Thursday 8 December 2016

మోదీ.. ఈ అబ‌ద్దం ఇంకా న‌మ్మాలా?

నాన్న-- పులి క‌థ‌.. తెలుగువారికి చాలా సుప‌రిచిత‌మైన‌దే. భార‌త ప్ర‌ధాని మోడీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు పులి పేరుతో ఆట‌లాడుతున్నాడు. చేవ చ‌చ్చిన చేత‌కాని వారే దుర‌దృష్ట‌వ‌శాత్తు నేత‌ల‌వుతున్నారు. క‌ర్మ దేశంలో ప్ర‌జ‌ల ఖ‌ర్మ‌కాల్చుతున్న దౌర్భాగ్యులు ఎక్కువ‌య్యారు. ఇంత తీవ్ర‌ప‌ద‌జాలం అవ‌స‌ర‌మా?. అనుకోవ‌చ్చు.. కొంత వివ‌రంగా ప‌రిశీలిస్తే మీకూ ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. మీరు భ‌జ‌న‌ప‌రులు కాకుంటేనే సుమా. అధికారంలోని వారు త‌మ లేదంటే త‌మ చ‌మ్చాల దోపిడీని కొనసాగించటం కోసం ప్రజలకు సమస్యలు సృష్టిస్తారు. ప్రజలకు సమస్యలు సృష్టించకుంటే దోపిడీ సాగదు. అలా సృష్టించిన స‌మ‌స్యే నోట్ల ర‌ద్దు. డీమానిటైజేష‌న్ ప్ర‌క‌టించిన‌ప్పుడు చెప్పిన క‌బుర్ల‌న్నీ కంచికి చేరాయి. న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని చెప్పిన ప్ర‌ధాని మాట‌లు ఎంత‌టి అబ‌ద్దాలో అంద‌రికీ తెలిసి వ‌స్తుంది. ల‌క్ష‌ల ఖ‌రీదైన సూట్ వేసుకొని బ్లాక్ మ‌నీని అడ్డుకోవ‌డానికి ప్ర‌జ‌లు త్యాగాలు చేయాల‌ని పిలుపునిచ్చిన స‌న్నాసి ఇప్ప‌డు అస‌లు బ‌య‌ట‌కు రాని బ్లాక్ కు స‌మాధానం ఏం చెపుతాడో?. రద్దు చేసిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లలో చలామణిలో ఉన్న మొత్తం 14.95 లక్షల కోట్లు. ఇది రిజ‌ర్వు బ్యాంకు, ఆర్ధిక కార్య‌ద‌ర్శి.. ఇంకా చెప్పాలంటే ప్ర‌ధాని స‌హా అంద‌రూ చెప్పిన లెక్క‌లే. ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 వరకు 11.55 లక్షల కోట్లు  మేర రద్దు చేసిన నోట్ల బ్యాంకుల్లో జమ అయ్యాయ‌ని చెప్పింది. పోస్ట్ ఆఫీసుల్లో 35 వేల కోట్లు జమ అయిన‌ట్లు గ‌ణాంకాలు ఉన్నాయి. నోట్ల రద్దు నాటికి బ్యాంకుల వద్ద 50 వేల కోట‌క్లు రద్దయిన నోట్ల నిల్వలు ఉన్నాయని రిజ‌ర్వు బ్యాంకు ప్ర‌క‌టించింది. కేష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్). చట్టం ప్రకారం రిజ‌ర్వు బ్యాంకు నిర్దేశించిన నిష్పత్తి మేరకు తమ వద్ద డిపాజిట్ అయిన డబ్బుని ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి. అంటే  లయబిలిటీస్ లో 4శాతం డబ్బు రూపంలోనూ, డబ్బు సమాన రూపంలోనూ నిల్వ ఉంచాలి. ఖాతాదారుల డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వినియోగించకుండా ఉండేందుకు, తద్వారా వారి డిపాజిట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిల్వలను రిజ‌ర్వు బ్యాంకు నిర్దేశించింది. న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అయిన జ‌మ 11.55 ల‌క్ష‌ల కోట్లు + పోస్ట్ ఆఫీసుల్లో జ‌మ‌లు 0.35 ల‌క్ష‌ల కోట్లు + రద్దు ప్ర‌క‌ట‌న నాటికి ఆర్బీఐ వ‌ద్ద ఉన్న నిల్వ‌లు 0.50 ల‌క్ష‌ల కోట్లు + సీఆర్ఆర్ కింద ఆర్బీఐ వ‌ద్ద ఉన్న‌వి 4 ల‌క్ష‌ల కోట్లు = మొత్తం 16.40  లక్షల కోట్లు. చ‌లామ‌ణిలో ఉన్న‌దే రూ14.95 ల‌క్ష‌ల కోట్లు అని చెపితే వ‌చ్చింది రూ 16.40 ల‌క్ష‌ల కోట్లు జ‌మ అయ్యాయి. సో అస‌లు బ్లాక్ అనేదే అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఇక లేదు. బ్లూమ్ బర్గ్ పత్రిక ప్రకారం డిసెంబర్ 3 తేదీ నాటికి బ్యాంకుల్లో 12.6 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయింది. అంటే అంకెలు భారీగానే తేడా వ‌స్తున్నాయి. అస‌లు స‌మ‌స్య ఏమిటంటే ఈ అధిక మొత్తం ఎక్క‌డిదో స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంది. “నల్ల ధనం, దొంగ డబ్బు, టెర్రరిజం లపై పోరాటం” అంటూ ఆర్భాటంగా ప్రకటించి 125 కోట్ల ప్రజానీకాన్ని నెల రోజులుగా నానా కష్టాలు పెట్టి, కనీసం మరో ఆరు నెలల పాటు మరిన్ని కష్టాలు పెట్టబోతూ ఒక్క పైసా కూడా నల్ల డబ్బు వెలికి తీయలేని చేతగానితనానికి ప్రధాన మంత్రి మోడీ వివరణ ఇవ్వాల్సి ఉన్నది.  దొంగ నోట్లకు అవకాశం లేకుండా చేసి టెర్రరిజం వెన్ను విరిచామ‌ని జబ్బలు చరిచి మోడీ డీమానిటైజేషన్ తర్వాత కూడా వరసపెట్టి టెర్రరిస్టు దాడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాల్సి ఉన్నది. టెర్రరిస్టుల వద్ద వారం రోజులకే 2 వేల రూపాయల దొంగ నోట్ల ఎలా ప్రత్యక్షం అయ్యాయో చెప్పవలసి ఉన్నది. 

జ‌రిగిన తంతును ఓసారి చూద్దాం.. మోడీకి ముందు కూడా పన్నుల ఎగవేతలు ఈ దేశంలో ఉన్నాయి అయితే మోడీ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత ఈ పన్ను ఎగవేతలు విపరీతంగా పెరిగి పోయాయి. నవంబరు 18న, బీ.జే.పీ యం.పి కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు ( ప్రశ్న నెం. 640) కేంద్ర ఆర్ధిక శాఖ ఇచ్చిన లిఖిత పూర్వక సమాచారం ఇది.  
ఆర్ధిక సం||                        వసూలైన ప్రత్యక్ష పన్నులు            వసూలుకాని ప్రత్యక్ష పన్నులు
                                            (కోట్ల రూ.లలో)                               (కోట్ల రూ.లలో) 
2013-14                                  638596                                      674916 
2014-15                                  695792                                      827690 
2015-16                                  742295                                      929972 
2016-17 (సెప్టెంబరు)            377045                                      903048 
నిర్ధారించిన ఈ పన్నులను వసూలు చేయకపోగా, మోడీ పాలనా కాలంలో ఇదే పారిశ్రామిక వేత్తలకు 2014-15లో రు.5,54,349 కోట్లు, 2015-16లో రు.6,11,128 కోట్లు, 2016-17లో రు.6,67,907 కోట్లు పన్నుల రాయితీలిచ్చారు. మోడీ అధికారం చేపట్టేనాటికి బ్యాంకులలో ఉన్న మొండి బకాయీలు రు.2,50,643 కోట్లు. అది ఏ మాత్రం తగ్గక పోగా పెరిగి 2016 సెప్టెంబరు నాటికి రు.6,24,000 కోట్లు అయ్యింది. మోడీ అధికారంలోకి వచ్చిన రెండున్న సంవత్సరాలలో (6,24,000-2,50,643 ) రు.3,73,357 కోట్లు పెరిగాయి. అంటే 149 % పెరిగాయి. ఇది బ్యాంకులు రద్దు చేసిన రు.1,14,000 కోట్లు పోను మిగిలిన పెరుగుదల. రద్దు చేసిన ఈ రు.1,14,000 కోట్లు కలుపుకుంటే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజలసొమ్ము. ప్రజలసొమ్మును తీసుకొని ఎగవేస్తున్న పారిశ్రామిక వేత్తల ఆస్తులను జప్తుచేసి నిర్థాక్షిణ్యంగా వసూలు చేయటానికి బదులుగా వారి బకాయీలను రద్దు చేస్తున్నారు. ఈ ఎగ్గొట్టిన సొమ్ముకూడా నల్లడబ్బుగా మారుతున్నది. బ్యాంకు బకాయీలనే వసూలు చేయలేనివారు, నల్లధనాన్ని బయటకు తీసి దేశాభివృధ్ధి చేస్తామనటం హాస్యాస్పదం.
విదేశాలకు తీసుకు వెళ్ళే డబ్బుపై అనేక పరిమితులను విధిస్తూ 1973లో ''ఫారన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని'' రూపొందించారు. వాజ్‌పేయీ నాయకత్వంలో బీ.జే.పి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ''ఫారన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ మెనేజ్‌మెంట్‌ చట్టం 1999'' ని తీసుకు వచ్చారు. ఆతర్వాత రిజర్వు బ్యాంకు ''లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం'' ను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం మనదేశం నుండి విదేశాలలో నివశించేవారు అక్కడి ఖర్చులకోసం ప్రతివ్యక్తి మన కరెన్సీతో 25,000 డాలర్లు కొనుక్కొని తీసుకెళ్లవచ్చు. ఈ నిబంధనను 4 ఫిబ్రవరి 2004న చేశారు.ఆతరువాత బీ.జే.పి. ప్రతిపక్షంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ పరిమితిని 50,000డాలర్లకు, ఆతరువాత 75,000 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన వలన మన దేశ డబ్బు బ్లాక్‌ మనీ రూపంలో విదేశాలకు పోతుందని బీ.జే.పి.గోల పెట్టింది. అసలు ఈ విధానాన్నే రద్దు చేయాలని బీ.జే.పి డిమాండు చేసింది. 2014లో మరల బీ.జే.పి.అధికారంలోకి వచ్చింది. రద్దు చేయటం మాట అటుంచి ఈ మొత్తాన్ని జూన్‌ 3,2014 న 1,25,000డాలర్లకు, మే 26, 2015 నుండి 2,50,000 డాలర్లు (సుమారు 1 కోటి62 లక్షల రూపాయలు)కు పెంచారు. అంటే కుటుంబంలో 4గురు విదేశాలకు వెళితే సుమారు 7 కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో విదేశాలకు తీసుకెళ్ల వచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ విధానంద్వారా 2013-2014 లో రు. 10,700 కోట్లు, 2014-2015లో రు. 30,800కోట్లు, 2015-2016లో రు. 33,500 కోట్లు విదేశాలకు తరలివెళ్ళిందని అంచనా. ఇదంతా చేసింది బీ.జే.పి.నే.
 ప్రజల అలవాటును మాల్స్‌ వైపుకు మళ్ళించాలి. చివరకు తోటకూరకట్ట, కరివేపాకు కొనాలన్నా మాల్‌కు వేళ్ళేటట్లు చేయాలి. ఇది జరగాలంటే ప్రజలు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు , మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు వినియోగించే విధంగా చేయాలి. అలా చేయాలంటే ప్రజల దగ్గర మారకం నోట్లు లేకుండా చేస్తే ప్రతివాడిలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు ఉపయోగించాలన్న ఆలోచన వస్తుంది. కార్డులతో సరుకులు కొనాలంటే దుకాణదారుల వద్ద స్వైపింగ్‌ మిషన్లు ఉండాలి. స్వైపింగ్‌ మిషన్లు పెద్ద దుకాణదారులే ఉంచగలరు. కనుక ప్రజలు తప్పనిసరిగా మాల్స్‌ వైపుకు మళ్ళుతారు. దీనితో చిల్లర దుకాణాలు మూతపడతాయి. ఇదే క‌షాయ‌నేత ల‌క్ష్యం కూడా.

1 comment:

  1. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను కూడా ప‌ట్ట‌లేక‌పోయిన స‌మ‌ర్ధ ప్ర‌ధాని క‌థ‌

    ReplyDelete