Wednesday 30 November 2016

ఎదుటి వారికి చెప్పేటందుకే

పార‌ద‌ర్శ‌క‌త ... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిత్యం ప‌ఠించే మంత్రం. అంటే అస‌లు ర‌హ‌స్యాలు లేని పాల‌న అందించ‌డ‌మే త‌న తొలి ప్రాధాన్యం అని ప‌దే ప‌దే చెపుతుంటారు. వాస్త‌వంగా ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లోనూ చూపితే అంత‌క‌న్నా గొప్ప‌పాల‌న మ‌రేం ఉంటుంది. ఎంతైనా చంద్ర‌బాబు నాయుడు క‌దా.. అందుకే వినేవాడు ఏదో అయితే.. చెప్పేవాడు చంద్ర‌బాబు నాయుడు అని తెలుగునాట నానుడి స్థిర‌ప‌డి పోయింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీ స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన జీవోలు 52,499. గ‌ణాంకాల ప‌రంగా చాలా గొప్ప‌గా ఉన్నా వీటిలో ర‌హ‌స్య పాల‌న‌కు సంబంధించిన జీవోలు అధికంగా  ఉన్నాయి. పారదర్శకంగా ఉండాల్సిన సర్కారు ఉత్తర్వులు 'రహస్య' జాబితాలో చేరి పోతున్నాయి. ప్రభుత్వ సమాచారం, జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో జీవోలు పెట్టాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జారీ చేశామంటున్న జీవోల పక్కన 'కాన్ఫిడెన్షియల్‌' అని కనబడుతుంది. ఫైల్‌పై క్లిక్‌ చేస్తే తెల్లగా ఉంటుంది తప్ప వివరాలుండవు. జీవో నెంబర్‌, జారీ చేసిన తేదీ మాత్రం ఉంటుంది. పారదర్శకతకు మారు పేరుగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో తనకు సాటి రాగలవారెవరూ లేరని తరుచు ప్రకటించే చంద్రబాబు సర్కారులోనే 'కాన్ఫిడెన్షియల్‌' జీవోలు పెద్ద సంఖ్యలో వెలువడుతున్నాయి. గవర్నమెంట్‌ ఆర్డర్ల దాపరికంపై అనుమానాలు రేకేత్తు తున్నాయి. చాటు మాటున ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేందుకే పారదర్శకతకు పాతరేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం సర్కారు ఎపిలో అధికారంలోకొచ్చిన 2014 జూన్‌ 2 నుండి 2016 నవంబర్ వ‌ర‌కు మొత్తం  52,499 జీవోలు జారీ కాగా వాటిలో దాదాపు 1500 కాన్ఫిడెన్షియల్‌. పాలనలో వందల సంఖ్యలో 'రహస్య' జీవోలొచ్చాయి. సచివాలయంలో జీవోలు వెలువరిస్తున్న మొత్తం ప్రభుత్వ విభాగాలు 39. అందులో 14 శాఖల నుంచి కాన్ఫిడెన్షియల్‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యధిక రహస్య జీవోలిస్తున్నది మాత్రం సాధారణ పరిపాలన శాఖ.  'రహస్య' జీవోలివ్వడంలో మొదటి స్థానంలో ఉన్న జిఎడి స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే ఉంటుంది. చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న విభాగం నుంచే వంద‌ల సంఖ్య‌లో కాన్షిడెన్షియల్‌ జీవోలు వచ్చాయి. జిఎడి తర్వాత రెండో స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. హోం, ఆర్థిక, వ్యవసాయ, పంచాయితీరాజ్‌ శాఖలు సైతం 'రహస్య' ఆర్డర్లు ఇచ్చాయి. రాష్ట్రంలో పాలనకు గుండెకాయ ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులను మూడు రకాలుగా విడుదల చేస్తోంది. జీవోఎంఎస్ (గవర్నమెంట్ ఆర్డర్ మ్యాన్యుస్క్రిప్ట్), జీవో ఆర్.టి (గవర్నమెంట్ ఆర్డర్ రోటీన్), జీవోపీ (గవర్నమెంట్ ఆర్డర్ ప్రింట్) ద్వారా విడుదల చేస్తుంది. అయితే ఎక్కువ శాతం జీవో ఆర్.టి., జీవోఎం.ఎస్ ద్వారానే పాలన సాగుతోంది. జీవోఎంఎస్ ప్రకారం మొత్తం 6922 జీవోలు విడుదలయ్యాయి. జీవో ఆర్. టి. ప్రకారం 44213 జీవోలు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రెవిన్యూ శాఖ కీలక ఆదాయవనరు. రెవిన్యూ శాఖలో జీవోఎంఎస్ ప్రకారం 1111, జీవోఆర్టీ ప్రకారం 2889 జీవోలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబునాయుడ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేతకార్మికుల రుణమాఫీ, రూ. 200 పింఛన్ ను రూ. 1000, రూ. 1500కు పెంచారు. ఉద్యోగాల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిపైనా, బెల్టు షాపుల రద్దుపైనా చేశారు. వీటన్నింటికీ ఆయా శాఖ ద్వారా జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. దుర‌దృష్టం ఏమిటంటే ఏ ఒక్క‌టీ సంపూర్ణంగా అమలు కాలేదు.  

No comments:

Post a Comment