Wednesday, 30 November 2016

నిజంగా బ్లాక్ మ‌నీపై యుద్ధ‌మా?

                         ప్రభుత్వం ఎన్నో అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తోంది. భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ‌పై దాని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. పూలవ‌నంలో దున్న‌పోతు సృష్టిస్తోన్న విధ్వంసాన్ని అది గుర్తుకు తెస్తోంది. భార‌త ప్ర‌భుత్వం చెపుతున్న ఆర్ధిక వాదన‌లు హేతుబ‌ద్ద అలల తాకిడికి కొట్టుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. పెద్ద నోట్ల రద్దు 'నల్లధనం'పై తీసుకున్న చర్య అని ప్రభుత్వ ప్రతినిధులు చెపుతున్నా మాట‌. 'నల్లధనం' అనే మాట ఒక అపప్రయోగం. అది ఒక 'పోగుపడిన ద్రవ్యరాశి' కాదు. అది ఒక 'ప్రవాహం'. అంటే అది పరుపుల కింద దాచిన నోట్ల కట్ట్లల్లా కుప్పలుగా కాకుండా కొన్నిసార్లు చట్ట విరుద్ధంగా, మరికొన్నిసార్లు చట్ట ప్రకారం చేసే కార్యకలాపాలుగా ఉంటాయి. పన్నులు చెల్లించకుండా ఉండటానికి అవి అప్రకటిత కార్యకలాపాలుగా మారతాయి. ఈ కార్యకలాపాలు ఇతర కార్యకలాపాల త‌ర‌హాలోనే డబ్బుతోనే న‌డుస్తాయి.  ప్రధానంగా డబ్బు రూపంలో ఇలాంటి కార్య కలాపాల ప్రవాహం కొనసాగటానికి కట్టలుగా ఉండే డబ్బు అవసర మౌతుంది. అయితే ఈ డబ్బు కట్టలలోని కొంత భాగాన్ని నిర్వీర్యం చేయటం వల్ల ఈ కార్యకలాపాలు లాభసాటిగా ఉన్నంత కాలం వీటిని ఆపటం సాధ్యంకాదు. 
నోట్ల రద్దుతో బ్లాక్ మార్కెట్ లోని రూ.3.5 లక్షల కోట్లను నిర్వీర్యం చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. 'నల్ల ఆర్థిక వ్యవస్థ'లో ఎక్కువలో ఎక్కువగా రూ.3.5 లక్షల కోట్లే నిర్వీర్యమౌతాయని నోట్ల రద్దును సమర్థించిన రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కూడా చెప్పారు. అయితే ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం 'నల్ల ఆర్థిక వ్యవస్థ' పరిమాణం 'మొత్తం ఆర్థిక వ్యవస్థ'లో నాల్గవ వంతు ఉంటుంది. అంటే అది స్థూలంగా రూ.35 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇతరులు ఈ భాగం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడు 'నల్ల ఆర్థిక వ్యవస్థ'లో లాభాల శాతం తక్కువలో తక్కువగా మొత్తం ఆదాయంలో సగం ఉంటుంది. అంటే రూ.17.5 లక్షల కోట్లుగా ఉంటుంది. నిర్వీర్యం అయ్యే మొత్తం కరెన్సీ పరిమాణం 'నల్ల ఆర్థిక వ్యవస్థ' లాభాలలో 20 శాతం కంటే ఎక్కువ ఉండదు. దీనితో వచ్చే లాభాన్ని తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడితే ఈ ఆర్థిక వ్యవస్థ లాభం రేటు కేవలం 25 నుంచి 20 శాతానికి పడిపోతుంది ఇదికూడా తక్కువలో తక్కువగా అంచనా వేసినప్పుడు. ఇలాంటి నామమాత్రపు తగ్గుదల 'నల్ల ఆర్థిక వ్యవస్థ'కు శరాఘాతం అవుతుందని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే అంత తక్కువగా డబ్బు నిర్వీర్యం అవటం ఈ రంగం లాభాలతో పోల్చినప్పుడు చాలా చిన్న విషయం. అది 'నల్ల కార్యకలాపాలను' నిరుత్సాహ పరచదు. అయినప్పటికీ అంతకు ముందులాగా ఈ కార్యకలాపాలను కొనసాగించటానికి డబ్బు అవసరమౌతుంది. కాబట్టి ఈ డబ్బు అందుబాటులో లేకపోవటంతో బ్లాక్ మ‌నీ కార్యకలాపాలకు అంతరాయం కలుగదా? ఇక్క‌డే అసలు సమస్య ఉంది. 
'నల్ల కార్యకలాపాలు' లాభసాటిగా ఉన్నంత కాలం, నోట్ల రద్దుతో డబ్బు అందుబాటులో లేకపోయినా, ఈ కార్యకలాపాలు కొనసాగటానికి తాజాగా డబ్బు అవసరమౌతుంది. ఈ విధంగా చూస్తే బ్లాక్ మార్కెట్ మరింత డబ్బును డిమాండ్‌ చేస్తుంది. ఇంత‌మేర‌కు డబ్బు సరఫరాను పెంచకపోతే వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు అలా పెరగటంవల్ల వైట్ రూపంలో ఉన్న డ‌బ్బు బ్లాక్ లోకి బదిలీ అవుతుంది. ఇలా జరగటం వల్ల డబ్బుపై ఆధారపడే అసంఘ‌టిత రంగం పెరిగిన వడ్డీ రేట్లతో సతమతమౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే నోట్ల రద్దుతో 'నల్ల ఆర్థిక వ్యవస్థ'పై దాడి జరగకపోవటమే కాక వాస్తవంలో అది 'మొత్తం ఆర్థిక వ్యవస్థ'లోని అసంఘ‌టిత రంగం మీద దాడిగా మారుతుంది. ఇలా జరగటానికి గల కారణం వ్యవస్థలోని అంతర్గత తర్కంలో ఉన్నది. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోలేదని చెప్పటమంటే చాలా రాయితీ ఇచ్చినట్టవుతుంది. బాగా లాభసాటిగా ఉన్న కార్యకలాపాలకు నిర్వహణ పెట్టుబడితో సహా ఇతర అవసరాలకు తక్కువ లాభసాటిగా ఉన్న కార్యకలాపాల నుంచి వనరులను లాక్కోవటం జరుగుతుంది. చిన్న ఉత్పత్తిదారులు, చిన్నతరహా వ్యాపార రంగం గల లేక 'సువ్యవస్థితంకాని' రంగం గల భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలో ఇది జరుగుతుంది. మార్క్స్‌కు ముందరి సంప్రదాయ ఆర్థికవేత్తలైన ఆడమ్‌ స్మిత్‌, డేవిడ్‌ రికార్డోలు కూడా తక్కువ లాభసాటియైన కార్యకలాపాల నుంచి ఎక్కువ లాభసాటియైన కార్యకలాపాలకు పెట్టుబడి ప్రవహిస్తుందని చెప్పారు. కొంత భాగం డబ్బు రూపంలో ఉండటంతో సహా ద్రవ్య పెట్టుబడి విషయంలో కూడా ఇదే జరుగుతుందనేది నిజం. అయితే భారత రిజర్వ్‌ బ్యాంక్‌ దీన్ని జరగనివ్వదనుకోండి. నోట్ల రద్దు వల్ల 'నల్ల ఆర్థికవ్యవస్థ'లో 'నష్టపోయిన' దాన్ని భర్తీచేయడానికి రిజర్వ్‌ బ్యాంకు రంగంలోకి దిగి డబ్బు సరఫరాను పెంచే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితిలో 'నల్ల ఆర్థికవ్యవస్థ' తాత్కాలికంగా కూడా ఎక్కువ వడ్డీ చెల్లించకుండా తన కార్యకలాపాలకు కావలసిన డబ్బును సమకూర్చుకుంటుంది. అలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే చిన్న ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా చూడగలిగే అవకాశం ఉండేది.
'నల్ల ఆర్థిక వ్యవస్థ'కు వ్యతిరేకంగా పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల జరిగేదేమీ ఉండదని అర్థమవుతుంది. 'నల్ల కార్యకలాపాలు' లాభసాటిగా ఉన్నంత వరకు అవి కొనసాగుతూనే ఉంటాయి. అయితే మొత్తం ఆర్థికవ్యవస్థకు పరస్పర సంబంధంలో ఉండే స్వభావం ఉండటం చేత, 'తెల్ల', 'నల్ల' ఆర్థిక వ్యవస్థలు జెమిలిగా ఉండటంచేత 'నల్ల కార్యకలాపాల'పై తీసుకునే నోట్ల రద్దు వంటి చర్యలు వాటి ఆకర్షణను రూపుమాపకపోతే అవి 'తెల్ల ఆర్థికవ్యవస్థ'లోని బలహీన విభాగమైన 'అసంఘటిత రంగాన్ని' దెబ్బతీస్తాయి. 'తెల్ల' ఆర్థికవ్యవస్థ ఉత్పత్తిలో 45 శాతం, ఉద్యోగ కల్పనలో దాదాపు 80 శాతం వాటాను ఈ రంగం కలిగివుంది. అందుకే ఇలాంటి చర్యలు ఎదుటివారిని వెక్కిరించటానికి తన ముక్కునే తాను కోసుకున్న చందంగా ఉంటాయి. నేను వాదిస్తున్న దానికి వ్యతిరేకంగా ఇలా చెప్పవచ్చు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన 'నష్టాన్ని' పూడ్చుకోవటానికి 'నల్ల ఆర్థికవ్యవస్థ' తాజాగా డబ్బు సమకూర్చు కోవటానికి అప్పులు చేయవలసి వస్తుంది. వాటిపై వడ్డీ భారం కూడా పడుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దుతో ఒకే ఒక్కసారి డబ్బు అందకుండా చేస్తే ఈ ఆర్థిక వ్యవస్థ అంతకుముందులాగా పనిచేయటం కొనసాగినప్పటికీ 'నల్ల ఆర్థిక వ్యవస్థ' అదనంగా వడ్డీ చెల్లించవలసి వస్తుంది. అయితే మనం చూసినట్టుగా ఈ ఒకే ఒక్కసారి చేసే నష్టం లాభదాయకతతో పోల్చినప్పుడు నామమాత్రమైనప్పుడు వడ్డీ చెల్లించటమనే భారం అంతకంటే నామమాత్రమౌతుంది. నిజానికి అది పట్టించుకోనవసరం లేనంత నామమాత్రంగా ఉంటుంది.
ఇదంతా చెప్పటమంటే 'నల్లధనం' ప్రాధాన్యతను తగ్గించి చూపటం కాదు. 'నల్లధనం'పై పోరాడటానికి పెద్ద నోట్లను రద్దు చేయటమనే ఆయుధం సరైంది కాదని చెప్పటమే ఈ వాదన ఉద్దేశం. అయితే ఇక్కడ రెండు సమస్యలను వేరువేరుగా చూడాలి. భారత ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య 'నల్లధనం' అని ప్రభుత్వం, రామ్‌దేవ్‌ బాబాలాంటి 'కుహనా అర్థశాస్త్ర నిపుణులు' చెప్పేది పూర్తిగా అర్థ రహితం అనేది మొదటిది. ప్రజల జీవితాలు దారిద్య్రంలో మునిగితేలుతుండటానికి పెట్టుబడిదారీ వ్యవస్థ కారణం కాదని, 'నల్లధనం' కూడబెట్టటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల మూలంగానే ఇది జరుగుతోందని చెప్పటం వారి ఉద్దేశం. రెండు కారణాల చేత ఈ అభిప్రాయం తప్పు. 'తెల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ', 'నల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ'ల మధ్య గల తేడా చాలా స్వల్పమనేది మొదటి కారణం. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటేనే లాభాల కోసం ప్రాకులాట. ఏ కార్యకలాపాలలోనైతే లాభాలు గడించవచ్చో ఆ కార్యకలాపాలను పెట్టుబడిదారులు చేపడతారు. 
ఒకవేళ అలాంటి కార్య కలాపాలు చట్టవిరుద్ధమైనవైతే అవి 'నల్ల కార్యకలాపాలు'గా ఉంటాయి. అయినప్పటికీ వాటిని చేపట్టటంతో ఏర్పడే ప్రమాదం కంటే అవి లాభసాటిగా ఉన్నంత కాలం వాటిని కొనసాగించటం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో కొన్ని కార్య కలాపాలకు పెట్టినపేరే 'నల్ల ఆర్థిక వ్యవస్థ'. ప్రపంచంలో 'నల్ల ఆర్థిక వ్యవస్థ'లేని పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. ఉండజాలదు. ఉదాహరణకు అమెరికాలో మాదక ద్రవ్యాల అమ్మకం ఒక ప్రధాన సమస్య(నిజమే సోషలిజంలో కూడా 'నల్ల ఆర్థిక వ్యవస్థ' తక్షణమే కనుమరుగవదు. అయితే తాను ఆవిర్భవించిన పెట్టుబడిదారీ వ్యవస్థ అనే మాయను వదిలించుకోవటానికి సోషలిజానికి కూడా చాలా కాలం పడుతుంది. కానీ లాభాపేక్ష ప్రాతిపదికన సోషలిస్టు వ్యవస్థ పనిచేయదు గనుక అనతికాలంలో దానికి సంక్రమించిన పెట్టుబడిదారీ వారసత్వం అంతరిస్తుంది).
దేశంలో 'నల్ల ఆర్థిక వ్యవస్థ' అనేదే లేదని ఒకవేళ మనం అనుకున్నా మార్క్స్‌ చెప్పిన ఒక ధృవం వద్ద సంపదను, మరో ధృవం వద్ద దారిద్య్రాన్ని ఉత్పత్తిచేసే పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్లీనంగా ఉండే ధోరణులు పనిచేస్తాయనేది రెండవ కారణం(ఆయన విశ్లేషణలో 'నల్ల ఆర్థిక వ్యవస్థ' ప్రస్తావన లేదు). నిజానికి ఈ నయా ఉదారవాద శకంలో అవి కళ్ళ ముందే పనిచేయటాన్ని మనం చూస్తున్నాము. 'నల్ల ఆర్థిక వ్యవస్థ' ప్రస్తావన లేకుండానే భారతదేశంలో ఈ ప్రక్రియ జరుగుతున్న తీరు గురించి రాసిన రాతలతో వేలకు వేల పేజీలు నిండాయి. దీన్ని గురించి మరింతగా శ్రమపడనవసరం లేదు. అయితే మనం ఇక్కడ వివరించే రెండవ సమస్య ఈ వర్తమాన వ్యవస్థలో కూడా 'నల్లధనం'పై పోరాడే పద్ధతికి సంబంధించి ఉంటుంది. నోట్ల రద్దు పద్ధతి 'నల్లధనం'పై పోరాటంగా ఉండటానికి బదులు చిన్న ఉత్పత్తిదారులను, చిరు వ్యాపారులను నాశనం చేసే అస్త్రంగా మారుతుంది. ఆవిధంగా అది 'ఆదిమ మూలధన సంచయం' ప్రక్రియను ముందుకు తీసుకు పోవటమవుతుంది.
'నల్లధనం'పై పోరాడటానికి తక్షణం చేయవలసిందేమంటే చట్ట ఉల్లంఘనలను నిజాయితీగా, లోతుగా విచారించి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఆ విధంగా 'నల్ల కార్యకలాపాల'ను ఆకర్షణీయంగా లేకుండా చేయాలి. అలా చేయకుండా ప్రజల మధ్యలో కొందరు నేరగాళ్ళు ఉన్నారనే పేరుతో నిజాయితీపరులకు ముఖ్యంగా పేదలకు ఇబ్బందులు కలిగించే చర్యలను చేపట్టి వారి జీవితాలను మరింత దుర్భరంగా చేయటమంటే ప్రభుత్వం హేతువును విస్మరించటమే అవుతుంది. ఇది యావద్దేశాన్నీ నివ్వెర పరిచే విషయం
(ప్ర‌ముఖ మార్క్సిస్ట్ ఆర్ధిక వేత్త ప్రభాత్‌ పట్నాయక్ నోట్ల ర‌ద్దు పై విశ్లేష‌ణ ఇది ) 

No comments:

Post a Comment