్, డిటర్జంట్, చైనా నుంచి వచ్చే రసాయనిక పదార్థాలనూ కలిపి బయోల పేరుతో తయారు చేస్తున్నారు. ప్రధానంగా రెండు వందల లీటర్ల డ్రమ్ముల్లో ఈ ద్రవ పదార్థాలను పోసి పల్వరైజ్ ప్యాకింగ్ చేస్తున్నారు. దీన్నే రీప్యాకింగ్ చేసి అందమైన లేబుల్స్ తో మార్కెట్ చేస్తున్నారు. వీటికి మార్కెట్ టెక్నిక్ మరింతగా తోడ్పడుతుంది. డీలర్లు విక్రయించే సామర్ధ్యాన్ని బట్టి వారి కుటుంబం మొత్తానికి విదేశీ టూర్లు ఏర్పాటు చేస్తున్నారు ఉత్పత్తిదారులు. మార్జిన్ విషయంలోనూ 60శాతం పైగా ఉంటోంది. వీటికి ఆశపడిన విక్రేతలు బలవంతంగా అయినా రైతుకు ప్రొడక్టు అంటగడుతున్నారు. ఎక్కువగా వ్యవసాయ సీజన్ లో క్రెడిట్ మీదే సాగే వ్యాపారం కావడంతో రైతు కూడా తప్పనిసరిగా తీసుకు వెళుతున్నాడు.
చైనా నుంచి వచ్చే రసాయనాలను పొడి రూపంలో తెస్తారు. ఎంత ఎక్కువగా అనుకున్నా కిలో ధర రూ 5వేలు లోపు మాత్రమే. ఈ పొడిని కాన్సన్ ట్రేట్ గా వాడి లిక్విడ్ గా మార్చుతున్నారు. అంటే ఒక కేజీ ద్వారా 20లీటరల్ నుంచి 25 లీటర్ల వరకు తయారు చేస్తున్నారు. ఇమామెక్టిన్ బెంజోయేట్, అబామెక్టిన్, ఎసిటమాప్రిడ్ వంటి రసాయనాలు కలుపుతారు. ఇలా తయారైన 25 లీటర్లను 50 ఎంఎల్ - 100 ఎంఎల్ బాటిళ్ల రూపంలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ధర కూడా 50మి.లీ రూ 500 ఉంటుంది. ఇది ఎంఆర్పి. వీటిని మొక్క పెరుగుదలకు ఉపయోగం అంటూ ప్రచారం కూడా ఊదరగొట్టేస్తున్నారు. అమైనో యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, నైట్రో బెజిన్, సివిడి ఎక్స్‌ట్రాక్ వంటి మందులను ఉపయోగిస్తే మొక్క వెంటనే పెరుగుతుంది. బయో ఎరువులు ఉపయోగించిన వెంటనే మొక్కలో ఎదుగుదల కనిపిస్తుంది. దీంతో రైతులు ఇవి బాగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.
బయో అంటేనే రసాయనిక అవశేషాలు లేకుండా అని అర్ధం. ఇక్కడ అదే లోపిస్తోంది. బయో వ్యాపారులు వెనుక ఉంటున్న శక్తి రాజకీయం. మంత్రుల బంధువులు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారంటే ఎంతగా ఈ నకిలీలు ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నేరుగా చైనా నుంచి రసాయనిక పదార్థాలు తెచ్చి బయోలను ఏటా రూ. 400 కోట్లు అమ్ముతున్నారు. బయో ఎరువుల తయారీ కోసం ల్యాబ్‌లు ఉండాలి. ఈ ల్యాబ్‌ల్లో మైక్రో బయాలజీ చదివిన శాస్త్రవేత్తలు ఉండాలి. అయితే ఇవేవీ తెలుగు లేకుండానే ఉత్పత్తులు మార్కెట్ లో ఉన్నాయి.
పిచ్చి కుదిరింది.. రోకలి చుట్టండి
పిచ్చి కుదిరింది.. రోకలి చుట్టండి
కిలోబియ్యం రూపాయికే సర్కారు అందిస్తుంది. కానీ అవి తీసుకోవాలంటే మీకు డెబిట్ కార్డు తప్పనిసరి. ఇంటిముందుకు వచ్చే పాలవాడు స్వైప్ మిషన్ తేకుంటే పాలు తీసుకోకండి. మరి పాలు ఎలా?.. ఏమో మన నాయకులు చెపుతారు.
పిచ్చి కుదిరింది, రోకలిని తలకు చుట్టమన్నాడట ...వెనుకటికి ఓ మేధావి. ఇప్పడు ఇండియాలో, అంతకు మించి ఆంధ్రప్రదేశ్ లో మేధావుల సంఖ్య మరీ పెరిగిపోయింది. కాకుంటే రోకలిని తలకు ఎవరు చుట్టాలో తెలీక అమాయక ప్రజలు తల్లడిల్లుతున్నారు. దేశంలో నల్ల డబ్బును అడ్డుకునేందుకు పెద్దనోట్ల రద్దు అంటూ భారత ప్రధాని ప్రకటించేశారు. దీనికి ముందుగానీ, తర్వాత గానీ కనీస కసరత్తు లేదని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. పెద్ద నోట్ల కారణంగానే నల్లడబ్బు ఉందంటే మరి రెండువేల రూపాయల నోటు ఎందుకు విడుదల చేశారో తెలీదు. ఇక సామాన్యుడు ఎవరైనా తనవద్ద ఓ పదో, పరకో వెయ్యి నోట్లు దాచుకుంటే అవి మార్చుకోవడానికి బ్యాంకుల ముందు ఓ నాలుగురోజులు క్యూలైన్లలో నిల్చొని, యాభైమంది పైగా ప్రాణాలు ధారపోసి అవి మార్చుకోవాల్సి వచ్చింది. ఈ లోపు తీసుకున్న నాలుగు వేలు కూడా బ్లాక్ చేస్తున్నారని అనుమానం వచ్చింది. ఇంకేముంది ఆ పరిధిని రూ 2500కు కుదించారు. అది నవంబర్ 24తో ముగిసింది. ఇదంతా చూడడానికి మేడిపండును మించిన అందంగా కనిపించింది. లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయన్నారు. బాగుంది. కానీ అవి నల్లడబ్బు కాదు. కేవలం సామాన్యుడు లెక్కల ప్రకారం స్వేదం చిందించి సంపాదించిన డబ్బు మాత్రమే.
ఇక్కడే రెండో కథ నడిచింది. ఆర్బీఐ నుంచి వచ్చిన నగదు సరాసరి నల్లబజారుకు తరలి పోయింది. అందుకు రిజర్వు బ్యాంకు అధికారుల దృష్టికి వచ్చిన ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. సామాన్యుడు క్యూల్లో కష్టపడితే నల్లకుబేరులు దర్జాగా ఓ 20-25 శాతం లంచంతో బ్రహ్మాండంగా నల్లడబ్బును మార్చుకున్నారు. అంటే బ్లాక్ అనేది వ్యవస్ధల ప్రక్షాళనతోనే సాధ్యం తప్ప ఇలా జరిగేది కాదని తేలిపోయింది. ఇక నోట్ల రద్దు విషయం కార్పొరేట్ శక్తులకు ముందే తెలుసని ఓ వార్త హల్ చల్ చేసింది. దీన్ని ఖండించేందుకు, అంగీకరించేందుకు ఏ ఆధారం లేదు. కాకుంటే జాతీయ బ్యాంకులు తమ ఏటీఎంలలో డబ్బులు పెట్టలేక తాళాలు వేస్తే బిగ్ బజార్ వంటి కార్పొరేట్లు రోజుకు కనీసం రూ30 కోట్ల వరకు మార్పిడికి అవకాశం ఇచ్చాయి. ఇదెలా సాధ్యం అని ప్రశ్నించకండి? నమో.. నమః.. అనుకోవడం మినహా. ఆంధ్రప్రదేశ్ కు వద్దాం..
దేశంలో... కాదు..కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప జరిగినా నేనే కారణం అని చెప్పే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు .. నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు మూడు రకాల పల్లవిని అందుకున్నారు. ఒకటి నోట్ల రద్దుకు నేనే కారణం అనేది మొదటి మాట. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతో మరో కారణమో ఈ పల్లవిని వదిలి కొత్త చరణంతోనే పాట మొదలెట్టారు. అది చిల్లర సమస్య పరిష్కరించాలని. ఇదెలాగూ తప్పనిసరిగా చేయాల్సిన అంశం. సో ఈ ఘనత ఆయన ఖాతాలో పడిపోవాలని తాపత్రయం. ఇప్పడు మరో చరణం అందుకున్నారు. మరో రెండు రోజుల్లో నగదు రహిత లావాదేవీలు చేయాలని. ప్రస్తుతం నెలకొన్న నోట్ల కొరత సమస్యను సులభంగా అధిగమించే ఏకైక మార్గం నగదు రహిత చెల్లింపులే. ఇపుడు ఇదే విషయమై ప్రభుత్వం విస్తృతం ప్రచారం చేపట్టింది. ప్రజలతో జరిపే లావాదేవీల్లో ఈ పోస్, స్వైప్ మిషన్లను వాడుతుందట. వ్యాపార, వాణిజ్య సంస్థలూ ఈ మిషన్లు వాడాలట. ఇక్కడా పక్కదేశాల ప్రస్తావన లేకుంటే ఆయన బాబు ఎలా అవుతారు. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వస్తువుల కొనుగోలుకు అక్కడి ప్రజలు ఆన్ లైన్లోనే చెల్లింపులు చేస్తుంటారట. భారతదేశంలో మాత్రం 70 శాతానికిపైగా నగదు రూపంలోనే లావాదేవీలు జరుపుతుంటారు. ఇపుడిదే ప్రస్తుతం సమస్యగా మారిందనేది ఆయన మాట. మరి ఈ విషయం తెలిసినవాడు దేశంలో 68 శాతం ప్రజలకు బ్యాంకు ఎక్కౌంట్ లే లేవనే విషయం ఎందుకు మర్చిపోయారో. ఇక అడుగడుగునా ప్రచార యావ. ఇందుకోసం మహిళ సంఘాల సభ్యులు, రేషన్ డీలర్ల సేవలను తీసుకుంటోందట. ఆన్ లైన్ చెల్లింపులపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనుంది. అలా శిక్షణ పొందిన మహిళా సంఘాల సభ్యులతో ఇంటింటి ప్రచారమూ నిర్వహించి, నగదు రహిత చెల్లింపుల వల్ల కలిగే లాభానష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుందట. రేషన్ షాపుల్లోనూ బియ్యం కోసం డెబిట్ కార్డు కావాలట. డెబిట్ కార్డు మెయిన్ టెన్ చేసేవాడు రేషన్ షాపుకు ఎందుకు వెళ్తాడో ఏలినవారికే తెలియాలి. కేవలం వస్తు సంబంధమైన కొనుగోలులోనే కాకుండా, భూములు, స్థిరాస్తులు క్రయావిక్రయాల్లోనూ నగదు రహిత చెల్లింపు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రకటన విడుదల చేసిన ఘనులు మన పాలకులు.
Sunday, 27 November 2016
క్రీస్తు వివాహం..వివాదం
క్రీస్తు వివాహం..వివాదం
ప్రపంచ మానవాళికి శాంతి, సౌభ్రాత్వాలను ప్రభోదించిన మహనీయుడు ఏసుక్రీస్తు. ఈ మహనీయుడి జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలపై తరచూ వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న అంశాలు కూడా ఇవే. అందులో ప్రధాన అంశం క్రీస్తుకు వివాహం అయిందా? ఆయన జీవితం ఎక్కడ సాగింది? ఇలా ఎన్నో సందేహాలు, వివాదాలు... జీసస్ 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో ఎక్కడా మనకు తెలియదు. పాత, క్రొత్త నిబంధనల్లో కూడా ఆ ప్రస్తావన కనిపించదు. ఆయన తన 13 వ ఏట బైబిల్ లో కనిపిస్తాడు. తరువాత తన 30 వ ఏట శిలువ వేశారు. అంతే. కేవలం 3 సంవత్సరాల అతడి జీవితం మాత్రమే తెలుసు. కేవలం ఆయన జీవితంలో ఒకటి, రెండు సందర్భాలు తెలుసు. ఒకటి పుట్టినప్పుడు. క్రీస్తు పుట్టుక అందరికి తెలుసు. రెండవది, ఆయన ఏడేళ్ల వయస్సులో పెద్ద గుడిలో జరిగే పండుగకు రావడం. ఈ రెండు సంఘటనలు మాత్రమే తెలుసు. చివరిగా ప్రవక్తగా అతడు గడిపిన మూడు సంవత్సరాలు తెలుసు. మిగిలిన జీవితం ఎక్కడ?
క్రీస్తు జీవితం గురించిన సమాచారం భారత దేశంలో చాలా ఉంది. ఆయన గురించి ఏమీ తెలియని కాలంలో ఆయన కాశ్మీర్ లో ఉన్నారు, - ఒక బౌద్ద ఆరామంలో ఆ సమాచారం ఉంది. అంతే కాదు, ఆయన అక్కడ ఉన్నట్టు జానపద కథలు ఉన్నాయి. అప్పుడు బౌద్ద భిక్షువు గా, అన్ని సంవత్సరాలు ధ్యానంలో గడిపాడు. తన 30 వ ఏట అకస్మాత్తుగా జెరూసలేము ప్రత్యక్షమయ్యాడు. తర్వాత శిలువ వేశారు. ఆయన తిరిగి లేచాడన్న కథ క్రిస్టియన్ ల దగ్గర ఉంది. ఆయన తిరిగి లేచిన తరువాత, ఎక్కడికి మాయమయ్యాడు? ఈ విషయంలో ఎవ్వరి వద్దా సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అతడు సహజ మరణాన్ని ఎప్పుడు పొందాడు?. అరబ్ ప్రపచం ఆయన్ను “ ఏసస్ – ఏసు” అని పిలిస్తే.. కాశ్మీర్ లో యూసా-అసఫ్ అని పిలిచే వారు. అతడి సమాధి మీద “యూసా అసఫ్ – ఎవరైతే చాలా దూర ప్రాంతం నుండి వచ్చి యిక్కడ జీవించాడో- అతడి సమాధి” అని ఉంది.
రష్యా యాత్రికుడు ‘నికోలస్ నటోవిచ్’ 1887 లో భారత దేశం వచ్చినప్పుడు ‘లడఖ్’ వెళ్ళాడు. అక్కడ ఆయన అనారోగ్య కారణంగా చాలా రోజులు ‘హెమిస్ గుంపా’లో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి రోజులలో ఆయన అనేక బౌద్ద రచనలను, శాస్త్రాలను చదివాడు. ఆ రచనలలో ఆయన, జీసస్ అక్కడికి రావడం గురించి అనేక విషయాలను తెలుసుకున్నాడు. అయన ఆ సాహిత్యంలో జీసస్ ను గురించి, ఆయన బోధనల గురించి అనేకసార్లు ప్రస్తావించడాన్ని గుర్తించాడు. తరువాత ఆయన లైఫ్ ఆఫ్ సెయింట్ జేసస్ అనే పుస్తకాన్ని రాశాడు. అందులో జీసస్ లడఖ్, ఇతర తూర్పు దేశాలలో గడిపిన అనేక విషయాలను ప్రస్తావించాడు. జీసస్ లడఖ్ నుండి, ఎత్తయిన పర్వతాలను దాటి కాశ్మీర్ లోని, ‘పహల్గావ్’ చేరాడని ఉంది. క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు క్రీస్తుకు వివహమైందా? ఈయన భార్య పేరు మేరీ మగ్దలీనా? అనే చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన వివాదం కాకున్నా క్రమంగా బలీయమైన సాక్ష్యాలను చూపించే ప్రయత్నం చరిత్రకారులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
2003 లో నవలాకారుడు డాన్ బ్రౌన్ తన అత్యంత వివాదాస్పద నవల ద డా వించి కోడ్ విడుదల చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ పుస్తకం క్రైస్తవంలోని అతి పెద్ద రహస్యం జీసస్ పెళ్లి గురించి చర్చించి౦ది. క్రైస్తవం చరిత్ర అంతటా ఒక వేశ్యగా చూపించిన మేరీ మాగ్దాలిన్ ను జీసస్ పెళ్ళాడాడని ఆ పుస్తకం వాదించింది. మేరీ మాగ్దాలిన్ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆ పుస్తకం లో రచయిత చెప్పారు. ఇందులో చాలా వాదనలు అవాస్తవాలుగా క్రైస్తవ పెద్దలు కొట్టివేశారు. చాలా కాలం వివాదం నడిచింది. బ్రిటిష్ గ్రంధాలయం అరల్లో దొరికిన 1500 ఏళ్ళ నాటి ఒక పాత రాతప్రతి ప్రపంచాన్ని మళ్ళీ కుదిపెయడానికి సిద్ధంగా వుంది. జీసస్ జీవితం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిపే ఆ రాత ప్రతిని అరబిక్ లిపి నుంచి అనువదించడానికి ప్రొఫెసర్ బారీ విల్సన్, రచయిత సిమ్చా జాకోబొవిచ్ చాలా ఏళ్ళు శ్రమించారు. జీసస్ క్రీస్ట్ కు పెళ్లైందని, అతని మేరీ మగ్దాలిన్ ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారని ఆ రాత ప్రతి చెప్తుంది. ఆ పుస్తకం పేరు “ది లాస్ట్ గాస్పెల్’. ఫిలిప్పు వ్రాసిన పత్రిక బైబిల్ కు సంబంధంలేని పత్రిక. మగ్ధలేని మేరి అనే అమ్మాయిని ఏసు క్రీస్తు భార్యగా చెప్పబడిన ఈ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదమైనది. ఈ పత్రిక ఏసుక్రీస్తు మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాశాడు. ఈ పత్రిక 1945 లో ఉత్తర ఈజిప్టు పట్టణమైన నాగ్ హమ్మడి లో మహమ్మద్ ఆలీ సమ్మాన్ అనే వ్యక్తికి ఇతర 11 పుస్తకాలతో సహా దొరికింది.ఎక్లేసియాస్టికల్ హిస్టరీ ఆఫ్ జాకరియాస్ రేటోర్ అనే పేరిట శుద్ది చేసిన జంతు చర్మం మీద వచ్చిన ఒక పాత పుస్తకానికి అనువాదమే ది లాస్ట్ గాస్పెల్. 1847 లో బ్రిటిష్ మ్యూజియం వారు ఈజిప్షియన్ మొనాస్టరీ నుంచి కొనడంతో ఈ పుస్తకం ఇంగ్లాండ్ కు చేరింది. చాలా మంది పండితులు దాన్ని చదివాక పెద్దగా పస లేనిదని వదిలేసారు. కానీ ది లాస్ట్ గాస్పెల్ రచయితలు మాత్రం ఆ రాత ప్రతిలో నిగూడార్ధాలు వున్నాయని ఆరేళ్ళు పరిశోధించి తెలియచేసారు. సిరియాక్ భాషలో జంతు చర్మం మీద రాసిన ఆ ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో 20 ఏళ్ళ నుంచీ వుంది.
క్రీస్తు, మగ్దలీనాల గురించి ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో రాసివున్న అత్యంత పురాతన పత్రమొకటి తాజాగా వెలుగుజూసింది. ఇందులో క్రీస్తు, మగ్దలీనాల గురించి ఉంది. చిన్న విజిటింగ్ కార్డు సైజులో ఉన్న ఈ జీర్ణ పత్రం క్రీ.శ. నాలుగో శతాబ్ధం నాటిది. హార్వర్డ్ డివినిటీ స్కూల్‌కు చెందిన డివినిటీ ప్రొఫెసర్ కరేన్ కింగ్ రోమ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఈ పత్రాన్ని ప్రదర్శించారు. దీంతో ఏసుక్రీస్తు బ్రహ్మచారి అవునా కాదా అనే అంశంపై చర్చ మరోసారి ప్రారంభమైంది. రోమ్‌లో ప్రదర్శించిన ఆ పత్రంలో ఏముందన్న అంశం ఆసక్తికరం. ఈ చిన్న పత్రంలో మొత్తం ఎనిమిది లైన్లు ఉన్నాయి. ఇందులో నాలుగో లైనులో.. "జీసస్ వారితో చెప్పాడు.. నా భార్య" అని మాత్రమే ఉంది. ఐదో వరుసలో "ఆమె నా శిష్యురాలిగా ఉండగలదు" అని చెప్పినట్టుగా ఉంది. మరికొన్ని వరుసల తర్వాత "నేను ఆమెతో కలిసి నివశిస్తున్నాను" అని అందులో ఉంది. ది లాస్ట్ గాస్పెల్ పుస్తకం చెపుతున్న ప్రకారం జీసస్ కు, మేరీ మాగ్దాలిన్ కు ఈజిప్ట్ దేశపు ఫారో పెళ్లి చేయించాడని, అతనికి ఆ వివాహం ద్వారా ఇద్దరు కొడుకులు కలిగారని ఆ పుస్తకం చెప్తుంది.
20వ శతాబ్దంలో వచ్చిన డోనోవాన్ జాయిస్ పుస్తకం జీసస్ స్క్రోల్ జీసస్ సంతానం గురించి, అతనికి మేరీ మాగ్దాలిన్ కి వున్న సంబంధం గురించి మాట్లాడిన మొదటి పుస్తకాల్లో ఒకటి. కథారిస్ట్ నమ్మకాల ప్రకారం జీసస్ క్రీస్ట్ కు మాగ్దాలిన్ కు ఏదో ఒక స్థాయిలో సంబంధం వుందని 13 వ శతాబ్దపు సిస్టీరికల్ సన్యాసి పీటర్ ఆఫ్ వాక్స్ డి సర్నే అంటారు. ఫ్రెంచ్ సోషలిస్టు రాజకీయ నాయకుడు లూయీ మార్టిన్ ‘లెస్ ఎవాంజైల్స్ సాంస్ డై’ అనే తన పుస్తకంలో ఇంకో అడుగు ముందుకు వేసి చరిత్రలో జీసస్ నాస్తికుడిగా మారి, మేరీ మాగ్దాలిన్ ను పెళ్ళాడి ఫ్రాన్స్ దక్షిణానికి వెళ్లి కొడుకును కన్నాడని రాసారు. 1977లో ప్రచురితమైన – ఆండ్రియాస్ ఫేబర్-కైసర్ రాసిన ‘జీసస్ డైడ్ ఇన్ కాశ్మీర్ : జీసస్, మోసెస్ అండ్ ది టెన్ లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయిల్’ పుస్తకంలో జీసస్ కాశ్మీర్ వచ్చారని, అక్కడ అతను కాశ్మీరీ స్త్రీని వివాహం చేసుకున్నాడని, వారికి సంతానం కూడా కలిగారని రాసాడు.
1982 లో మైకేల్ బైజేంట్, రిచర్డ్ లీ, హెన్రీ లింకన్ రాసిన ‘ది హోలీ బ్లడ్ అండ్ ది హోలీ గ్రెయిల్’ అనే పుస్తకంలో ఈ వాదనను మరింత ప్రచారం చేస్తూ – జీసస్ వంశావళి అతని కూతురు ద్వారా కొనసాగిందని, ఇప్పటికీ మేరోవింజియన్ వంశం ద్వారా ఇప్పటికీ నిలిచే ఉందనీ రాసారు. ది లాస్ట్ గాస్పెల్ లో ప్రకటనల వల్ల తెలిసేదేమంటే ఆ పత్రం కోడ్ చేయబడింది, ఓల్డ్ టెస్టమెంట్ లో జీసస్, మాగ్దాలిన్ ల పెళ్లి విషయం రహస్యంగా దాచి ఉంచారు. జోసెఫ్, అతని భార్య అసేనేత్ పాత్రలు నిజానికి జీసస్, మేరీ మాగ్దాలిన్ లవేనని, జీసస్ పిల్లలిద్దరి పేర్లూ, వారికి రోమన్ సామ్రాజ్యంలో శక్తిమంతులైన రాజకీయ నాయకులతో వున్న సంబంధాలను తెలియచేస్తానని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
చాలా మంది పండితులు కూడా ఈ వాదనలన్నీ పస లేనివని కొట్టి పారేశారు. కానీ, మేరీ మాగ్దాలిన్ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. బైబిల్ పాత్రల్లో ముఖ్యమైన మాగ్దాలిన్ చుట్టూ ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలు వున్నాయి. వీటిలో కొన్ని ఊహలను సమర్ధించే సిద్ధాంతాలు కూడా వున్నాయి. కానీ అవన్నీ ఊహాగానాలు గానే ఉండిపోయాయి. నిజమైనా కాకపోయినా, ది లాస్ట్ గాస్పెల్ మాత్రం మళ్ళీ జనం మనసుల్ని కదిలించింది.
సుప్రసిద్ధ సైంటిస్టు,రచయిత ఐజెక్ అసిమోవ్ బైబిల్ పైనా,క్రైస్తవుల పైనా విమర్శ పరంపరలు చేశాడు. బైబిల్ రివలేషన్ 22వ అధ్యాయం 7వ వచనంలో నేను త్వరలో తిరిగొస్తాను అని చెప్పి వెళ్ళిన క్రీస్తు రెండువేల సంవత్సరాలు అయినా రాలేదు. అంతటితో బైబిల్ లో కొత్త నిబంధన ముగుస్తుంది. అలాంటి బైబిల్ ను వివిధ కోణాల నుంచి చూస్తున్నారు. యూదులు కేవలం పాత నిబంధన వరకే పరిమితమౌతున్నారు. కొత్త నిబంధన వారు అంగీకరించరు. యూదులు, క్రైస్తవులు అక్కడ పోట్లాడుకుంటున్నారని చెపుతారు. అసిమోవ్ వివరణ ప్రకారం బైబిల్ పాతనిబంధన ప్రకారం కొన్ని చారిత్రక ప్రస్తావనలు, కొన్ని వివాదాస్పద తేడాలు, కొన్ని గాథలు వున్నాయి. క్రీ.పూ.8500 సంవత్సరం మొదలుకొని యీ ప్రస్తావనలు వున్నాయి. యూదుల దృష్టిలో క్రీ.పూ3761 నాడు సృష్టి ఆరంభమైంది! ఆర్చిబిషప్ ఉషర్ దృష్టిలో క్రీ.పూ.4004 నాడు సృష్టి మొదలైంది. వివిధ ప్రస్తావనల అనంతరం, క్రీ.పూ.4న జీసస్ క్రీస్తు పుడతాడు. ఆధునిక చరిత్ర దృష్ట్యా బైబిల్ ను స్వీకరించకూడదు. పురావస్తు పరిశీలన చేసి రాసిన గ్రంథం కాదని గ్రహించాలి. అలాగే నిర్థారిత తేదీలు, ఆధారాలు కూడ బైబిల్ ద్వారా లభించవు. ఏసుక్రీస్తు మగ్దలేని మరియను వివాహమాడాడని బైబిల్ వ్యతిరేక పత్రికల్లో ఒకటైన ఫిలిప్పు సువార్తలో ఉంది. దీన్ని క్రైస్తవ లోకం అంగీకరించలేదు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పిన క్రీస్తు వివాహమాడివుంటే భార్యను సమాజానికి కనీసం ఒక్క సారైనా పరిచయం చేసేవాడని, కనుక క్రీస్తు వివాహం చేసుకోలేదని వారంటారు. జీసస్ కు మేరీ మాగ్దాలిన్ తో పెళ్లి అయిందా, వారి పిల్లలు ఇలాంటి ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా వివాదాలు మాత్రం తప్పక రేకెత్తిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Saturday, 26 November 2016
మోడీ నుంచి మరో షాక్
మోడీ నుంచి మరో షాక్
నల్లధనంపై పోరులో భాగంగా పెద్ద నోట్లు రద్దుచేసిన ప్రధాని నరేంద్రమోదీ తాజాగా బినామీ ఆస్తులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈమేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. అంతకు ముందే ఇందుకు సంబంధించిన చట్ట సవరణ కూడా చేశారు. నవంబర్ 1 నుంచే అమలులోకి వచ్చిన ఈ విషయం ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ చట్టాల అమలుపై ఉన్న సందిగ్ధతే ఇందుకు కారణం. అయితే నోట్ల రద్దుతో ఈ చట్టంపైనా భయం మొదలైంది. ఇంతకూ చట్టం ఏం చెపుతోంది? .
కొత్త బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం నవంబరు 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇకపై ఇతరుల పేరుతో చేసే ఆస్తుల లావాదేవీలు చెల్లవు. ఆ ఆస్తులను ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ చట్టం కింద బినామీ ఆస్తులు కలిగివున్న వారిపై అపరాధ రుసుంతో పాటు ఏడేళ్ల కారాగారశిక్ష వరకు విధించవచ్చు.
నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతో పార్లమెంటు గత ఆగస్టులో బినామీ లావాదేవీల (నిరోధక) చట్టాన్ని ఆమోదించింది. నికార్సయిన మతపర ట్రస్టులను ఈ చట్టం నుంచి మినహాయిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అప్పుడు చెప్పారు. బినామీ లావాదేవీల (నిరోధక) చట్టం నియమ నిబంధనలన్నీ నవంబర్ 1, 2016 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు ఉన్న బినామీ లావాదేవీల (నిరోధక) చట్టం, 1988 ఇకపై బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం, 1988 గా మారుతుంది అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. బినామీదారు పేరు మీద ఉన్న బినామీ ఆస్తిని దాని నిజ సొంతదారు స్వాధీనం చేసుకోలేడు. బినామీ ఆస్తులను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండానే జప్తు చేస్తుంది. అభ్యంతరాలున్నప్పుడుగానీ, పునర్విచారణకోసంగానీ ఆశ్రయించేందుకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఇదివరకటి చట్టంలో 9 సెక్షన్లు మాత్రమే ఉండగా, సవరించిన చట్టంలో 71 సెక్షన్లు ఉన్నాయి.
ఇంతగా చెపుతున్న ఈ బినామీ అంటే ఏమిటి అనే సందేహం వస్తోందా? . ఒక వ్యక్తి ఒక ఆస్తిని తన పేరున కాకుండా తనకు సన్నిహితులైన వ్యక్తుల పేరున కొనుగోలు చేసే విధానాన్ని బినామీ వ్యవహారంగా పేర్కొంటారు. ఈ విధానంలో ఆ ఆస్తులను డబ్బు చెల్లించేవారు అనుభవిస్తుంటారు. అయితే ఆ ఆస్తి ఎవరి పేరు మీద వుందో వారికి ఎలాంటి హక్కులు వుండవు. వాస్తవానికి ప్రతి ఒక్కరు ఓ పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తే ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వానికి దొంగలెక్కలు చూపించి ఆ పన్ను ఎగవేస్తారు. ఇలా దాచిన సొమ్మును తమ బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తుంటారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాకపోగా ఆ ధనం లెక్కలోకి రాకపోవడంతో నల్లధనంగా మారిపోతుంది.
బినామీ లావాదేవీల నిరోధక చట్టం వేటికి వర్తించదు.
* భార్య, పిల్లల పేరుతో ఆస్తులు లేదా భూముల కొనుగోలుని బినామీవ్యవహారంగా పరిగణించరు. అయితే ఆదాయమార్గాలను వెల్లడించాలి.
* సోదరులు లేదా సోదరి పేరు మీద సంయుక్తంగా ఆస్తి కొనుగోలు చేయడం. దీనికి కూడా ఆదాయమార్గాలను వివరించాలి.
*ఆగస్టులో పార్లమెంటు బినామీ లావాదేవీల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఆమోదం పొందడంతో నవంబరు 1 నుంచి చట్టంగా మారింది.
* కొత్త చట్టం ప్రకారం బినామీ ఆస్తులు కలిగి ఉన్న వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ అపరాధ రుసుం విధిస్తారు.
చట్ట పరిధిలో అంశాలు..
*స్థిర, చర, బంగారం, ఫైనాన్షియల్ సెక్యూరిటీలను ఇతరుల పేరు మీద కొనుగోలు చేయడం.
*ఇతరుల పేరుమీద ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం...
* బినామీ ఆస్తుల నియంత్రణతో రేట్లు తగ్గే అవకాశం.
ఆస్తులు, బంగారం క్రయవిక్రయాలపై ఇప్పటికే దృష్టిపెట్టిన కేంద్రం స్థిరాస్తి వ్యవహారాలను పాన్‌కార్డు ఆధారంగా నిశితంగా గమనిస్తుందనీ...ఆ రంగంలోని బినామీ ఆస్తుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందనీ నిపుణులు భావిస్తున్నారు.
ఆహా ఏమి రుచి
ఆహా ఏమి రుచి
లక్కుండిన చుక్కొచ్చును,చుక్కడితే గొంతులోన చురచురమంటూ గుక్కలుగా కిక్కెక్కును. కిరికిరి మొదలౌ! 'బుడ్డి'మంతులు ఎంత తాపత్రయపడ్డా... కూసింత లక్కుంటే గానీ గొంతు తడుపుకోవడానికి గుక్కెడు చుక్క దొరకదు. లక్కు కలిసొచ్చి, అనాయాసంగా చుక్కేం ఖర్మ, ఏకంగా నిండైన 'సీసా'పద్యమే చేతికి అందివస్తే! అలాంటి అరుదైన సందర్భాన్నే 'మందు'భాగ్యమంటారు 'మందు' మతులు. 'మందు'భాగ్యం కలిగినప్పుడు మనసు మదిరానంద డోలికలలో తేలియాడటం కద్దు! అట్టి మదిరానంద తరుణాన 'బుడ్డి'మంతులందరూ కలసి తగిన 'మందో'బస్తుతో పీనాబజానా ఏర్పాటు చేయడం 'సారా'మామూలే! మొదటి పెగ్గు మధువులోని మంచుముక్కలు కరిగేలోగానే గొంతులోకి జారిపోతుంది. మనసు తేలికవుతుంది. రెండో పెగ్గు కొనసాగుతున్న స్థితిలో 'సారా'స్వత సమావేశంలో సర్వసమానత్వ స్థితి మొదలై, వాతావరణం ప్రజాస్వామికమవుతుంది. మూడోది ముగిసి, ఆపై ముందుకెళితేనే తంటా! కొందరికి కిక్కు హెచ్చి కిరికిరి మొదలవుతుంది. ప్రజాస్వామ్యం ముదిరి అరాచకవాదంగా పరిణమిస్తుంది.
దేశి మధువులందు దీటైన మధువేది?
జిలుగులీనెడు జీడి మధువుగాక
వేడి చేసెడు వేళలందున వైనుతేయ!
విరుగుడగునదియె విశ్వసింపు!
మధు ప్రియులకు ఈ పద్యం బాగా నచ్చుతుంది. ఇక గోవాతో పరిచయం ఉన్న వారికి మరింత బాగా అర్ధం అవుతుంది. ఇంత సోత్కర్ష దేనిగురించి అనే కదా మీ సందేహం. ఇంకదేని గురించి గోవా సంప్రదాయ మద్యం ఫెనీ గురించే.
రాజ్యాంగం సాక్షిగా మనది లౌకిక దేశం. అలాగని దేశ జనాభాలో అంతా లౌకికవాదులే కాదు, అలౌకికవాదులూ ఉంటారు. అలౌకికవాదుల్లోనూ చాలా శాఖోపశాఖలు ఉన్నా, వారిలో ‘తీర్థం’కరులు అగ్రగణ్యులు. ‘తీర్థం’కరుల్లో కొందరికి దేశభక్తి మెండు. స్వతంత్ర దేశంలో విదేశీ మధువులు హోదాచిహ్నంగా చలామణీ అవుతున్నా, స్వదేశీ మధువులతోనే వారు గొంతు తడుపుకుంటారు. దేశవాళీ సరుకుల్లో తాటికల్లు, ఈతకల్లు చిరకాలంగా ప్రాచుర్యం పొందాయి. చక్కెర మిల్లులు వచ్చాక గుడుంబాగా పిలుచుకునే నాటుసారా గుబాళింపులు గల్లీగల్లీకి పాకాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో విప్పసారా విశిష్టతను చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇవన్నీ విరివిగా దొరుకుతాయి. ప్రపంచంలో విరివిగా దొరికే వాటికి పెద్దగా విలువ ఉండదు. అవి మధుభాండాలైనా సరే, కళాఖండాలైనా సరే! ఎంత అరుదో అంత విలువ.
దేశవాళీ మధువుల్లో అరుదైనది, కించిత్ అపురూపమైనది జీడి మధువు. గోవాలో మాత్రమే దొరికే జీడి మధువును ‘ఫెనీ’గా పిలుచుకుంటారు. తయారీ ప్రక్రియలో విదేశీ మధువులకు ఇది ఏమాత్రం తీసిపోదు. దేశి మధువుల్లో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ పొందిన ఘనత ఫెనీకి మాత్రమే దక్కుతుంది. పసందైన విందు భోజనానికి 'వైన్ అండ్ డైన్' అని ఇంగ్లిషులో వాడుక. వైన్ లేని విందు అసలు విందే కాదనేది పాశ్చాత్యుల భావన. వారి సంస్కృతిలో వైన్‌కు అంతటి ప్రాధాన్యత ఉంది మరి. మన దేశంలోనూ సురార్చకులకు కొదవ లేకపోయినా, మిగిలిన మధువులతో పోల్చి చూస్తే వైన్ వాడుక మాత్రం చాలా పరిమితం.
మధువులన్నింటిలోనూ 'సారా'శం ఒకటే. ఫ్రాన్స్‌ను మినహాయిస్తే, చాలా పడమటి దేశాల్లో విస్కీ, వోడ్కా, బీరు వంటి పానీయాల వినియోగమే ఎక్కువ. అమెరికన్లు వినియోగించే కొవ్వు పదార్థాలతో పోలిస్తే, ఫ్రెంచి ప్రజలు ఆరగించే కొవ్వు పదార్థాలు 30 శాతం ఎక్కువ. అయినా, ఫ్రాన్స్‌తో పోలిస్తే కొవ్వు ఎక్కువ కావడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడే అమెరికన్లు 40 శాతం ఎక్కువ. అమెరికా కంటే పుష్కలంగా ద్రాక్షలు పండే ఫ్రాన్స్‌లో వైన్ వినియోగం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ వైచిత్రికే ఫ్రెంచి వైద్యుడు డాక్టర్ సెర్జే రెనాడ్ 'ఫ్రెంచ్ పారడాక్స్' అని పేరు పెట్టాడు. జంటనగరాల్లో నెలకు రూ.5 కోట్ల మేరకు వైన్ విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ గణాంకాల భోగట్టా. గోవా వెళితే ఓ సారి రుచి చూడండి.. అన్నిటికీ మించి త్వరలో మనకూ అందుబాటులోకి రానుంది ఈ ఫెనీ. ఇప్పడు వస్తున్న మద్యం తరహాలో ప్యాకింగ్ తో దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది గోవా సర్కారు.

కష్టజీవి ఇంట ఆగని మరణమృదంగం
ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ఎరువు బరువై… కూలీలు కరువై. నీరు కన్నీరై… విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, కనికరించని ప్రకృతి… రైతులను జంట కోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా… బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే… బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు. 1995 నుంచి 2013 మధ్య… అంటే 19 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏకంగా 38,470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానం మన పొరుగునే ఉన్న మహారాష్ట్రది. ఆ తర్వాతి స్థానం… ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడేళ్లుగా… కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుండగా… మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’ అని చెప్పుకొన్న కాలంలోనూ పెద్ద సంఖ్యలో రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1995-2002 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో 12,716 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2003-2010 మధ్యకాలంలో బలవన్మరణం పాలైన అన్నదాతల సంఖ్య ఏకంగా 18,404కు చేరింది. ఒకవైపు రైతుల వారసులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాలు చూసుకుంటుండగా… మరోవైపు హలం బాట పట్టిన యువ రైతులు మధ్యలోనే జీవితమనే కాడిని పారేస్తున్నారు. యువ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యమిస్తూ… అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతి, పెట్టుబడులూరాక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల అని తేల్చేస్తారు. కాదు గిట్టుబాటు ధరలు దక్కక లేదా కరెంటు సరఫరా కరువై నీటి సరఫరా లేక పంట ఎండిపోతేనో లేక పండిన పంట అమ్మితే అప్పులు తీరడం లేదనో ఇలా అనేక కారణాల వలన రైతులు తమ ఉసురు తామే తీసుకుంటున్నారని లోకం అంతా కోడై కూస్తున్నపుడు ‘మీ హయాంలో జరగలేదా?’ అని ప్రతిపక్షాలతో సవాలు చేయడం పాలకవర్గాలు చేస్తున్న ఎదురు దాడి. అందరి ఆకలి తీర్చేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పెను సంక్షోభంలో చిక్కుకున్నారు. సాగు భారమై చాలా మంది బలవన్మరణాల పాలవుతున్నారు. మరికొందరు సాగు వదిలి పొట్ట కూటి కోసం వలసపోతున్నారు. రైతుల మూలుగ పీల్చేస్తున్న సంక్షోభానికి ప్రభుత్వ విధానాలతోపాటు మనమూ కారణమే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గత పందొమ్మిది సంవత్సరాలలో భారత దేశంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నదీ రాష్ట్రాలవారీగా, సంవత్సరాల వారీగా లెక్కలు సేకరించి నివేదిక వెలువరించింది. ఇక ఏ రాజకీయ పార్టీ కూడా మా హయాంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోలేదని బొంకడానికి వీల్లేదు. అధికారికంగానే రైతులూ ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వానికి చెందిన విభాగం ఒకటి నివేదిక రూపొందించిన తర్వాత ప్రభుత్వాలు ఆత్మహత్యలకు కారణాలు వెతుక్కోవాల్సిందే. ఎన్.సి.ఆర్.బి నివేదిక ప్రకారం 1995 నుండి 2013 వరకూ 19 సంవత్సరాల కాలంలో 296438 మంది రైతులు దేశం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంస్ధ ఆత్మహత్యల సంఖ్యని రికార్డు చేయడం ప్రారంభించింది 1995 నుండే కనుక అంతకు ముందు, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుందీ తెలిసే అవకాశం లేదు. బహుశా మానవజాతి చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకున్న దౌర్భాగ్యం మరే దేశంలోనూ జరిగి ఉండదని చెప్పవచ్చు. దేశానికి అన్నం పెట్టే రైతు, దేశానికి వెన్నెముకగా రాజకీయ నాయకులు ఇష్టంగా చెప్పే కర్షకుడు, ప్రాధమిక ఉత్పత్తిదారుడైన వ్యవసాయదారుడు ఆత్మహత్య చేసుకోవడం అంటే… ఈ దేశంలో బతకడానికి తావు లేనట్లే. మహా రాష్ట్ర రైతు ఆత్మహత్యలలో అగ్ర స్ధానంలో నిలిచింది. దేశంలో సంపన్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రైతు ఆత్మహత్యలలో కూడా అంతే సంపన్నంగా ఉండడం యాదృచ్ఛికం కానే కాదు. భారత దేశంలో అలవిగాలినంతగా ధనాన్ని సంపాదించడానికీ, రైతులు లాంటి ప్రాధమిక ఉత్పత్తిదారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి నేరుగా సంబంధం ఉన్నందునే మహారాష్ట్రకు ఆ ఖ్యాతి దక్కింది. ఇంకా చెప్పాలంటే మొత్తం ఆత్మ హత్యలలో మూడింట రెండవ వంతు ఐదు రాష్ట్రాలలోనే జరిగాయి. మహా రాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాలు ఆ పేరు దక్కించుకున్నాయి. వీటిలో చత్తిస్ ఘఢ్ మినహా మిగతా నాలుగూ సంపన్న రాష్ట్రాలే కావడం గమనార్హం. అంకెలను పరిశీలిస్తే మొదటి ఎనిమిది సంవత్సరాల కంటే తర్వాతి పది సంవత్సరాల్లో ఆత్మహత్యల శాతం పెరిగింది. 1995-2002 కాలంలో 1,21,157 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2003-2013 కాలంలో 1,75,281 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటును చూస్తే ప్రతి ఏటా 15602 మంది రైతులు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. వ్యవసాయరంగం పైన ఆధారపడిన రైతుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న నేపధ్యంలో ఈ దురవస్థ ఆందోళనకర అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వర్షాధార పంటలు పండించే మెట్ట ప్రాంతాల్లో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తున్న రాష్ట్రాలు నాలుగు.. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్. దేశంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో 68% మంది ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే. మన రాష్ట్రంలో గత 19 ఏళ్లలో 38,470 మంది రైతు లు ఆత్మహత్యల పాలయ్యా రు. ప్రతి దశాబ్దంలోనూ వ్యవసాయం పై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 1991 జనాభా లెక్కలతో పోలిస్తే 2001 జనాభా లెక్కలలో 7 మిలియన్ల మంది రైతులు వ్యవసాయం నుండి పక్కకు తప్పుకున్నారని తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. 8.6 మిలియన్ల మంది వ్యవసాయం నుంచి తొలగిపోయారు. రైతుల స్థితి కూడా మారిపోయింది. చాలామంది వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. అధికారిక లెక్కల ప్రకారమే 37 మిలియన్ల మంది వ్యవసాయ కూలీలుగా మారారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పై ఆధారపడిన వారి శాతం కూడా క్షీణిస్తోంది. 2001 లెక్కలతో పోల్చితే 2011 నాటికి 3.4 శాతం తగ్గిపోయారు. రైతు చుట్టూ అనేక అనుబంధ పనులు చేసుకునే వారు ఉంటారన్నది గమనిస్తే మొత్తంగా వ్యవసాయ రంగం నుండి తప్పుకున్నవారి సంఖ్య కనిపంచే లెక్కలకు అనేక రెట్లు ఉంటుంది. 2011 జనాభా గణన ప్రకారం.. మన రాష్ట్రంలో రోజుకు 375 మంది రైతులు వ్యవసాయం మానేస్తున్నారు. 2001-2011 మధ్య పదేళ్లలో 13,68,012 మంది వ్యవసాయం వదిలేసి వేరే పనులు చేసుకుంటున్నారు. అయినా, సంక్షోభ తీవ్రతను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి సంబంధించి 2004 జూన్1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.421ను జారీచేసింది. బాధిత కుటుంబాలకు రూ. లక్ష పరిహారంతోపాటు రుణబకాయిల చెల్లింపులకు మరో రూ.50 వేలు కూడా ఇచ్చింది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే, బాధిత కుటుం బం పరిహారానికి అర్హమైనదా కాదా అని నిర్ణయించే ప్రక్రియలో ‘న్యాయమైన రైతు ఆత్మ హత్యలు’ అనే కొత్త వర్గీ కరణను ఈ రెండు రాష్ట్రా ల్లోనూ ప్రవేశపెట్టారు. దీని వల్ల చాలా బాధిత కుటుంబాలకు సహాయం అందకుండా పోతోంది. గడచిన దశాబ్దకాలంలో రైతుల నుంచి లక్షల ఎకరాలను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమల పేరుతో, సెజ్ ల పేరుతో ధనికులకు అప్పజెప్పింది. ఇక పట్టణాభివృద్ధి, ఇతర అభివృద్ధిల పేరుతో కూడా లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుని రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అతి తక్కువ ధరలకు కట్టబెట్టింది. ఈ పర్యవసానం రైతుల సంఖ్య మరింతగా పడిపోయి, సేద్యం భూములు మరింతగా తగ్గిపోయాయి. భారత దేశంలో వ్యవసాయ సంక్షోభం పెరుగుతున్న కొద్దీ రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్ధాయిలో పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ చెపుతున్న లెక్కలు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడం అధికారం చలాయించే ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. అది యుపీఏ సర్కారైనా, ఎన్డీఏ సర్కారైనా.దేశం ఆర్ధిక వృద్ధిలో అతివేగంగా దూసుకు పోతుంటే ఈ చిన్న చిన్న విషయాలు లెక్కలోకి రాకూడదన్నది పాలకుల అవగాహన. కాని ఉత్పత్తి రంగంలో ఉన్న దాదాపు అన్ని రంగాలకూ వ్యవసాయ ఉత్పత్తులే మూలాధారం అన్నది గమనిస్తే రైతుల పట్ల ఎంతటి చిన్న చూపు ప్రభుత్వం చూపుతున్నదో, ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నదో అర్ధం అవుతుంది. వ్యవసాయ రంగం ఇంతగా దెబ్బతినడానికి చాలా కారణాలు కనిపిస్తాయి. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. నీటి వసతి అంతంత మాత్రంగా ఉంది. గిట్టుబాటు ధరలు లేవు. పెట్టిన కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు. రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించేలా వారిని చైతన్యపర్చడం లేదు. చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు. అన్నింటికీ మించి వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు. వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.ఇలాంటి కారణాలను విశ్లేషిస్తే మరెన్నో సమస్యలు కనిపిస్తాయి. రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి పాలకుల్లో చిత్తశుద్ధి కానరాదు. కమిటీలు వేయడం, ఆ కమిటీలు ఇచ్చిన సిఫార్సులను చెత్తబుట్టలో వేయడం సర్వసాధారణం గా మారింది. జయతీ ఘోష్ కమిటీవ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి ఎన్నో సిఫార్సులు చేసినా వాటిని పట్టించుకోలేదు. భారతదేశంలో మొత్తం శ్రామిక శక్తిలో గతంలో 64శాతం వ్యవసాయ మీదనే ఆధారపడేవారు. ఇప్పుడది 55శాతం లోపుకు వచ్చింది. అయినా గ్రామాల్లో నివసించే వారిలో నాల్గింట మూడో వంతు మందికి వ్యవసాయమే ఆధారం. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశజనాభాలో 70 శాతం వ్యవసాయరంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. అప్పటి జాతీయ ఆదాయంలో 55 శాతం వాటా వ్యవసాయరంగం నుంచి ఉంది. వ్యవసాయ అభివృద్ధిరేటు పెరుగుతుందని అనుకున్నా అదే దామాషాలో రైతుల ఆదాయాలు పెరగలేదు. ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణమైన గిరాకీ ఉంటేనే వ్యవసాయోత్పత్తులకు వాస్తవ ధరలు నిలకడగా ఉంటాయి. వ్యవసాయం ద్వారా లభించే ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడంతోపాటు, వైవిద్య మైన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయాలి. దేశంలో మార్కెటింగ్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. దానిని పటిష్టపరచాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తారంగా ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి సమృద్ధిగా నీరు, సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక చేయూత అందించాలి. వ్యవసాయరంగానికి వాటర్‌మేనేజ్‌మెంట్ పటిష్టంగా అమలు చేయాలి. వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిం చాలి. వారికి అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలి. అవసరమైన చోట చెక్ డ్యాంలను నిర్మించాలి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం వారికి అండగా నిలవాలి. వ్యవసాయరంగంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విప్ల వాత్మకమైన మార్పులు తీసుకురావాలి. వ్యవసాయ, సాగునీటి రంగాల అభివృద్ధి కోసం అధికనిధులను వెచ్చించాలి. ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలురైతులకు సక్రమంగా అందేలా చూడాలి. భూములను అవసరమైన ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి చిన్న రైతులకు చేయూతనివ్వాలి. కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసి రైతుల పంట మార్కెట్‌కు చేరేదాకా రక్షణ ఇవ్వాలి. రైతులకు కల్తీలేని విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కౌలురైతులకు పంటరుణాలు అందించే ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల్లో బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అవినీతి, అక్రమం, అనాలోచిత లైసెన్సు విధానం, పర్మిట్, కోటా విధానాలు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. పంట పొలాల్లో మరణ మృదంగం ఇప్పటికీ మోగుతూనే ఉంది. మనందరికీ అన్నవస్త్రాలు అందించడానికి చెమటోడ్చు తున్న రైతులు అపసవ్యమైన ప్రభుత్వ విధానాల కారణంగా ఆత్మహత్యల పాలవుతుండడం జాతికే అవమానం. తప్పుడు వ్యవసాయ పద్ధతులను, విధానాలను బలపరచడం, ప్రోత్సహించడం వంటి కారణాలే కాదు వాటి నిరోధానికి సమష్టి కృషి అవసరం.
Subscribe to:
Posts (Atom)