Tuesday 17 January 2017

ఢిల్లీ భూముల పందేరం



కలితో ఉన్న‌వాడికి తిండి పెట్టాలంటే ఎన్నో ఆంక్ష‌లు. ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలంటే ఎన్నో అడ్డుగోడ‌లు. గ‌ద్దెనెక్కిన పెద్ద‌ల‌కు క‌నీసం పేద‌వాడి ప‌ట్ల క‌నిక‌రం కూడా కాన‌రాదు. అదే విదేశీ కంపెనీలకు, కార్పొరేట్లకు, ప్ర‌జాధ‌నంతో తెగ‌బ‌లిసిన వారికి, సొంత మనుషులకు మాత్రం భూములు అప్పనంగా అందిస్తారు. అవ‌స‌రం అయితే చట్టాలను సైతం తుంగలో తొక్కుతారు. దుర‌దృష్టం ఏంటంటే వీరే అవినీతి గురించి, పాల‌న‌లో స్వ‌చ్ఛ‌త గురించి గంట‌ల‌కు గంట‌లు ఉప‌న్యాసాలు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విధానాల్లో డాక్ట‌రేట్ పొందింది. కాక‌మ్మ క‌బుర్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ అనుస‌రించిన ప‌ద్ద‌తుల‌నే కొన‌సాగిస్తోంది.

హిందూత్వ సంస్ధలకు, వ్యక్తులకు ఢిల్లీ లోని విలువైన భూములు పందేరం పెడుతోంది మోదీ స‌ర్కారు. వాజ్ పేయి హయాంలోని ఎన్టీఏ ప్రభుత్వం కూడా ఇదే ప‌ద్ద‌తులు అనుస‌రించింది. మోడీ స‌ర్కారు కూడా సేమ్ టు సేమ్ అవే ప‌ద్ద‌తులు, అదే త‌ర‌హా అవినీతిని కొనసాగిస్తోంది. అవినీతి, నల్ల ధనంలపై పోరాటం అని చెబుతున్న క‌బుర్లు ఆచ‌ర‌ణ‌లో క‌నిపించ‌డంలేదు. భూముల పందేరం ద్వారా అవినీతికి, నల్ల ఆస్తులు కూడబెట్టేందుకు మోడీ ప్రభుత్వం సహకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్టే స్వయంగా ఈ నిర్వాకానికి పూనుకోవడం ఇందుకు నిద‌ర్శ‌నం. వాజ్ పేయి హయాంలో వివిధ హిందుత్వ సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లోని ప్రధాన భూములను కట్టబెట్టింది. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన యుపీఏ ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. మోడీ ప్రభుత్వ కేబినెట్ రద్దు చేసిన కేటాయింపులను పునరుద్ధరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

హిందుత్వ భావాలను, సనాతన హిందూ ధర్మాలను ప్రచారం చేసే 26 మితవాద సంస్ధలకు భూ కేటాయింపులు పునరుద్ధరిస్తూ మోడీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ద ఎకనమిక్ టైమ్స్ పత్రిక తెలిపింది. వాజ్ పేయి ప్రభుత్వం హిందుత్వ, సనాతన సంస్ధలకు మొత్తం 225 చోట్ల భూములు కేటాయించింది. ఇవన్నీ నగరం లోని ప్రధాన సెంటర్లలో ఉన్నవే. రియల్ ఎస్టేట్ భాషలో చెప్పాలంటే ప్రైమ్ ల్యాండ్స్. ఈ కేటాయింపులపైన విచారణ చేసేందుకు యుపీఏ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. వాటిలో 125 కేటాయింపులు ప్రభుత్వ, రాజకీయ ప్రచారంలో నిమగ్నం అయి ఉన్న సంస్ధలు. అందువల్ల కమిటీ వాటి జోలికి వెళ్లలేకపోయింది. మిగిలిన 100 కేటాయింపులు రాజకీయ ప్రయోజనాల నిమిత్తం జరిపిన కేటాయింపులుగా గుర్తించి వాటిలో 32 కేటాయింపుల్ని రద్దు చేసింది.            

ఈ 32 కేటాయింపుల రద్దు జాబితా ఆమోదం కోసం సంవ‌త్స‌రాల‌పాటు పట్టణాభివృద్ధి శాఖ, అటార్నీ జనరల్ కార్యాలయంల మధ్య చక్కర్లు కొట్టింది. చివరకు 29 కేటాయింపులు పున‌రుద్ద‌రించ‌లేదు. ఈ కేటాయింపులు పొందిన 26  సంస్ధలు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 3 సంస్ధలు ప్లాట్లు వెనక్కి ఇచ్చేసాయి. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ కేటాయింపుల పైన మరో ద్వి సభ్య క‌మిటీని వేసింది. గ‌త‌ప్రభుత్వ సిఫారసులను ఈ కమిటీ వెంటనే రద్దు చేసింది. స్తంభింపజేసిన కేటాయింపులను అర్జంటుగా పునరుద్ధరించింది. మూడు సంస్ధలు కోర్టుకు వెళ్లకుండా తమకు కేటాయించిన ప్లాట్లను వెనక్కి ఇచ్చాయి గదా, వాటిని కూడా తిరిగి సంస్ధలకు ఇచ్చేయాలని బీజేపీ కమిటీ సిఫారసు చేసింది.

ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకారం ఈ సంస్ధల ప్లాట్లు అన్నీ దీన్ దయాళ్ మార్గ్ రోడ్ లోనే ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకున్న ఈ సంస్ధలు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ తో గానీ, బీజేపీ తో గానీ, ఏబీవీపీ కి గానీ చెందినవే. మిగిలినవి హిందూ ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేసేవి. నివసించేందుకు కాసింత జాగా లేని పేదలకు ఇదే తరహాలో భూములు ఇవ్వాలంటే ఇదే ప్రభుత్వాలకు సవా లక్షా చట్టాలు అడ్డం వస్తాయి. పేదల భూములు, నివాసాలు లాక్కోవడానికి కూడా ఈ చట్టాలు ప్రభుత్వాలకు అక్కరకు వస్తాయి. భూములు లాక్కునే చట్టాలు ధనిక వర్గాలకు పాలకుల తైనాతీలకు వర్తించవు. అలాగే భూములు పందేరం పెట్టే చట్టాలు సామాన్య ప్రజలకు ఎప్పటికీ అక్కరకు రావు. సామాన్యులకు సంబంధించినంతవరకు కాంగ్రెస్, బీజేపీ లు రెండూ ఒకటే.  

No comments:

Post a Comment